
కృతీకి బంపర్ ఆఫర్!
‘ఆవ్ తుజే మోకార్తా’ అంటూ ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌బాబును టీజ్ చేసిన కృతీసనన్ ఆ చిత్రంతోనే కుర్రకారు హృదయాలను దోచేశారు. ఆ తర్వాత ‘దోచెయ్’ సినిమాలో నాగచైతన్య మనసుని కూడా దోచేసుకున్నారు. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అవుతుందని చాలామంది ఊహించారు. అయితే హిందీ రంగంలో అవకాశాలు రావడంతో కృతి అక్కడ బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లో ‘హీరో పంతి’, ‘దిల్‌వాలే’ చిత్రాల్లో నటించిన కృతీని ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వరించినట్లు సమాచారం. అక్కినేని నాగార్జున కెరీర్‌లో హిట్ పిక్చర్‌గా నిలిచిపోయిన వాటిలో ఒకటైన ‘హలో బ్రదర్’ చిత్రాన్ని అంత సులువుగా మర్చిపోలేం. ఆ చిత్రానికి హిందీ రీమేక్‌గా సల్మాన్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘జుద్వా’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ రీమేక్ హిందీలో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ చిత్రాన్ని తన కుమారుడు వరుణ్ ధావన్ హీరోగా మళ్లీ రీమేక్ చే యడానికి దేవిడ్ ధావన్ సన్నాహాలు చేస్తున్నారు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉంది. ఒక కథానాయికగా కృతీసనన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. మరో కథానాయికగా శ్రద్ధాకపూర్ పేరును పరిశీలిస్తున్నారట. పాత ‘జుడ్వా’లో కరిష్మా కపూర్, శిల్పాశెట్టి అద్భుతంగా నటించారు. రెండు పాత్రలూ నటనకు అవకాశం ఉన్నవే. సో.. కృతీకి కనుక ఈ రీమేక్‌లో అవకాశం దక్కితే నటిగా ఇంకా నిరూపించుకోవడానికి స్కోప్ దొరికినట్లే!