
ఆల్ ద బెస్ట్!!
పిల్లలు పరీక్షలకు రెడీ.. ఆల్ ద బెస్ట్!!
పేరెంట్స్ చెయ్యాల్సిందంతా చేశారు!
స్ట్రెస్ లేకుండా.. స్ట్రెస్ ఇవ్వకుండా
పిల్లల్ని పరీక్షలకు పంపించండి!
ఆల్ ద బెస్ట్!!
పిల్లల పరీక్షలు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. పిల్లలు ఎలాగూ కష్టపడుతున్నారు. పెద్దల యాంగ్జయిటీ అంతా ‘మనం కూడా కష్టపడుతున్నామా’ అన్నదే. పిల్లల పరీక్షల్లో భాగస్వాములుగా కాకపోతే ఫెయిలవుతామేమో అన్న భయం. ‘ఆ ఫార్మూలా గుర్తుంటుందా?’, ‘ఏ కాంటినెంట్ పక్కన ఆఫ్రికా ఉందో జ్ఞాపకం ఉంటుందా?’, ‘ఏ ప్లస్ బి హోల్‌స్క్వేర్ ఎంత?’, ‘సెకండ్ టైమ్ రివిజన్ కంప్లీట్ అయిందా?’ , ‘పొద్దున మూడింటికి అలారమ్ పెట్టి లేపుతాను సరేనా?’ .. పిల్లలకు ఇవ్వన్నీ చెప్పాలంటే పేరెంట్స్ ఎంతగా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేది పేరెంట్స్.. పరీక్ష రాసేది పిల్లలు.
పిల్లలు మంచి మార్కులతో పాసవ్వాలనే యాంగ్జయిటీలో ఒక్కోసారి పిల్లల్ని కూడా యాంగ్జయిటీకి గురిచేస్తున్నారు. పిల్లల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు. దాంతో జవాబులన్నీ తెలుసుండీ కూడా ఆన్సర్ పేపర్ ముందుకు వెళ్లేసరికి బ్లాంక్ అయిపోతున్నారు పిల్లలు. అందుకు పిల్లలకు కొంచెం ఊపిరాడే చోటిస్తే బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. పిల్లలూ అదే కోరుకుంటున్నారని తెలిసింది.. ఓ సోడా కంపెనీ తన సీఎస్సార్ కింద చేసిన ఓ డిజిటల్ ప్రమోషన్‌లో. ఇందులో పెద్దలు పెట్టిన ఒత్తిడితో సతమతమవుతున్న çపధ్నాలుగు, పదిహేనేళ్ల వయసు పిల్లలు.. పెద్దల నుంచి తాము ఎలాంటి మద్దతును ఆశిస్తున్నారో తెలుపుతూ తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. చూస్తుంటే.. వింటుంటే.. హృదయం ద్రవిస్తోంది. ఆ ఉత్తరం ముక్కలను మీకోసం పట్టుకొచ్చాం.. ఒక్కసారి చదవండి! పిల్లల మనసు అర్థమవుతుంది!
మీ స్ట్రెస్ చూస్తుంటే నర్వస్‌గా ఉంటుంది..
ప్రియమైన అమ్మా, నాన్నకు.. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అయినా చదువు విషయంలో మీ ప్రవర్తన నాకు అర్థంకాదు. ఫ్రెండ్స్‌తో కలవనివ్వరు. ఆడుకోనివ్వరు. ఓ బందీలా చూస్తారు. ఎందుకమ్మా? ఎందుకు నాన్నా? నాకు పరీక్షలొస్తున్నాయంటే మీరు స్ట్రెస్ ఫీలవుతారు. మీ స్ట్రెస్ చూస్తుంటే నాకు నర్వస్‌గా ఉంటుంది. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమంటే నాకు చాలా కన్‌సర్న్ నాన్నా.. అమ్మా! కాని కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో నన్ను వదిలేయండి. నన్నుగా ఉండనివ్వండి. ప్లీజ్! జీవితంలో మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించను. నన్ను కన్నందుకు మీరు గర్వపడేలా చేస్తాను.
ఇట్లు మీ కూతురు కేసంగ్
నన్ను నమ్మండి ప్లీజ్
డియర్.. అమ్మా అండ్ అప్పా..
ఏ విషయంలోనైనా నాకెంత బెరుకు, భయమో మీకు తెలుసు. ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని మీకు ఈ ఉత్తరం రాస్తున్నా. కిందటేడాది నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు. కాని ఈసారి మార్కుల కోసం బాగా కష్టపడుతున్నా. టీవీలో ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచెస్ చూడాలనుకుంటా. వాటితో రిలాక్స్ అవాలనుకుంటా. నా ప్రెషర్ తగ్గించుకోవాలనుకుంటా. కాని మీరు పరీక్షల కోసం టీవీ కనెక్షన్ కట్ చేయించారు. దయచేసి నన్ను అర్థంచేసుకోండి! నేను బాగా చదువుతున్నాను. నన్ను నమ్మంyì ప్లీజ్! మీ ప్రవర్తన వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఎవరితో మాట్లాడకుండా బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకొని నన్ను నేను బంధించుకోవాలనిపిస్తోంది. మనింటిని నార్మల్ హౌజ్‌లా ఉంచడమ్మా...!
ఇట్లు మీ అబ్బాయి కార్తిక్
ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా..
ప్రియమైన నాన్నకు..
నాకు ఎగ్జామ్స్ అంటే భయంలేదు. మీరంటేనే భయమేస్తోంది. ఎంతలా అంటే మిమ్మల్ని తలచుకుంటే ధైర్యం రావాల్సింది పోయి కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. అందరిముందు నిషి ఆంటి కూతురుతో నన్ను కంపేర్‌చేయొద్దు ప్లీజ్! నన్ను నాలా ఉండనివ్వండి నాన్నా! నువ్ అనుక్షణం నా గురించే ఆలోచిస్తూ.. నాతోనే ఉన్నా నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యమే నాకు రావడంలేదు నాన్నా.. నిన్ను తలచుకుంటేనే భయమేస్తోంది. ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా..
మీ లవింగ్ డాటర్ నిఖిత
భయమేస్తోంది..
ప్రియమైన అమ్మా, నాన్నకు..
పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. సరిగ్గా రాయలేనేమో అని కాదు.. మీరు నామీద పెట్టుకున్న అంచనాలను తలచుకుంటే భయమేస్తోంది. నా చదువు పట్ల మీరెంత శ్రద్ధ పెడుతున్నారో నాకు తెలుసు. కానీ నేనూ అంతే కష్టపడుతున్నానని మీకెందుకు అర్థంకావట్లేదమ్మా? ఎంత చదువుతున్నా.. ఎన్ని మార్క్స్ వస్తున్నా ఇంకా చదవట్లేదనే తిడ్తున్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా.. అందుకే పరీక్షలు వస్తున్నాయంటే భయమేస్తోంది! మీ ఒత్తిడికి ఊపిరాడనట్టవుతోంది. స్కూల్ నుంచి, మీ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ నన్ను డిమోటివేట్ చేయొద్దమ్మా! నా మానాన నన్ను చదవనివ్వండి. మీరు తలెత్తుకునేలా చేస్తాను. ప్రామిస్! లవ్ యూ మా..
లవ్ యూ పా..!
ఇట్లు మీ కూతురు అనీష
మార్కులు తప్ప జీవితమే లేనట్టు...
డియర్ మదర్..
నాతో నువ్వెప్పుడూ మార్కులు, కాంపిటీషన్ గురించే మాట్లాడతావ్! నువ్వు చెప్పినన్ని మార్కులు తెచ్చుకోకపోతే.. టాపర్స్‌తో కంపీట్ చేయలేకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్న ఫీలింగ్‌ను కలిగిస్తున్నావ్! మార్కులు తప్ప నాకు ఇక లైఫే లేదన్న ఫీల్ వస్తోందమ్మా..! జీవితమంటే మార్కులేనా అమ్మా...? నువ్వు, నాన్న .. నాతో ఒక్కసారి కూడా నెమ్మదిగా మాట్లాడరు. మార్కుల గురించి కాక ఇంకో టాపిక్ తీసుకురారు. మీరనుకున్నదానికంటే ఒక్క మార్క్ తక్కువైనా నా మీద గట్టిగట్టిగా అరుస్తారు. తిడ్తారు. మీరు తిట్టిన రాత్రిళ్లు ఒక్క క్షణం కూడా నాకు నిద్ర ఉండదు తెలుసా అమ్మా.. ! నువ్వు నామీద అరిచిన ప్రతిసారీ నాకెంతో దూరమైపోయినట్టు.. నువ్వో కొత్త మనిషిలా కనిపిస్తావమ్మా! ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. కడుపులో తిప్పుతుంది. వామ్టింగ్ వచ్చినట్టువుతుంది. అమ్మా.. నేను బాగా చదువుతానమ్మా.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను తిట్టొద్దమ్మా! మీ కూతురైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకోసం ఇంతగా కష్టపడుతున్నందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటా. మీ గౌరవం నిలబెడ్తా.
ఇట్లు మీ చిట్టితల్లి టీనా
మైడియర్ పేరెంట్స్..
పది గంటలపాటు ఒక్క ఉదుటున.. కుదురుగా కూర్చోని చదివేంత ఎనర్జి నాకు లేదని మీకు తెలుసు. అయినా ఎటూ కదలనివ్వకుండా నా గదిలో కూర్చోబెట్టి చదివిస్తుంటారు. పైగా అరగంటకు ఒకసారి వచ్చి చెక్ చేస్తుంటారు నేను కుదురుగా ఉన్నానో లేదోనని. ఇదంతా నాకు చాలా బాధగా ఉంది. మీరలా చేయడం వల్లే నేను నా కాన్‌సంట్రేషన్‌ను కోల్పోతున్నాను. అమ్మా... నాన్నా.. ప్లీజ్ మాటిమాటికి నా సిన్సియారిటీని చెక్ చేయకండి! నా కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయకండి.ప్లీజ్...
ఇట్లు మీ అబ్బాయి అన్షుల్
ఇవి ఉత్తరాలు కావు.. పసి హృదయాల ఆవేదనకు అక్షర రూపాలు. టీనేజర్స్‌లో అంతకంతకు పెరుగుతున్న డిప్రెషన్, సూసైడల్ టెండన్స్‌లకు కారణం పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ఒత్తిడేనని ఎన్నో నివేదికలు, మానసిక విశ్లేషణలూ ఘోషిస్తున్నాయి. ఈ తరమే రేపటి మన దేశ బంగారు భవిష్యత్తు. వాళ్ల అభ్యర్థనను అర్థం చేసుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుందాం! మార్కుల మిల్లుల్లా కాదు మానవత్వమున్న మనషుల్లా పెంచుకుందాం!