మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు... | Character hit | Sakshi
Sakshi News home page

మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...

Published Thu, Oct 15 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...

మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...

సినిమా పేరు : పట్నం వచ్చిన పతివ్రతలు (1982)  
డెరైక్ట్ చేసింది : మౌళి 
సినిమా తీసింది : అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు 
మాటలు రాసింది : జంధ్యాల-కాశీ విశ్వనాథ్

 
పిండి కొద్దీ రొట్టె అంటారు. కానీ నూతన్ ప్రసాద్‌కి ఇంత పిండి ఇచ్చినా అంత రొట్టె చేసేవాడు. అదీ చాలా రుచికరంగా. పాత్ర చిన్నదా పెద్దదా అనేది చూసుకునేవాడు కాదు. తన పేరుకి తగ్గట్టే నూతనత్వం కోసం తపించేవాడు. అది హీరో కావచ్చు. విలన్ కావచ్చు. కేరెక్టర్ ఆర్టిస్టు కావచ్చు.కమెడియన్ కావచ్చు... ఏదైనా నూతన్‌ప్రసాద్ యాక్ట్ చేస్తే ఆ పాత్రలకో దర్జా. ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చేసిన చాలా పాత్రలు ఎవర్‌గ్రీన్. అసలే కామెడీ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు... ఈ టైమ్‌లో నూతన్‌ప్రసాద్‌ని ఓసారి స్మరించుకోవాల్సిందే!
 
హిట్ క్యారెక్టర్
అసలు పేరు    :    తాడినాడ దుర్గా సత్యవరప్రసాద్
పుట్టింది        :    1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో
తొలి చిత్రం      :    నీడలేని ఆడది (1973)
ఆఖరి సినిమా    :    రాజు-మహరాజు (2009)
మొత్తం చిత్రాలు    :    సుమారు 500
మరణం    :    2011 మార్చి 30
 
టాప్ టెన్ మూవీస్
1.    అందాల రాముడు (1973)
2.    చలి చీమలు (1975)
3.    రాజాధిరాజు (1980)
4.    పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
5.    సుందరి సుబ్బారావు (1984)
6.    అహ నా పెళ్లంట (1987)
7.    {పజాస్వామ్యం (1987)
8.    నవభారతం (1988)
9.    బామ్మ మాట-బంగారు బాట (1989)
10.    వసుంధర (1992)
 
మన రాష్ట్రంలో ఎంతమంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు ఉంటారు? లెక్క తెలీదు కానీ... వాళ్లందర్నీ ఓ చోట నిలబెడితే ఒకే ఒక్కడు మాత్రం చాలా స్పెషల్‌గా కనబడతాడు. ఆ ఒక్కడే - బెల్లం అప్పారావ్. మన రాష్ట్రపతి - ప్రధానమంత్రి - మిలట్రీ ఛీఫ్ - వీళ్లెవరూ కూడా దేశం గురించి ఇతను ఆలోచించినంత ఎక్కువ ఆలోచించరు. ప్రతి రోజు - ప్రతి గంట - ప్రతి నిమిషం - ప్రతి క్షణం -  ఈ దేశం గురించి  తెగ ఫీలైపోతుంటాడు. టెన్షన్ పడిపోతుంటాడు. ఆగమాగమైపోతుంటాడు. దేన్నైనా దేశంతో ముడిపెట్టేస్తుంటాడు. అందర్నీ ఇరకాటంలో పెట్టేస్తుంటాడు.
    
శాంపిల్ సీన్ నం. 1
ఓ లాడ్జి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. మన స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అండ్ ఎనర్జిటిక్ అండ్ పేట్రియాటిక్ ఇన్‌స్పెక్టర్ బెల్లం అప్పారావ్ దిగాడు. అతని వెనుకే అయిదుగురు కానిస్టేబుళ్లు. ‘‘కానిస్టేబుల్.. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. వ్యభిచారమనేది రాన్రానూ ఎక్కువైపోతోంది. మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూమూ, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యానెక్కించేయండి... అంతే’’ అని ఆర్డరేశాడు. కానిస్టేబుళ్లు లాడ్జిని అణువణువూ గాలించేస్తున్నారు. ఆ లాడ్జికొచ్చేవాళ్లకి మాలిష్ చేసే కొండల్రావ్ వచ్చి చాలా వినయంగా ‘‘దండాలండీ ఇన్‌స్పెక్టర్ గారూ’’ అన్నాడు. ‘‘దండలకు, దండాలకు లొంగే మనిషిని కాను నేను. ఎందుకంటే... దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. లొంగకూడదు’’ అన్నాడు బెల్లం అప్పారావ్ చాలా సీరియస్‌గా.

