ఎలా పనిచేస్తుంది?
మైక్రోస్కోప్
మనం కంటితో స్పష్టంగా చూడలేని వాటిని చూసేందుకు భూతద్దాన్ని ఉపయోగిస్తాం. ఇంకా చిన్న వాటిని అంటే... అంటే కంటికి అసలు కనిపించనటువంటి అతి సూక్ష్మమైన పదార్థాలను చూడాలంటే మాత్రం మైక్రోస్కోప్‌లో చూడాల్సిందే! సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్‌ను ఎవరు కనిపెట్టారో, అది ఎలా పని చేస్తుందో చూద్దాం... డచ్‌కి చెందిన జకారియా జాన్సన్ అనే ఓ కళ్లజోళ్ల వ్యాపారి క్రీ.శ. 1590లో మైక్రోస్కోప్‌ని రూపొందించాడు. ఆ తర్వాత అందులో అనేకమైన మార్పులు జరిగాయి.1840 ప్రాంతం నుంచి ఇంచుమించు మనం ఇప్పుడు చూస్తున్న తరహా మైక్రోస్కోప్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి.
మెక్రోస్కోప్‌లో విల్లంబులా వంగి ఉండే బోలుగా ఉండే ఒక గొట్టానికి రెండు వైపులా రెండు కుంభాకార దర్పణాలు అంటే ఉబ్బెత్తుగా ఉండే అద్దాలు అమర్చి ఉంటాయి. లక్ష్యం వైపు అంటే మనం చూడదలచుకున్న వస్తువు వైపు చూసే అద్దానికి (దీనినే ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు) ఒక చిన్న గొట్టం, దానికి ఒక పలుచని అద్దం అమర్చి ఉంటుంది. మనం కన్ను పెట్టి చూసే అద్దానికి (దీన్ని ఐ లెన్స్ లేదా ఐ పీస్ అంటారు) పెద్ద గొట్టం, దానికి పెద్ద అద్దం అమర్చి ఉంటాయి.
మనం చూడదలచిన పదార్థాన్ని మైక్రోస్కోప్ ప్లాట్‌ఫామ్ మీద, ఆబ్జెక్టివ్ లెన్స్‌కు సమీపంలో ఉంచుతారు. ఇది ఆ పదార్థాన్ని దాని అసలు పరిమాణం కన్నా కొన్ని వందల రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. దాని మూలంగా మనం ఆ పదార్థంలో ఏమేమి ఉన్నాయో, ఎంత పరిమాణంలో ఉన్నాయో స్పష్టంగా చూడగలం. ఇవి కాంతిని ఆధారంగా చేసుకుని, వస్తువును పెద్దదిగా చేసి చూపిస్తాయి కాబట్టి వీటిని ఆప్టికల్ మైక్రోస్కోప్స్ అంటారు.
అదే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో అయితే... కాంతికి బదులుగా ఎలక్ట్రాన్ కిరణాలు ఉంటాయి. సాధారణంగా వీటిని బయొలాజికల్ లేదా ఇన్ ఆర్గానిక్ పదార్థాలను చూడటానికి ఉపయోగిస్తారు. దీని మూలంగా పదార్థం నిర్మాణాన్ని, అందులో ఉండే లోపాలను పరిశీలించగలం. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, వస్తువు అసలు పరిమాణం కన్నా కొన్ని మిలియన్ల రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. ఇదీ మైక్రోస్కోప్ పని విధానం.