దాగుడుమూత దండాకోర్
సంస్కృతీ సంప్రదాయాలపరంగా మన దేశం ఎప్పుడూ గొప్పగా ఉండటానికి ప్రాచీన ఆటలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. శివ-పార్వతులు సరదాగా పాచికలు ఆడటం, పాండవులు పాచికలాటలో ఓడిన విధం, మొఘలులు పగటి వేళ చదరంగం ఆడటం.. ఇలా మన పురాణేతిహాసాలను తెలుసుకోవాలంటే నీడపట్టున ఆడే మన సంప్రదాయక ఆటలు ఓ ముఖ్యమైన సాధనంగా పనిచేసేవి.అలాగే ఆరుబయట ఆడే ఆటలు పిల్లలలో ఉల్లాసాన్ని, శారీరక సౌష్టవాన్ని, స్నేహాలను పెంచుకోవడానికి వారధిగా పనిచేసేవి.
కానీ, నేడు... గేమ్స్ అంటే వీడియోగేమ్స్, ప్లే స్టేషన్.. అనే అనుకుంటున్నారు పిల్లలు. వీటితోనే కూర్చున్న చోట నుంచి లేవకుండా రకరకాల గ్యాడ్జెట్స్‌తో కుస్తీపడుతున్నారు. స్నేహాలను పెంచి, మరిచిపోలేని బాల్యపు జ్ఞాపకాలను అందించే మన సంప్రదాయ ఆటలను ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేద్దాం రండి.
ప్రాంతాలు, వారి వారి భాషలను బట్టి ఆటల పేర్లలో మార్పే తప్ప ఆడే తీరులో తెలుగురాష్ట్రాలలో ఒకే విధంగా ఉంటాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి.. వామనగుంటలు, అష్టాచమ్మా, పచ్చీసు, గచ్చకాయలు, .. వంటివి ఇంటి లోపల ఆడితే... ఖోఖో, కబడ్డీలతో పాటు బిళ్లంగోడు, తాడాట, బొమ్మా బొరుసు, వీరి వీరి గుమ్మడిపండు, కప్ప కంతులు, నాలుగు స్తంభాలాట, దొంగాపోలీసు, తొక్కుడుబిళ్ల... ఇలా ఎన్నో ఆరుబయట ఆటలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆటల గురించి...
ఇంటిలోపలి ఆటలు
వామనగుంటలు: దీర్ఘచతురస్త్రాకారంలో రెండు వరసలుగా చెక్కతో చేసిన బోర్డు గేమ్ ఇది. దీనిని ‘వామన గుంటల పీట’ అంటారు. దీనికి ఒక వైపు 7 గుంటలు, మరో వైపు 7 గుంటలు చొప్పున ఉంటాయి. దీంట్లో ఆడటానికి చింతపిక్కలు లేదా సీతాఫలం గింజలను వాడుతారు. ఇద్దరు ఆడే ఈ ఆటలో ఒక్కో గుంటలో 5 గింజల చొప్పున వేస్తూ ప్రారంభిస్తారు. ఒక గుంటలో గింజలు తీసి.. అన్ని గుంటలకు పంచుతూ.. గింజలన్నీ అయిపోయాక ఆ తరువాతి గుంటలో నుంచి గింజలు తీసి మిగతా గంటలలో వేయాలి. మధ్య ఖాళీ గుంట తటస్థ పడితే ఆ తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకున్నట్టు. ఒకరు గింజలు పంచుతుంటే ప్రత్యర్థి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ గింజలు పోగయితే వాళ్లు గెలిచినట్టు. ఈ పీట అందుబాటులో లేకపోతే నేల మీద వృత్తాలు గీసి, వాటితో ఆడవచ్చు.
