ప్రముఖ రచయిత దాశరథికి అస్వస్థత
యశోద ఆసుపత్రిలో చేరిక కోలుకుంటున్నట్లు సవూచారం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య (86) రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. డయాబెటిక్ న్యూరోపతి వ్యాధితో బాధపడుతున్న ఆయనకు అధిక రక్తపోటు, షుగర్ లెవెల్స్ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తోడయ్యాయి. గత సోమవారం దాశరథి కృష్ణమాచార్య జయంతి రోజునే రంగాచార్య ఆరోగ్యం విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన అల్లుడు సురోత్తమాచార్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలోనే ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి డాక్టర్లు వైద్య సేవలు అందజేశారని, ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉందని ఆయున తెలిపారు.
హరీష్‌రావు పరామర్శ: తీవ్ర అనారోగ్యంతో యశోదలో చికిత్స పొందుతున్న దాశరథిని మంత్రి హరీష్‌రావు శనివారం పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొనే విధంగా మెరుగైన వైద్య సేవలను అందజేయాలని కోరారు. ఆయనతోపాటు ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి కూడా దాశరథిని పరామర్శించారు.