పాఠశాలకు తరచూ నడిచి లేదంటే సైకిల్‌పై వెళ్లే పిల్లలు ఊబకాయులుగా మారే అవకాశాలు తక్కువని అంటున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. లండన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల మంది పాఠశాల విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా తాము ఒక అధ్యయనం నిర్వహించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లాండర్ బాష్ తెలిపారు. బీఎంసీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. జాతి, పరిసరాలు, ఆర్థిక, సామాజిక వర్గాలన్నింటిలోనూ ఒకే రకమైన ఫలితం కనిపించింది. ఊబకాయానికి బాడీ మాస్ ఇండెక్స్‌ను సూచికగా తీసుకోకుండా శరీరంలోని కొవ్వు, కండరాల ద్రవ్యరాశిని లెక్కకట్టి కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఈ అంచనాలకు వచ్చారు.
ఈ అంశాలకూ వ్యాయామానికి మధ్య ఉన్న సంబంధాన్ని అంచనా వేశారు. అధ్యయనం చేసిన రెండు వేల మందిలో సగం మంది రోజూ ఆటలాడతారని, మిగిలిన వారు కాలినడకన లేదంటే సైకిల్‌పై స్కూలుకు వెళతారని బాష్ తెలిపారు. వీరిలో కొవ్వు మోతాదు తక్కువగా ఉండటాన్ని తాము అప్పుడప్పుడూ చేసిన పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ పద్ధతి ద్వారా లెక్కించినప్పుడు రోజు ఆటలాడే పిల్లలు కూడా అధిక బరువు ఉన్నట్లు తెలుస్తోందని, కొవ్వు, కండరాల మోతాదులను పరిశీలించినప్పుడు రోజూ ఆటలాడే వారిలో కండరాల ద్రవ్యరాశి ఎక్కువగా ఉందని వివరించారు. బడికొచ్చే పిల్లలను సైకిల్ ఎక్కేలా ప్రోత్సహించడం ద్వారా ఊబకాయం సమస్యలను సులువుగా తగ్గించవచ్చునని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment