క్యారె ట్టూ గుడ్‌ | Carrot gokod for health | Sakshi
Sakshi News home page

క్యారె ట్టూ గుడ్‌

Published Fri, Feb 17 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

క్యారె ట్టూ గుడ్‌

క్యారె ట్టూ గుడ్‌

తవ్వితే బయటపడే వంటల ఖజానా క్యారెట్‌!
వెజిటబుల్‌లో దీనిని స్టార్‌ అంటారు.
దుంపల్లో తార అన్నమాట.
అన్నమాట ఎందుకు? తిన్నమాటే!!


క్యారెట్‌ కేక్‌
కావలసినవి: క్యారెట్‌ తురుము – ఒకటిన్నర కప్పు, మైదా – 2 కప్పులు, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ – ఒక టిన్ను (500 ఎం.ఎల్‌), వెనిలా ఎసెన్స్‌ – అర టీ స్పూన్, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్‌మిస్‌.. – అర కప్పు, పాలు – అర కప్పు

తయారీ: ∙మైదా, బేకిండి పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి. వెన్న పంచదారపొడి, కండెన్స్‌డ్‌ మిల్క్, వెనిలా ఎసెన్స్‌ వేసి నురగ వేసి గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా మిశ్రమం క్యారెట్‌ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్‌ టిన్ను లోపల ఫాయిల్‌ పేపర్‌ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదా చేత్తో టిన్ను లోపల అంతా సర్దాలి. ఒవెన్‌ని 150 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చేసి, అర గంటపాటు బేక్‌ చేసి తీయాలి. తర్వాత కట్‌ చేసి, సర్వ్‌ చేయాలి.

నోట్‌: ఈ కేక్‌ను కుకర్‌లోనూ తయారుచేయవచ్చు. కుకర్‌ అడుగున ఇసుక లేదా ఉప్పు పోసి తగిన స్టాండ్‌ అమర్చి, ఆ పైన కేక్‌ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టె, పైన మూత ఉంచాలి. వెయిట్‌ పెట్టకుండా 40–50 నిమిషాలు బేక్‌ చేయాలి.

క్యారెట్‌ పచ్చడి
కావల్సినవి:  క్యారెట్లు – 2, కారం – 1 1/2 టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వెనిగర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఆవనూనె – 6 టేబుల్‌ స్పూన్లు

తయారీ:  ∙పీలర్‌తో క్యారెట్‌ పై తొక్క తీయాలి. పొడవాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పసుపుగా అనిపించే భాగాన్ని తీసేయాలి. ఈ ముక్కలలో ఉప్పు వేసి అర గంటసేపు ఉంచాలి. తర్వాత చేత్తో కలిపి, నీళ్లు పోసి వడకట్టాలి. 15–20 నిమిషాలు జల్లిలో వేసి నీళ్లన్నీ పోయే వరకు ఉంచాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, వెనిగర్, నూనె వేసి కలపాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన క్యారెట్‌ ముక్కలను వేసి కలపాలి. కారం, ఉప్పు ఎవరి ఇష్టమ్మేరకు వారు కలుపుకోవచ్చు. దీనిని ఒక జార్‌లో వేసి మూత పెట్టాలి. (వేడి నూనె పోయకూడదు. దీంట్లో పచ్చిమామిడికాయ తురుము కూడా వేసి కలుపుకోవచ్చు. 2–3 రోజులు నిల్వ ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. మూడవ రోజున భోజనంలోకి పప్పు వడ్డించినప్పుడు కాంబినేషన్‌గా ఈ పచ్చడిని వడ్డించాలి. దీంట్లోకి ఆవనూనె వాడితేనే రుచిగా ఉంటుంది.

క్యారెట్‌ వడ
కావల్సినవి: క్యారెట్‌ తురుము – కప్పు, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – 2 రెమ్మలు, శనగపిండి – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత

తయారీ:  ∙వెడల్పాటి గిన్నెలో క్యారెట్‌ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత దీంట్లో శనగపిండి వేసి కలపాలి. (నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఉల్లి, క్యారెట్‌ తురుములోని తడితోనే పిండి ముద్దలా అవుతుంది) నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అరచేతితో వత్తాలి. ఇలాగే అన్నీ చేయాలి. కడాయి పొయ్యిమీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన పట్టీలను వేసి రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. తర్వాత నూనె పీల్చుకోవడానికి పేపర్‌ టవల్‌ మీద వేయించిన పట్టీలను వేయాలి. తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకొని వేడి వేడిగా టొమాటో చట్నీ లేదా కెచప్‌తో వడ్డించాలి.

క్యారెట్‌  రొయ్యలు
కావల్సినవి:  క్యారెట్లను నిలువుగా సన్నని ముక్కలుగా కోయాలి – 2, గుడ్లు – 4, రొయ్యలు – 15 (శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), ఉల్లిపాయలు – 3 (సన్నగా తరగాలి), నూనె – 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, సోయా సాస్‌ – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌

తయారీ:  ∙ఒక చిన్న గిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీంట్లో మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి. పొయ్యిమీద కడాయి పెట్టి నూనె వేసి, ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయలు వేగాక సిద్ధంగా ఉంచిన రొయ్యలను వేసి, సోయా సాస్‌ చల్లి వేయించాలి. దీంట్లో క్యారెట్‌ తరుగు వేసి పైన మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టి, 3–4 నిమిషాలు కదపకుండా ఉంచాలి. తర్వాత గరిటతో రెండోవైపు తిప్పి, 2 నిమిషాలు ఉంచి ఒకసారి కలపాలి. వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి.

క్యారెట్‌ సూప్‌
కావల్సినవి:  క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి), ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి), వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు, నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు, టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్‌ స్పూన్‌

తయారీ: ∙క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement