అవని, ఆనంద్‌లది అన్యోన్యమైన దాంపత్యం. చక్కటి పిల్లలు. ఏ కొరతాలేని కుటుంబం. కానీ, లేనిదొక్కటే ఇరువురి తల్లిదండ్రుల ఆదరణ, అంగీకారం. కారణం... ఇరువురూ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్లయినా పెద్దలు పట్టు వీడలేదు. వారి యోగక్షేమాలు పట్టించుకోలేదు. ఇక ఆనంద్ అమ్మానాన్నలైతే తమకు కోడుకే లేడన్నారు. ఇంతలోనే అనుకోని శరాఘాతం. గుండెపోటుతో ఆనంద్ హఠాన్మరణం. కుటుంబం వీధిపాలైంది. ఆనంద్ ఉన్నన్ని రోజులు అవని గుమ్మం దాటి వెళ్లలేదు.
ఇప్పుడేమో షాక్‌కు లోనై బయటకు వెళ్లలేని పరిస్థితి. ఆదుకొనే నాథుడెవరూ లేరు. అవని స్నేహితురాలు, ఆనంద్ తల్లిదండ్రులను సంప్రదించింది. కోడలూ మనుమళ్లను ఆదుకోమని అర్థించింది. తమకు కొడుకే లేప్పుడు అవనితో మాకు సంబంధం లేదు అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. కనీసం కొడుకు ఆఖరి చూపుకోసమైనా రాలేదు.
అవని స్నేహితురాలు అవని వివాహం గురించి ఆరా తీసింది. తరచి తరచి అడగ్గా ఆ పెండ్లి స్నేహితుల సమక్షంలో అయిందని, తర్వాత రిజిష్టర్ ఆఫీస్‌కు వెళ్లామని అవని తెలిపింది. అవని స్నేహితురాలు ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే అవని అత్తమామలు ఆమె వివాహం గురించి అనేక అభ్యంతరాలు లేవనెత్తారు. అసలామె కోడలేకాదన్నారు. ఆస్తి రాదన్నారు. కానీ ‘అవని-ఆనంద్‌ల వివాహం’ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2002 ప్రకారం రిజిష్టర్ చేయబడింది.
ఈ చట్టం ఉద్దేశం వివాహాలు రిజిష్టర్ అయితే... బాల్యవివాహాలు జరగకుండా నిరోధించవచ్చు; అక్రమ వివాహాలని నియంత్రించవచ్చు; ఇంకా... బైగమీ, పాలీగమీ వంటి వివాహాలు జరుగకుండా చూసేందుకు, భర్త ఇంటిలో హక్కులను కోరేందుకు, భార్యలను వదిలేయకుండా భర్తలను నిరోధించేందుకు, దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయిన స్త్రీలకు వారసత్వ హక్కులు కోరేందుకూ అవకాశం ఉంటుంది. కనుక అవనికి, ఆమె పిల్లలకూ ఆస్తిలో వారసత్వ హక్కులు సంక్రమిస్తాయి. వివాహం పెద్దల నెదిరించి చేసుకున్నా ‘రిజిస్ట్రేషన్’ చేయించి ఆనంద్ మంచి పనిచేశాడు. ఇక అవని, ఆమె పిల్లలకు ఆస్తిలో వారసత్వ హక్కులు వస్తాయి. ఆమె వివాహాన్ని ఎవ్వరూ చెల్లదని తృణీకరించే అవకాశం లేదు.
వితంతు కోడలికి ఆస్తిలో హక్కుంటుంది
Published Mon, Dec 28 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM
Advertisement
Advertisement