ప్రతిధ్వనించే పుస్తకం
‘బ్రిటీషు రాజ్యంలోని బెజవాడ’ నుంచి నైజాం రాజ్యంలోని ఒక గ్రామానికి ఆదరణ కోసం వస్తాడు సారంగపాణి. అతడికి సంగీతం తెలుసు. ‘రాళ్ళను కరి’గించేలా పాడిన సారంగపాణి పాట విన్న దొర రామారెడ్డి తన గడీలోనే ఉండిపొమ్మంటాడు. గడీ దొరవారి ఖిల్లా. ఆ ఊరి మొత్తానికీ ఏకైక భవంతి. అక్కడినుంచీ సారంగపాణి కోణంలో నైజాం రాజ్యంలో స్వాతంత్య్రానికి పూర్వపు తెలంగాణ చరిత్రను ‘చిల్లర దేవుళ్లు’లో చిత్రిస్తాడు రచయిత దాశరథి రంగాచార్య. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, అప్పుడు వేళ్లూనుకొనివున్న దారుణమైన బానిస పద్ధతులను వివరిస్తాడు.
‘పట్నం పోవడానికి ఎక్కిన బండి ముంగల ఒకడూ, బెడ్డింగు నెత్తిన పెట్టుకుని ఇంకొకడూ ఉరికి రావడం’ చూస్తాడు. ఉరకలేనివాణ్ని దొర ములుగర్రతో బాదినప్పుడు అతడి ప్రాణం విలవిల్లాడుతుంది. బల్లమీద సర్దుతుండగా గాజుబిందె పగిలిపోతే పనివాడిని దొర లాగి కొడతాడు, కాలితో తంతాడు. రామారెడ్డి కూతురు మంజరి. ఆమెకు సంగీతమంటే ప్రాణం. దాంతో ఇద్దరికీ పరస్పరం ప్రేమ అంకురిస్తుంది.
వాళ్లింట్లోనే దాసి వనజ ఉంటుంది. ఆమె ఆడబాప. గడీకి వచ్చిపోయే అతిథులకు ఒక బొమ్మగా ఉండాల్సిన బతుకు. ఆమె ‘కన్నెచెర’ను దొర బావమరిది ఇంద్రారెడ్డి విడిపిస్తాడు. ఈ ఇద్దరూ ఒకే ఈడు ఆడపిల్లలే అయినా మంజరి జీవితానికీ, వనజ బతుక్కీ ఉన్న తేడా గ్రహిస్తాడు సారంగపాణి. రామారెడ్డికి తోడు లంబాడీల పైకం తిన్న కరణం మరో ముఖ్యపాత్ర.
దొరకీ కరణానికి వైరం ఉన్నప్పటికీ జనాన్ని అణిచివేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ ఒకటేనని తెలుసుకుంటాడు. బాగా తాగి లంబాడోళ్ల లక్ష్మిపై అత్యాచారం చేయబోతాడు అమీను. ఆమె ఎదురుతిరిగితే కాల్చేస్తాడు. మొత్తంగా, అధికార రూపంలో వెలిసిన చిల్లర దేవుళ్లు జరిపిన దాష్టీకాలకు ఈ నవల అద్దం పడుతుంది. మతమార్పిడుల ప్రహసనం, అప్పటి తెలుగు భాష పరిస్థితి కూడా అవగతమవుతాయి.
కృష్ణ ఒడ్డున తప్పిపోయిన మేనల్లుడే సారంగపాణి అని తెలియడమూ, చివర్లో రామారెడ్డి మారిపోవడమూ కొంత నాటకీయంగా ఉన్నప్పటికీ సహజమైన తెలంగాణ నుడికారంతో సాగే ఈ నవల చరిత్రను అర్థం చేసుకోవడానికి తప్పక చదవాల్సిన నవల.
Comments
Please login to add a commentAdd a comment