అష్టా చెమ్మా: చతురస్రాకారంలో సుద్దముక్క లేదా బొగ్గు ముక్కతో గీసి ఆడుతుంటారు. ఇద్దరు/ ముగ్గురు/ నలుగురు ఆడే ఆట. ఆడటానికి నాలుగు గవ్వలను, లేదంటే అరగదీసిన చింతపిక్కలను వాడుతారు. ఆడేటప్పుడు నాలుగు గవ్వలను ఒకేసారి నేలకు విసురుతారు. దాంట్లో కొన్ని వెల్లికిలా, మరికొన్ని బోర్లా పడతాయి. నాలుగు గవ్వలూ బోర్లా పడితే దానిని ‘అష్టా’(8) అంటారు. నాలుగు గవ్వలు వెల్లికల్లా పడతే దానిని ‘చెమ్మా’(4) అంటారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగు పావులు లేదా చింతపిక్కలు ఉంటాయి. ఈ పావులు ఎవరెవ వి ఏ రంగో తెలియడానికి నాలుగు విభిన్నమైన రంగులను ఎంచుకుంటారు. దక్షిణం, తూర్పు, ఉత్తరం, పడమర.. వైపుగా ఆట చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
పచ్చీసు: బట్టను నాలుగువైపులా పట్టీలతో కుట్టాలి. లేదా తాత్కాలికంగా సుద్దముక్కతో కూడా గీసి ఆడుకోవచ్చు. పందెం వేయటానికి ఏడుగవ్వలు వాడుతారు. అదేవిధంగా పదహారు కాయలుంటాయి. ఆటలో నలుగురు నాలుగు కాయల చొప్పున పంచుకుంటారు. వీటి రంగులు ఎరుపు, పసుపు, పచ్చ, నలుపు ఉంటాయి. వీటిని పావులు అంటారు. పచ్చీసు నేల మీద పరిచి నలుగురు నాలుగువైపులా కూచొని గవ్వలతో పందెం వేస్తారు. గవ్వలతో దస్, తీస్, పచ్చీస్ వేసినప్పుడు పావులు వస్తాయి. పందెం గడివైపు సాగుతుంది. ముందున్నవారు తల్లి(మధ్య)గడివైపు వెళ్లేలోపు వట్టి చోట్ల ఉంటే వారి తరువాత వారు ముందు పావును చంపవచ్చు. గడిలో చేరిన పావుల్ని చంపరాదు. ఈ పందాల విలువ పచ్చీస్ అంటే ఇరవై అయిదు, తీస్ అంటే ముప్పయ్, దస్ అంటే పది. ఎవరు ముందు మధ్యలో ఉన్న ఇల్లు చేరితే, చుట్టూ నాలుగు వైపులా పూర్తి చేయగల్గితే వాళ్లు ఆటలో గెలిచినట్టు.
చదరంగం: భారతదేశపు ప్రాచీన ఆట. మన దేశం నుంచి దక్షిణ ఐరోపా ఖండంలో 15 వ శతాబ్దిలో కాలు మోపి ప్రస్తుతం ఎన్నో మార్పులు చోటుచేసుకొని చెస్‌గా రూపాంతరం చెందింది. 16 తెల్లపావులు 16 నల్లపావులు గల బోర్డు గేమ్ ఇది. చదరపు గళ్లు ఉండే ఈ ఆటలో తెల్లపావులను ఒక ఆటగాడు, నల్ల పావులను మరొక ఆటగాడు నియంత్రిస్తుంటారు. రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు, శకటాలు లేదా సైనికులు .. అంటూ సాగే ఈ ఆట ఎత్తుగడలూ, యుక్తులతో ప్రత్యర్థిని ఏ విధంగా చిత్తు చేయాలో.. తెలియజేస్తుంది.
అచ్చంగిల్లాలు/ గచ్చకాయలు: ఐదు నున్నటి రాళ్లు లేదా ఐదు గచ్చకాయలతో ఆడే ఆట ఇది. నాలుగు రాళ్లను కింద వదిలేసి, ఒకరాయిని పైకి విసురుతూ కింద రాళ్లని, పైనుంచి కింద పడేరాయిని నేర్పుగా పట్టుకోవడం ఈ ఆటలోని గమ్మత్తు. దశలవారీగా సాగే ఈ ఆటను పిల్లలు అత్యంత ఉత్సాహంగా ఆడుతుంటారు.
ఆరుబయట ఆటలు
దొంగా పోలీసు/దాగుడుమూతలు: ఇది ఏ వేళైనా ఇంటా, బయటా ఆడచ్చు. పెద్దవాళ్లు తమ పిల్లలతోనూ ఈ ఆట ఆడవచ్చు. మానసిక అనుబంధాలు బలపడే ఈ ఆట పిల్లలు చాలా చిన్న వయసు నుంచే ఆడుతుంటారు. దీంట్లో అటాచ్‌మెంట్- డిటాచ్‌మెంట్ ఎలా సమం చేయాలో నేర్చుకుంటారు.
గోటీ కంచా: ఇది గల్లీలలో సాధారంగా పిల్లలు ఆడే ఆట. మగపిల్లల ఆటగా ప్రసిద్ధి పొందిన ఈ ఆటలో ఒక గోటీతో మిగతా గోటీలను గురిచూసి కొడతారు. గోటీలు పోగవడం కోసం పిల్లలు ఉత్సాహంతో పోటీపడతారు.
ఏడుపెంకులాట: ఒకటి పెద్దగా, రెండవది చిన్నగా...ఇలా ఏడు పెంకులు లేదా రాళ్లు ఒక్కోదాని మీద ఒకటి ఉంచాలి. ఎంచుకున్న దూరం నుంచి హ్యాండ్ బాల్‌ని బలంగా విసిరి ఈ రాళ్లను కొడతారు.
బొంగరం ఆట: దీనినే గేమింగ్ టాప్ అని కూడా అంటారు. ఈ ఆటలో నైపుణ్యం, ఆసక్తి రెండూ అవసరం. జూటీని చుట్టేందుకు బొంగరం కిందివైపున మేకు ఉండి ‘వి’ ఆకారంలో పైకి మెట్లు మెట్లుగా ఉంటుంది. పై భాగాన డోమ్ లాగా ఉండి చేతితో పట్టుకొని విసరడానికి అనువుగా ఉంటుంది. మేకు కింది వైపున ఉండటం వల్ల బొంగరం వేగంగా, ఎక్కువసేపు తిరగడానికి అనువుగా ఉంటుంది.
తొక్కుడు బిళ్ల: ఈ ఆటను ఒంటరిగా లేదా జట్టుగా ఆడవచ్చు. ఈ ఆట క్రమంగా అంతరించిపోయేలా ఉంది. పక్కపక్కనే ఉండే నాలుగు నిలువుగళ్లు, రెండు అడ్డగళ్లు గల దీర్ఘచతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట ఆడేవారు నిలుచోవాలి. ముందు ఒకరు చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత గడులను దాటించాలి. ఏ సమయంలోనూ కాలు గానీ, బిళ్లగాని గడుల గీతలను తాకరాదు. గడులన్నీ అయిపోయాక కాలివేళ్ల మధ్య బిళ్లను బిగించి పట్టుకుని దాన్ని కుంటికాలితో ఎనిమిది గడులను గెంతిరావాలి. తరువాత కాలి మడమ మీద, తలపైన, అరచేతిలో, మోచేతిపైన, భుజం పైన పెట్టుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితో వారే గెలిచ్చినట్టు.
బిళ్ళంగోడు/ గిల్లీ డండా: మూరెడు పొడుగున్న (గోడు) జానెడు పొడుగున్న (బిళ్ల) రెండూ కట్టెల్ని నున్నగా చెక్కి తయారుచేసుకుంటారు. చిన్నదైన బిళ్ళను సన్నని గుంట తీసి దాని మీద అడ్డంగా ఉంచి, పెద్ద కర్రతో లేపి కొడతారు. అది వెళ్లి పడిన చోటు నుంచి కర్రతో కొలుస్తారు. ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్లు గెలిచినట్టు.
నేల - బండ: ఈ ఆటను ఎంతమందైనా ఆడుకోవచ్చు. ముందు ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. దొంగని నేలకావాలో బండ కావాలో కోరుకోమంటారు. దొంగ నేల కోరుకుంటే మిగిలినవారంతా బండ మీద ఉండాలి. బండపై ఉన్నవారు నేల మీదకు వచ్చి దొంగను ఆటపట్టించాలి. దొంగ బండ పైకి వెళ్లకుండా నేల మీదకు వచ్చిన వాళ్లని పట్టుకోవాలి. దొంగకు చిక్కన వారు దొంగస్థానాన్ని భర్తీ చేస్తారు.
కబడ్డీ: ఒక్కో జట్టులో 7 గురు ఆటగాళ్లు ఉంటారు. ఒక ఆటగాడు రెండవైపు కబడ్డి, కబడ్డీ.. అని గుక్కతిప్పుకోకుండా వెళ్లి అవతలి జట్టువారిని టచ్‌చేసి తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అంతమంది ఔట్ అయిపోయినట్టే. అన్ని మార్కులు రెండవ జట్టుకు వస్తాయి. కూత ఆపినా ఔట్ అయినట్టే. రెండవజట్టూ ఇలాగే చేయాలి. ఆటపూర్తయిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్టు నిర్ణయిస్తారు.