అపూర్వ బంధనం | Chandrashekhar Ghosh of Bandhan Microfinance | Sakshi
Sakshi News home page

అపూర్వ బంధనం

Published Mon, Apr 28 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

అపూర్వ బంధనం

అపూర్వ బంధనం

సక్సెస్ స్టోరీ
 
చంద్రశేఖర్ ఘోష్ కలలు పెద్దవి. వాటి కంటే కుటుంబబాధ్యతలు మరీ పెద్దవి.  ఎందుకంటే నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు, తల్లికి సంబంధించిన బాధ్యత అంతా తానే చూసుకోవాలి. కలలకేం...ఎన్నయినా కనవచ్చు. పూట గడవాలి కదా!
 
అగర్తలా(త్రిపుర)లోని తమ  ‘స్వీట్ షాపు’లో తండ్రికి సహాయంగా ఉంటూనే మరోవైపు చదువుకునేవాడు. కుటుంబ బాధ్యతల కోసం చదువు పూర్తి కాగానే ఒక స్వచ్ఛందసంస్థలో ఉద్యోగంలో చేరారు చంద్రశేఖర్. అలా పదిహేను సంవత్సరాల కాలంలో... మొత్తం ఇరవై రెండు స్వచ్ఛంద సంస్థలలో పనిచేశారు.  జేబు శాటిస్‌ఫ్యాక్షన్ తప్ప జాబు శాటిస్‌ఫ్యాక్షన్ లేదు.
 
ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థ తరపున బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్నప్పుడు పేదరికం విశ్వరూపాన్ని చూశారు చంద్రశేఖర్.
 
ఆకలి బాధ తట్టుకోలేక మట్టిని తింటున్న పేద చిన్నారులను చూశారు. వడ్డీ చక్రవడ్డీగా మారి...ఆ తరువాత రాక్షస వడ్డీ అవతారం ఎత్తి పేదలను నంజుకుంటున్న క్రూరత్వాన్ని చూశారు. ఒక విధంగా చెప్పాలంటే  ఆయన చూసిన పేదరికం...ఆయనను మార్చేసింది. ఇక ఉద్యోగం కాదు...పదిమందికీ ఉపయోగపడే పనేదైనా చేయాలనుకున్నారు ఆయన.
 
పేదలకు చిన్నమొత్తంలో తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే సంస్థను మొదలుపెట్టాలనుకున్నారు. ఎందుకంటే 70 శాతం మంది పేదలకు బ్యాంకులు రుణాలు  ఇవ్వడం లేదు. సంస్థ స్థాపించడానికి నిధుల సమీకరణలో భాగంగా బ్యాంకులను ఆశ్రయించారు చంద్రశేఖర్. చిత్రమేమిటంటే ఏ బ్యాంకూ అతనికి రుణం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సన్నిహితులు, బంధువుల సహాయంతో మొత్తం రెండు లక్షలు సమకూర్చుకొని 2001లో కోల్‌కతాకు 60 కిలోమీట్లర దూరంలో ఉన్న కొన్నగార్ అనే గ్రామంలో ‘బంధన్’ పేరుతో సూక్ష్మరుణ సంస్థను ప్రారంభించారు.  

‘2020 నాటికి  కోటి మంది పేదలకు రుణం అందించాలి’ అనే చంద్రశేఖర్ లక్ష్యాన్ని చూసి బిగ్గరగా నవ్విన వారూ లేకపోలేదు. అయితే దేన్ని గురించీ ఆయన ఆలోచించలేదు. మొదటి అడుగుగా.....ప్రతి పేదవారి ఇంటికి వెళ్లి తన సంస్థ గురించి ప్రచారం చేశారు. పూచీకత్తు లేకుండా రుణం అనే మాట... వాళ్లకు కొత్తగా, చల్లగా వినిపించింది. బంధన్‌లో రుణాలు తీసుకొని వ్యాపారం మొదలు పెట్టి విజయం సాధించిన మహిళలు  ఎందరో ఉన్నారు. వారి విజయగాథలను ఇతరులతో పంచుకోవడం అంటే చంద్రశేఖర్‌కు ఇష్టం.
 
‘‘బ్యాంకులు పేదలకు దగ్గర ఉన్నట్లుగానే ఉంటాయిగానీ, చాలా దూరంగా ఉంటాయి’’ అని చెప్పే చంద్రశేఖర్ ‘‘బ్యాంకులు పేదల దగ్గరికి నడచి రావాల్సిన అవసరం ఉంది’’ అంటారు. 100 శాతం రికవరీతో కొత్త బాట వేసింది బంధన్. 18 రాష్ట్రాల్లో లక్షలాది క్లయింట్లతో ఉన్న ‘బంధన్’ మన దేశంలో అతిపెద్ద సూక్ష్మ రుణసంస్థగా మొదటి స్థానంలో, ప్రపంచంలో రెండోస్థానంలో నిలిచింది. తాజాగా ఆర్‌బిఐ అనుమతితో ‘బంధన్’ బ్యాంకుగా మారుతోంది.
 
‘‘సందేహించే చోటుకు విజయం రాదు’’ అంటారు చంద్రశేఖర్ ఘోష్.
 ‘‘నా వల్ల అవుతుందా?’’ అని ఏ రోజైనా సందేహించి ఉంటే... ఈరోజు ఆయన ఖాతాలో ఇన్ని విజయాలు ఉండేవి కాదు కదా!
 
  సేవా మార్గం
 ‘బంధన్’ను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలనుకొని ఆ కలను నెరవేర్చుకున్నారు చంద్రశేఖర్ ఘోష్. ఇప్పుడు ఆయన సేవాకార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తన చదువంతా స్వచ్ఛందసేవాసంస్థల ఆర్థిక సహాయంతోనే  సాగింది. అలా వారు సహాయ పడకపోతే  తాను చదువుకోగలిగేవాడు కాదు. అందుకే ఇప్పుడు ఎందరో విద్యార్థులను తన డబ్బులతో చదివిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలోనే వదిలేసిన వారికి ఆర్థిక సహాయం చేసి వారు తిరిగి చదువుకునేలా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement