
రోజువారీ వ్యవహారాల్లో ప్లాస్టిక్ ఎంత ఉపయోగకరమైందో మనకు తెలియంది కాదు. అదే సమయంలో దీంతో కాలుష్యమూ ఎక్కువే. ఇకపై మాత్రం ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు బ్రిస్టల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూమిని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌తో నీటిలోని కాలుష్యాన్ని తొలగించేందుకు వీరు ఓ వినూత్న టెక్నాలజీని అభివద్ధి చేశారు. వస్త్ర పరిశ్రమలో వాడే కృత్రిమ రంగులు కలిసి నీరు కాస్తా విషమవుతున్న విషయం తెలిసిందే. అయితే పాలిస్టైరీన్ అనే ప్లాస్టిక్‌తో తాము ఒక కొత్త పదార్థాన్ని తయారు చేశామని... ఇది కాస్తా నీటిలో కలిసిపోయిన నానోస్థాయిలోని కృత్రిమ రంగులనూ తొలగించగలదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జూలియన్ ఎస్టోయి అంటున్నారు.
పాలిస్టైరీన్‌ను సైక్లోహెక్సేన్‌తో కలిపి ఉష్ణోగ్రతలను ఆరు డిగ్రీల స్థాయికి తగ్గించడం ద్వారా కొత్త పదార్థం తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత సైక్లోహెక్సేన్‌ను తొలగిస్తే ప్లాస్టిక్ గణనీయంగా ఉబ్బిపోతోంది. ఈ దశలో దానిపై నానోస్థాయి పూత పూస్తే అది నీటిలోని కృత్రిమ రంగుల తాలూకు కణాలను ఆకర్శించి తనలో నిక్షిప్తం చేసుకుంటుందని జూలియన్ వివరించారు. మహా సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తను మరింత సమర్థంగా వాడుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని జూలియన్ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment