
చీరలకు ఛీర్స్
నెట్ ఒళ్లంతా కళ్లున్న ఇంద్రుడి లాంటిది. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎంతటి సీరియస్ విషయాన్నయినా జోకుగా, ఎంతటి జోకునైనా సీరియస్‌గా చెప్పగలిగే కెపాసిటీ కేవలం నెట్‌కే ఉంది. కాస్త వైచిత్రి ఉంటే చాలు విషయం వైరల్ అయిపోతుంది. కొంచెం విషయం ఉంటే చాలు ఛాతీ విరుచుకుని షంషేర్ లా షేర్ అవుతుంది. సమాచారంలో సత్తా ఉంటే ఇక లైకులే లైకుకు. నిమిషానికి గిగా బైట్ల కొద్దీ రిలీజ్ అయ్యే ఇంటర్ నెట్ సముద్రం ఒడ్డున కాసిన్ని గులకరాళ్లు ఏరుకుందామా? ఏమో... గులకరాళ్లనుకున్నవి ముత్యాలో వజ్రాలో కూడా కావచ్చు. చెప్పలేం.
చీరను ఆరు గజాల మన్మథ లేఖ అని ఉత్తినే అనలేదు. చీర లావును దాస్తుంది. సన్నగా ఉండేవారికి కాస్త పర్సనాలిటీనిస్తుంది. ఎలాంటి వారికైనా అందాన్నిస్తుంది. బ్యూటీలో చీరకు పోటీ లేదు. మిగతా డ్రెస్‌లన్నీ సౌకర్యాల కోసం. చీరలు మాత్రమే సౌందర్యాల కోసం. ఆధునికత హోరులో చీరను మరచిపోవద్దన్న మెసేజ్‌తో ఈ మధ్యే ఢిల్లీలో దేవిదితి అనే సంస్థ చీరలు కట్టుకున్న యువతులతో ఫ్లాష్ మాబ్ నిర్వహించింది. లుంగీ డాన్స్‌ను మించి ఆ చీర డాన్స్ అదిరింది. అది చూసిన వారికి అర్థమైంది చీరను ఎందుకు ఆరుగజాల మన్మథ లేఖ అంటారో. ఈ ఫ్లాష్ మాబ్ తరువాత ఢిల్లీ అమ్మాయిలు చీరకు ‘ఛీర్స్’ చెబుతున్నారట.
బెంగుళూరులోనూ #100 Saree Pact అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మొదలైందట. ఒక్క ఏడాదిలో వంద చీరలు (కొత్తవ బాబూ కొత్తవి) వేసుకుని తీరతామని ఇద్దరు మహిళలు శపథం పట్టి మరీ ఈ హ్యాష్ ట్యాగ్ మొదలుపెట్టారు. ఇప్పుడది వైరల్ అయిపోయింది. (మగాళ్లూ .... పర్సులు జాగత్త). http://mashable.com/2015/10/30/watch-indias-first-ever-saree-flash-mob-in-delhi/# ihum9L1e6qqr
క్యాజీ... ఫోర్ జీ...
దేనిమీదైనా జోకు వేసుకోవడం మనోళ్లకు తెలిసినట్టు మరెవరికీ తెలియదు. అంతే కాదు... మనం దేన్నయినా జోకు చేసేయగలం. నిన్నటి దాకా ఎయిర్ టెల్ ఫోర్ జీ అమ్మాయిపై లైకుల వర్షం కురిసింది. ఇప్పుడు జోకుల కుండపోత కొనసాగుతోంది. ఆ జోకులతో సోషల్ మీడియా అంతా తడిసి ముద్దవుతోంది. మచ్చుకు కొన్ని మీ కోసం...
మనమంతా దీపావళి పండగ చేసుకుంటుంటే ఎయిర్ టెల్ ఫోర్ జీ గర్ల్ అప్పుడే సంక్రాంతి సంబరాలు చేసేసుకుంటోంది. అంత ఫాస్టు మరి.
ఇంకోటి - చిరుత వేగపు ఉసెయిన్ బోల్ట్ భోరుమంటున్నాడట. ఎయిర్ టెల్ ఫోర్ జీ ఫాస్టెస్ట్ అయితే మరి నేనెవరిని? అంటున్నాడట.
