పరుగులు పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే క్షణాలు సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా ఎన్నో మానసిక సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నవారు కొందరైతే.. మానసిక ఎదుగుదల లేని పిల్లల పెంపకం గురించి సమస్యలు ఎదుర్కొనే తల్లిదండ్రులు కొందరు. ‘ఇలాంటి వారికి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒకే కప్పు కింద వందమంది స్పెషలిస్టులతో అవసరమైన థెరపీలతో చికిత్సనందిస్తున్నా’మన్నారు సరిపల్లి శ్రీజ. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసి తగిన మార్గదర్శకాలను రూపొందించారు. పోషకాహార నిపుణురాలైన శ్రీజ పిల్లల న్యూరలాజికల్ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఎలా పయనించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.మా అబ్బాయి సంహిత్‌కు ఇప్పుడు నాలుగేళ్లు.
చూస్తున్నారుగా చలాకీగా తిరుగుతూ ఎలా మాట్లాడుతున్నాడో.. ఇప్పుడు ఈ మాట ఆనందంగా చెప్పుగలుగుతున్నాను కానీ, మూడేళ్ల క్రితం మేం పడిన బాధ అంతా ఇంతా కాదు. వాడు పుట్టిన ఏడాదికి ఓ రోజు బాగా జ్వరం, నోటి నుంచి నురగలు వచ్చాయి. భయమేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. ట్రీట్‌మెంట్ పూర్తయ్యి, జ్వరం తగ్గింది కానీ, ఆ తర్వాత నుంచి వాడిలో విచిత్రమైన మార్పులు.. చేతికి ఏది దొరికితే అది విసిరేసేవాడు. పిలిస్తే పలికేవాడు కాదు.. ఈ సమస్యలతో మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్ ‘ఆటిజమ్’కు సంబంధించిన ఓ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. ‘అసలు మా అబ్బాయికున్న సమస్య ఏంటీ, ఇప్పుడీ పుస్తకం నాకెందుకు ఇచ్చారు?’ అని డాక్టర్‌ను అడిగితే ‘మీ అబ్బాయికి ఆటిజమ్ సమస్య ఉంది, మిగతా పిల్లల్లా కాదు తను’ అంటూ ఆటిజమ్ పిల్లల ప్రవర్తన గురించి వివరించి కొన్ని మందులు రాసిచ్చారు.
అయితే వీడు మిగతా అందరు పిల్లల్లాగే చక్కగా ఆడుకునేవాడు, పెట్టింది తినేవాడు, అనవసరంగా ఏడ్వడం.. వంటివి చేసేవాడు. డాక్టర్‌తో ఇది ‘ఆటిజమ్’ కాదంటే మళ్లీ చెక్ చేశారు. ఆ పరీక్షలో మా అబ్బాయికి వినికిడి సమస్య ఉందని, దానివల్లే వాడు మేం చెప్పేది సరిగా వినడం లేదని తేల్చారు. బాబుకి మాటలు సరిగా రావాలన్నా, చెప్పింది వినాలన్నా రెండు– మూడేళ్లు స్పీచ్ థెరపీ చేయాలన్నారు. రోజూ స్పీచ్ సెంటర్‌కి తీసుకెళ్లాలి. వాడు రెండు రోజులు థెరపీ సెంటర్‌కి వచ్చాడు. మూడో రోజు నుంచి రానని మొరాయించడంతో అక్కడి వాతావరణం, ఆ థెరపీ విధానం నచ్చడం లేదని అర్థమైంది. ఇలాంటి పిల్లలకు థెరపీ ఇవ్వాలంటే ఇంటిలాంటి ప్లేస్ ఉండాలి. అది వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దేదిలా ఉండాలి. ‘అలాంటి సంస్థను మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు’ అనే ఆలోచనతో వీటికి సంబంధించి ఉన్న రకరకాల సెంటర్స్ గురించి చాలా రీసెర్చి చేశాం.
థెరపీతో తెరపి..
ప్రపంచ జనాభాలో 70 శాతం మంది రకరకాల న్యూరలాజికల్ కండిషన్స్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ల సర్వే ద్వారా తెలిసింది. ఆ సమస్యలు.. ఆటిజం కావచ్చు, సెరిబ్రల్ పాల్సీ, చిన్న చిన్న ఫోబియాలు, మాటలో లోపాలు, స్ట్రెస్, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు, వైవాహిక బంధాలలో సమస్యలు.. ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారున్నారని తెలిసింది. ఇలాంటి వారికి థెరపీ ఇచ్చి వారి జీవితాలకు తెరపి ఇవ్వాలని మావారు సరిపల్లి కోటిరెడ్డితో కలిసి రెండేళ్ల క్రితం ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో స్పీచ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీంట్లో స్పీచ్ థెరపీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ మోడిఫికేషన్.. అన్నీ ఒకే దగ్గర లభించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
ఒక బ్రాండ్... వంద మంది స్పెషలిస్ట్‌లు
వంద మంది స్పెషలిస్ట్‌లు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశాం. స్పెషల్ చిల్డ్రన్సే కాదు టీనేజ్ పిల్లల ప్రవర్తనలోనూ మార్పులు తీసుకురాదగిన థెరపీలను ఇక్కడ డెవలప్ చేశాం. రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడకు వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటుంటారు. ఆనందంగా వారి భావి జీవితాలను నిర్మించుకుంటున్నారు. స్పెషల్ చిల్డ్రన్‌కి థెరపీ ఇప్పించలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులకు సేవా, కోటి ఫౌండేషన్‌ల ద్వారా ఉచితంగా చికిత్సను ఇస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 300 మంది పిల్లలు థెరపీ పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి 3 నెలల నుంచి రెండేళ్ల వరకు థెరపీ అవసరం. ఇప్పటికి హైదరాబాద్‌లో 11 థెరపీ సెంటర్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పినాకిల్ బ్లూమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ ముగించారు శ్రీజ.
నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల
పరిశీలిస్తూ... పరిష్కరించాలి...
పిల్లల చిన్న వయసులోనే ఆటిజమ్‌ను గుర్తించకపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కొందరిలో మాట ఉండదు. వాళ్లంతట వాళ్లు ఆడుకోలేరు, సోషల్ స్కిల్స్ ఉండవు, పిలిస్తే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఉండకపోవడం వంటివి ప్రాథమిక లక్షణాలు. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే నలుగురిలో కలవలేకపోవడం, డిప్రెషన్, ఆత్మన్యూనత వంటి సమస్యలను కుటుంబసభ్యులు త్వరగా గుర్తించగలిగితే కౌన్సెలింగ్‌ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు.
డాక్టర్ శ్రీజ, పినాకిల్ బ్లూమ్స్ నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment