దాశరథి 'జీవనయానం'
దాశరథి రంగాచార్యులు ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరులో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికింద్రాబాద్ పురపాలక కార్పోరేషన్లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.తండ్రి కుటుంబకలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు.
చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది.
పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి. తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.
నవలలు: మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు, జనపథం, రానున్నది ఏది నిజం?, అమృతంగమయ
ఆత్మకథ: జీవనయానం
అనువాదాలు: నాలుగు వేదాల అనువాదం, ఉమ్రావ్ జాన్
జీవిత చరిత్ర రచనలు: శ్రీమద్రామానుజాచార్యులు, బుద్ధుని కథ
ఇతరాలు: శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతం, వేదం-జీవన నాదం, శతాబ్ది