పెద్ద మనసు తండ్రి పాత్రల అలోక్‌నాథ్ ఇలా అంటున్నాడట. ‘‘ఈ అమ్మాయి చాలా సంస్కారవంతురాలు. ఎందుకంటే ఫోర్ ని కూడా జీ అనిపిస్తోంది. ఇతరులను ఆయియే జీ, జాయియే జీ, బైఠియే జీ అని గౌరవంగా పిలుస్తాం. ఈ అమ్మాయి ఫోర్ ని కూడా ఫోర్ జీ అంటోంది. ఎంత మంచి పిల్ల.’’ కొందరికి ఎయిర్ టెల్ అమ్మాయి గొప్పలు నచ్చడం లేదు. వాళ్లూ జోకులేస్తున్నారు. నిజంగా ఇంత ఫాస్టయితే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ని పోస్ట్ పెయిడ్‌గా మార్చడానికి వారం రోజులెందుకు? అని వాళ్లడుగుతున్నారు. రావణాసురుడి తర్వాత అంత గర్వం ఉన్నదెవరికి? ఎయిర్ టెల్ ఫోర్ జీ అమ్మాయికి!! తన మొబైల్ ఫాస్ట్ అని బడాయి.... ఇది ఇంకో విమర్శక విదూషకుడి మాట!! ఎలా ఉన్నాయి ఈ కామెంట్లు? https://www.quora.com/What-are-some-famous-jokes-or-memes-on-Airtel
ప్రేమలో ఫన్ను
కంటిచూపుతో చంపేసేవాళ్లుండగా పంటి గిఫ్టుతో ప్రేయసి మది దోచే వాళ్లుండరా? ఉంటారు. కచ్చితంగా ఉంటారు. నమ్మకపోతే కాలిఫోర్నియాకి చెందిన లూకాస్ ఉంగర్‌ను కలవండి. ఉంగర్ గారు తన ప్రేయసికి తన జ్ఞానదంతం పొదిగిన ఉంగరం ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడట. దీనికి క్లారీ లిఫ్కన్ అనే అమ్మాయి పడిపోయిందట. ఇంత చక్కగా పన్ను చెల్లించుకునేవాడు ఇంకొకడు నాకు దొరుకుతాడా అని పెళ్లికి ఒప్పేసుకుందట. వజ్రాలు, రత్నాలు నార్మల్. ఏదైనా కిక్కు... కిక్కుండాలి. దంతం గిఫ్టు వెరైటీగా ఉంది అని తెగమురిసిపోతోంది. అనేక ‘దంతం’ భక్తానాం అని భక్తుడు నెలకో గిఫ్టు ఇచ్చుకుంటాడని ఆనందపడిపోతోంది. నవంబర్ 21 న ఉంగర్, క్లారీలకు పెళ్లి. ఇలాగే నెలకు మూడు ముద్దులు, ఆరు గిఫ్టులుగా కాపురం కొనసాగితే ఉంగర్ గారు ఏడాదిలో బోసినవ్వుల బాపూజీ అయిపోవడం ఖాయం.
http://www.sakshi.com/news/ international/man-wins-girlfriend-s-heart-with-his-wisdom-tooth-289223? pfrom=home-top-story
ఓ మై డాగ్!
ఈ అయిదు నెలల కుర్రాడు ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణు మాధవ్‌ను మించిపోయేట్టున్నాడు. ఇంట్లో పెంపుడు కుక్క పోటీ పడి అరుస్తుంటే పోటీలో నేనూ పాల్గొంటానని ఈ పసివాడూ పరుగులు పెడుతున్నాడు. వాటితో సమ ఉజ్జీగా అరిచి చూపిస్తున్నాడు. అవి మోర చాస్తే, మన బుడతడూ మోరచాస్తున్నాడు. అయితే కుక్కలు చేయలేనిది, మనవాడు చేసేదీ ఒకటుంది. అదేమిటంటే సెల్ఫీల యుగంలో పుట్టిన మనోడు కెమెరాలకు కూడా పోజులిస్తున్నాడు. అమ్మ కడుపులోనే అభిమన్యుడు పద్మవ్యూహ రహస్యాలు తెలుసుకున్నాడంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. కానీ అయిదునెల్లకే మిమిక్రీ నేర్చుకున్న ఈ పసివాడిని చూస్తే అభిమన్యుడి కథ నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికైతే మనవాడు అరిస్తే అరుస్తా అంటున్నాడు. తరువాత అరిస్తే కరుస్తా... అంటాడేమో చూడాలి. ఈ వీడియోను లక్షల మంది చూస్తున్నారు. మీరూ చూడండి.
http://whatstrending.com/cute/20590-baby-gets-in-howling-contest-with-dogs
నీకు నేను... నాకు నువ్వు....
నలభై అయిదేళ్ల క్రితమే ప్రజలు ఆ ఊరిని వదిలేశారు. మొత్తం ఊరు ఖాళీ అయింది. స్పానిష్ అంతర్యుద్ధం ఆ ఊరిని ఖాళీ చేసేసింది. జనాభా లెక్కల వాళ్లు ఆ ఊరిని లెక్కల్లోంచి తీసేశారు కూడా. కానీ ఓ కుర్రదాని ప్రేమలో పడ్డ ఓ కుర్రాడు మాత్రం ఊరు వదల్లేదు. 79 ఏళ్ల కుర్రాడు జువాన్ మార్టిన్, 82 ఏళ్ల కుర్రది సిన్ ఫరోసా కోలోమర్ ఇప్పటికీ ‘నాకు నువ్వు... నీకు నేను... ఒకరికొకరం తోడు నీడ...’ అని డ్యూయెట్లు పాడుకుంటూ అందరూ వదిలేసిన ఊళ్లో ఆనందంగా ఉంటున్నారు. నలభై అయిదేళ్ల క్రితం ఊరంతా టౌన్‌కి తరలిపోతుంటే ‘టౌను పక్కకెళ్లొద్దురో... డింగరీ డాంబికాలు పోవద్దురో’ అని భార్య హెచ్చరించింది.
భార్య మాట పాటించడంలో ఆనందం ఏమిటో తెలిసిన మన మార్టిన్ ఆమెతో ఉండిపోయాడు. నాలుగు కుక్కలు, మూడు పిల్లులు, డజన్ గొర్రెలు, అరడజను కోళ్లతో నాలుగున్నర దశాబ్దాలుగా హాయిగా బతికేస్తున్నారు. ఈ మధ్యే ఎవరో వస్తే ఆ ఊళ్లో ఈ జంట ఒకటి ఉందన్న సంగతి బయటపడింది. వారి కథ తెరకెక్కించడానికి ఇప్పుడు అంతా సిద్ధం. నా కాంతతో ఏకాంతం భంగం చేయకండ్రా అని మార్టిన్ మొత్తుకుంటున్నా వినడం లేదట. ఇప్పుడీ జంట కథ ఇంటర్ నెట్ ద్వారా ఇంటింటికీ చేరుకుంటోంది.
పచ్చబొట్టేసిన పిల్లగాడా...!!
బాహుబలి పచ్చబొట్టు పొడిస్తే పాపం గెరిల్లా యోధురాలైన అవంతికకు ఒళ్లు తెలియలేదు. ఆమె నిద్రలో ఉండగానే మన ప్రభాస్ పచ్చబొట్టేశాడు. పచ్చ బొట్టేసిన పిల్లగాడా... అని పాడుకోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. సరిగ్గా అలాంటి సమస్యే ఈ బ్రిటిష్ వ్యక్తిది. ఓ పార్టీకి వెళ్లి పూటుగా తాగేశాడు. ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. కళ్లు తెరిచేసరికి ముఖమంతా పచ్చబొట్టు పొడిచేశారు. బాహుబలి సినిమాలో అవంతికకు అందమైన టాటూలు వేశారు. కానీ మనోడికి మాత్రం రేబాన్ కళ్లద్దాలను వేసేశారు.
ముందు ఏదో తుడిచేసుకుందామనుకున్నాడు. కానీ ‘పచ్చబొట్టు చెరిగిపోలే నా రాజా...’ అని త్వరలోనే తెలుసుకున్నాడు. ఆయన ఏదో కుర్రాడు కాదు. మధ్యవయస్కుడు. దాంతో ఆ టాటూను తీస్తే తప్ప రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆరేడు సార్లు లేసర్, టాటూ రిమూవల్ ట్రీట్‌మెంట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కళ్లద్దాల అవశేషాలు సశేషంగా ముఖం మీద కొంచెం కొంచెం ఉన్నాయి. ఆ టాటూలు వేసినోడు దొరికితేనా... అవంతికలాగా కసకసా పొడిచేస్తా అని అంటున్నాడట ఆయన.
Man Wakes Up With 'Ray-Ban' Tattoo After Stag Do www.huffingtonpost.c
ఇది తెలుసా..
ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో 100కోట్ల వెబ్‌సైట్లను యాక్సెస్ చేసుకోవచ్చట. గత రెండేళ్ల కాలంలోనే ఇంటర్‌నెట్‌ను మొబైల్ ఫోన్ల ద్వారా బ్రౌస్ చేసిన వారు దాదాపు 8.5 కోట్లమంది వరకు ఉన్నారట. 31శాతం ఇంటర్‌నెట్ యూజర్లు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోని ఫేస్‌బుక్ మీదే మొగ్గు చూపుతున్నారు. అత్యల్పంగా 4 శాతం మందే ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారట. కేవలం ఒక నిమిషంలో 72 గంటల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చట. ప్రస్తుతం యువత వారానికి సుమారు 35 గంటలు ఇంటర్‌నెట్ ముందే కూర్చుంటోందట. గంగ్‌నమ్ స్టైల్ యూట్యూబ్ వీడియో ఇంటర్‌నెట్‌లో ఇప్పటికి వరకు 200కోట్ల సార్లు ప్లే అయిందట.