‘‘మన దేశ పరిస్థితుల్లాగే తమరి తల కూడా పెనం మీద వేసిన పెసరట్టులాగా కుతకుతలాడిపోతోంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే హెడ్ అంతా కూలింగ్ అయిపోద్ది’’ అంటూ కొండల్రావ్ చాలా నాజూగ్గా మాటల్లోకి దించి మాలిష్ చేయడానికి సిద్ధమయ్యాడు. ‘‘నేనిప్పుడు డ్యూటీ మీదున్నా. డ్యూటీలో ఉన్నప్పుడు మాలిష్ చేయించుకుంటే అమెరికా, రష్యా వాళ్లు ఏమనుకుంటార్రా ఇడియట్’’ అని తిట్టినంత పని చేశాడు బెల్లం అప్పారావ్.

అయినా కొండల్రావ్ తగ్గలేదు. ఇన్‌స్పెక్టర్‌కి మాలిష్ చేసి, ఎంతో కొంత నొక్కేయాలి.‘‘రెండో కంటోడికి తెలీకుండా ఆ మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తా రండి’’ అంటూ ఇబ్బంది పెట్టేసి మరీ బెల్లం అప్పారావ్‌ని పక్కకు తీసుకెళ్లాడు. తన టోపీ పక్కన పెట్టి హెడ్‌ని కొండల్రావ్‌కి అప్పగించాడు బెల్లం అప్పారావ్. కొండల్రావ్ చాలా ఒడుపుగా మాలిష్ చేస్తున్నాడు. ‘‘మీలాంటి ఖరీదైన బుర్రకాయల్ని కొబ్బరికాయల్లాగా వదిలేయకుండా, అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి. ఎంచేతంటారా? దేశానికి ఢిల్లీ ఎలాంటిదో... మన బాడీకి తలకాయ అలాంటిదండీ’’ చెప్పాడు కొండల్రావ్. ‘‘నాదసలే తూగోజీ... కాకినాడ. పది ఢిల్లీలతో సమానం’’ గర్వంగా చెప్పాడు బెల్లం అప్పారావ్.

మాలిష్ పూర్తయింది. కొండల్రావ్ చేతులు నలుపుకోవడం చూసి ‘‘ఏంటి చేతులు నలుపుకుంటున్నావ్? డబ్బులా? అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. డబ్బులడగకూడదు... తీసుకోకూడదు’’ అని తన నెత్తి మీద టోపీ పెట్టుకుని మళ్లీ డ్యూటీకి సిద్ధమైపోయాడు ఇన్‌స్పెక్టర్ బెల్లం అప్పారావ్. కొండల్రావ్ మహాముదురు. ఈ ఇన్‌స్పెక్టర్ దగ్గర ఎలా డబ్బులు వసూలు చేయాలో బాగా తెలుసు. ‘‘అయ్యా.. విషయం చెప్పడం మరిచిపోయా. మీకు డీఎస్‌పీగా ప్రమోషనొచ్చినట్టు కలొచ్చింది’’ అన్నాడు కొండల్రావ్. దాంతో బెల్లం అప్పారావ్ ఖుష్ అయిపోయి, జేబులోంచి డబ్బులు తీసిచ్చేశాడు. కొండల్రావ్ ఆ డబ్బుని ముద్దు పెట్టుకుంటూ ‘‘బాబూ... మీ తలకాయను జాగ్రత్తగా చూస్కోండి’’ అన్నాడు.

‘‘నా తలకాయకు ఎటువంటి డేంజరూ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాన్నేను’’ అంటూ తన సీక్రెట్ చెప్పేశాడు బెల్లం అప్పారావ్. ఈలోగా కానిస్టేబుల్స్ వచ్చి ‘‘సార్... ఆడంగులెవరూ లేరు’’ అన్నారు. బెల్లం అప్పారావ్ ఆశ్చర్యపోతూ ‘‘వ్వాట్... ఒక్కరు కూడా దొరకలేదా? పోయినసారొచ్చినపుడు నలుగురు ఆడకూతుళ్లు దొరికారు. ఈసారి ఒక్కళ్లూ దొరకలేదంటే... దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి... మనమే వ్యాన్ ఎక్కుదాం’’ అంటూ లాడ్జిలోంచి బయటకు దారి తీశాడు.
   
శాంపిల్ సీన్ నం. 2
మాలిష్ కళాకారుల సంఘం మీటింగ్. చాలా వేడివేడిగా జరుగుతోంది. కొండల్రావ్ తమ జాతినుద్దేశించి చాలా ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. అందరూ విప్లవానికి సన్నద్దం కావాలని ఉత్తేజపరుస్తున్నాడు. దాంతో అందరూ చప్పట్లు కొట్టారు. సరిగ్గా అదే టైంలో ఎంటరయ్యాడు బెల్లం అప్పారావ్. ‘‘ఆపండి... ఇది చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ కూర్చోవాల్సిన సమయం కాదిది. అసలే మన దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా... రైట్ నుంచి పాకిస్థాన్... ఫ్రంట్ నుంచి వరదలు... బ్యాక్ నుంచి కరువులు... మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసే మీరు కూడా విప్లవం లేవదీస్తే - అమెరికా, రష్యా వాళ్లు ఏమనుకుంటారు మన గురించి? ఎద్దేవా చేస్తారు’’ అంటూ బెల్లం అప్పారావ్ బాగా క్లాస్ పీకి, వాళ్లందర్నీ అరెస్ట్ చేసి పారేశాడు.
    
శాంపిల్ సీన్ నం. 3
అరెస్టయిన వాళ్లలో ఓ అమ్మాయి గర్భవతి. వెంటనే క్లాసు పీకడం మొదలెట్టాడు బెల్లం అప్పారావ్. ‘‘అసలే మన దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు. ఇలాంటి టైమ్‌లో పిల్లల్ని కనకూడదు. అయినా తొలి కాన్పు కాబట్టి అమెరికా, రష్యాలు ఏమీ అనుకోవు. మగబిడ్డ పుడితే నాలా ఇన్‌స్పెక్టర్‌ని చేయ్. ఆడబిడ్డ పుడితే ఇన్‌స్పెక్టర్‌కిచ్చి పెళ్లి చేయ్’’ అనేసి వెళ్లిపోయాడు. అసలు పిల్లల్ని కనడానికీ - అమెరికా, రష్యాకీ సంబంధం ఏమన్నా ఉందా? మోకాలికీ బోడిగుండుకీ లింకు పెట్టడమంటే ఇదేనేమో!
    
అసలీ బెల్లం అప్పారావ్‌కి పెళ్లయిందా? పెళ్లయినా పిల్లలున్నారా? పిల్లలుంటే స్కూలుకెళ్తున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తోంది కదూ. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ టైమ్‌లో ఇవన్నీ మనకవసరం అంటారా? హ్యాపీగా మాలిష్ చేయించుకుని బుర్ర ఫ్రెష్ చేయించుకోక...
 - పులగం చిన్నారాయణ
 
ఈ ఇన్‌స్పెక్టర్ పాత్రకు అతనే ఇన్‌స్పిరేషన్!

నేను వైజాగ్ పోర్ట్‌ట్రస్ట్ ఆఫీసులో కొన్నేళ్లు ఉద్యోగం చేశా. అక్కడ భాస్కర్రావు అని ఒకతను ఉండేవాడు. మొత్తం దేశం భారమంతా తన మీద ఉన్నట్టుగా, ఎప్పుడో ఏదో ఒకటి గొణుక్కుంటూ తెగ బిల్డప్‌లిచ్చేవాడు. అతని ఇన్‌స్పిరేషన్‌తో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్ర అనుకుని ‘అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...’ అనే ఊతపదం పెట్టా. ఓ రోజు నిర్మాత విజయ బాపినీడు గారిని కలవడానికెళ్తే ఆయన చాలా సీరియస్ మూడ్‌లో ఉన్నారు. ‘‘నాలుగు జోకులు చెప్పండి’’ అనడిగితే నేను ఈ ఇన్‌స్పెక్టర్, మాలిష్ కేరెక్టర్లను యాక్ట్ చేసి సరదాగా చూపించా. ఆయనకు విపరీతంగా నచ్చేసింది. అప్పటికప్పుడు బీరువాలోంచి ఓ స్క్రిప్టు తీశారు. ఓ కన్నడ సినిమా ఆధారంగా రెండేళ్ల క్రితం ఆయన, జంధ్యాలగారు కలిసి ఓ స్క్రిప్టు చేశారు. ఎందుకో నచ్చక పక్కన పెట్టేశారట. ‘‘ఈ రెండు కేరెక్టర్లనీ ఇందులో పెట్టి ఈ స్క్రిప్టుతో వెంటనే సినిమా చేద్దాం’’ అన్నారు విజయ బాపినీడు. అలా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ మొదలుపెట్టారు. ై డెలాగ్స్ నేనే రాశా. ఇన్‌స్పెక్టర్ పాత్రకు నూతన్‌ప్రసాద్‌ని అనుకున్నారు.

మా ఇంటికొచ్చి కేరెక్టర్ గురించి మొత్తం తెలుసుకున్నాడు. ఆ ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకుని తన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్‌కి తగ్గట్టుగా బ్రహ్మాండంగా మౌల్డ్ చేసేసుకున్నాడు నూతన్‌ప్రసాద్. ఈ ఇన్‌స్పెక్టర్ పాత్రకు మేం ప్రత్యేకంగా పేరు పెట్టలేదు. కానీ కాస్ట్యూమ్ మీద నేమ్ ప్లేట్‌లో బెల్లం అప్పారావు అని ఉంటుంది. అదే ఉంచేశాం. ఈ ఇన్‌స్పెక్టర్ పాత్ర సూపర్ డూపర్ హిట్. తర్వాత ఇదే పాత్రను మగమహారాజు, మగధీరుడు, హీరో, కృష్ణగారడి, దొంగకోళ్లు, దొంగల్లో దొర... ఇలా తొమ్మిది సినిమాల్లో కంటిన్యూ చేశాం. ఇదో రికార్డు కూడా. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ లోని నూతన్‌ప్రసాద్, రావుగోపాలరావుల డైలాగ్స్ - క్యాసెట్ రూపంలో కూడా వచ్చాయి.
 - కాశీ విశ్వనాథ్, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement