లవ్యూ అనేయకుండా ప్రివ్యూ ప్లాన్ చేశారు!
‘నిన్నే పెళ్లాడతా’ షూటింగ్ లో... ఫస్ట్ టైమ్... గీతను చూశారు వైవీఎస్ చౌదరి. ఆ సినిమా కో-డెరైక్టర్ ఆయన. అందులో హీరో చెల్లెలు.... గీత. అమెను చూడగానే... ‘ఐ లవ్యూ’ చెప్పాలన్నంత ఫీల్ కలిగింది వైవీఎస్‌కి. చెబితే ఎంత బాధ్యతగా ఉండాలో ఆయనకు తెలుసు. అందుకే... నేరుగా వెళ్లి పెద్దవాళ్లకు చెప్పారు!
‘నిన్ను పెళ్లాడాలంటే...’ అంటూ... కండిషన్ మీద కండిషన్ పెట్టారు గీత. అన్నిటికీ ‘ఓకే’ అన్నారు వైవీఎస్. పెళ్లయింది, డెరైక్టర్‌గా కొన్ని సినిమాలయ్యాయి. కొన్ని ఆటుపోట్లూ ఎదురయ్యాయి. ‘అర్థం చేసుకునే భార్య ఉంటే భర్త ఎప్పుడూ విజేతే’ అంటారు వైవీఎస్. ‘భర్తను అర్థం చేసుకోవాలంటే ప్రేమతో పాటు సహనమూ ఉండాలి’ అంటారు గీత. ఈ ఆలూమగల మధ్య అండర్‌స్టాండింగే ఈవారం ‘మనసే జతగా...’ వారిమాటల్లోనే...
వైవీఎస్ చౌదరి: మా ఊరు గుడివాడ. అక్కడే పుట్టి పెరిగాను. నన్ను ఇంజినీర్‌ని చేయాలని అమ్మానాన్న ఆశ. కాని కాలేజీ రోజుల్లో సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువైంది. దాంతో ఇంజనీరింగ్ చదువుదామని మద్రాస్ వెళ్లి, ఆ తర్వాత డిస్‌కంటిన్యూ చేసి సినిమాల వైపు వచ్చాను. చదువు విషయంలో ఎలాగూ నిరాశపరిచాను కాబట్టి, పెళ్లి విషయంలో మాత్రం అమ్మానాన్నను నిరాశపరచకూడదనుకున్నా. ఆ ఆలోచనతోనే ఏడాదిపాటు నా మనసులోని భావాలేవీ గీతకు చెప్పలేదు.
ఇరు కుటుంబాల వారినీ ఒప్పించాలి...
‘నిన్నేపెళ్లాడుతా’ సినిమా షూటింగ్ సమయంలో గీతను మొదటిసారి చూశాను. హీరోకి చెల్లెలు పాత్ర చేయడానికి వచ్చింది తను. మొదటి చూపులోనే ‘దిల్ తో పాగ ల్ హై’ లాంటి ఫీలింగ్ కలిగింది. కాని తనతో చెప్పలేదు. ఎట్టకేలకు అమ్మనాన్నలను కన్విన్స్ చేయగలను అని నమ్మకం కలిగాక ఒక రోజు గీతతో ‘నువ్వూ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ‘సరే’ అంది తను. గీతను, వాళ్ల అన్నయ్యను ఇంటికి భోజనానికి పిలిచి అమ్మానాన్నలకు స్నేహితురాలిగా పరిచయం చేశాను. వాళ్లు వెళ్లిపోయాక చెప్పాను ‘నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం... కాని ‘వారి కుటుంబం, పట్టింపులేమిటో’ తెలియదు’ అన్నాను. ‘నచ్చింది కదా, అంతే చాలు’ అన్నారు. ఆ తర్వాత గీత అమ్మానాన్నలను కలిశాను. అందరినీ కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాను. అలా రెండు మూడు నెలల్లోనే (జూన్ 14, 1997) గీత నా అర్ధాంగి అయ్యింది.
అమ్మ, అర్ధాంగి ఇద్దరూ కావాలి...
గీత చాలా మృదుస్వభావి. అందుకే (అత్త-కోడలు) ఇద్దరి మధ్యా విభేదాలు రావు. పొరపాటున వస్తున్నాయనిపించినా ఇద్దరినీ కన్విన్స్ చేసే నేర్పు నాలో ఉంది. గీతతో నా అనుబంధం ఎలా పెరుగుతూ వచ్చిందో సౌకర్యాలూ అలాగే వచ్చాయి. అయినా గీత ఎన్నడూ అహం చూపలేదు. ఇంట్లోనూ, బంధువులతోనూ కలివిడిగా ఉంటుంది. ఏ చిన్న అకేషనైనా మా ఇద్దరి కుటుంబాలు తప్పక కలిసేలా ప్లాన్ చేస్తుంది.
అండగా ఉండాలి...
‘లాహిరి లాహిరి లాహిరి’ సినిమాతో ప్రొడ్యూసర్‌నయ్యాను. అమ్మానాన్నలే కాదు, అత్తింటి వారు కూడా ఆ సినిమాకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. మొదట్లో వరుస సినిమాల సక్సెస్ చవిచూసిన నేను, రెండు సినిమాల ఫెయిల్యూర్స్‌తో బ్యాడ్ పిరియెడ్ కూడా చవిచూశాను. ఎవరు ఎంతగా నిరాశ పరిచినా జయాపజయాలన్నింటిలో నాకు ఎప్పుడూ తోడుగా నిలిచింది గీత! తనకు తెలుసు నా పనిలో ఉండే క్లారిటీ! నేను కష్టపడే విధానం. అర్థం చేసుకునే తత్వం అర్ధాంగిలో ఉంటే ఆ భర్త ఎప్పుడూ విజేతే!
గీత: నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! మా ఇంట్లో ఒక్కత్తే అమ్మాయిని అని అపురూపంగా పెంచారు. అమ్మ వైపు వారంతా ప్రభుత్వ ఉద్యోగులే! అందుకే చిన్నప్పటి నుంచి ‘బాగా చదువుకోవాలి. అమెరికాలో మంచి జాబ్ చేస్తూ, అక్కడే స్థిరపడాలి...’ ఇలాగే ఉండేవి నా కలలు. అనుకోకుండా అమ్మను తెలిసినవారు అడగడంతో కొన్ని పత్రికలకు, మ్యాగజీన్లకు మోడలింగ్ చేశాను. ఆ తర్వాత సీరియల్‌లో, అటు తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అక్కడే కో డెరైక్టర్‌గా ఈయన్ని చూశాను. ఈయనతో మాట్లాడుతుంటే టైమ్ తెలిసేది కాదు. పెళ్లయ్యాక ఈయనతో కలిసి అమెరికా అంతా చుట్టివచ్చాను.
హామీ అవసరం...
పెళ్లినాటికి డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నాను. ఈయన పెళ్లి విషయం ఎత్తినప్పు డు... ‘నేను చదువుకోవాలి. పిల్లలకోసం కొంత గ్యాప్ తీసుకోవాలి. పిల్లలు పుడితే వారికోసం మీరు సమయం కేటాయించాలి, మా పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి... అలా అయితేనే పెళ్లి’ అని చెప్పాను. అలాగే పెళి ్లతర్వాత కూడా చదువు కొనసాగించాను. రోజూ ఈయనే నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసేవారు. డిగ్రీ పూర్తయ్యేంతవరకు నాకు వంట కూడా రాదు. మా అత్తగారు నాకు అండగా నిలిచారు. ఈయన మా ఇద్దరు అన్నయ్యల్లో ఒకరిగా కలిసిపోతారు. అంత బాగానూ అత్తమామలతో ఉంటారు. వైవాహిక జీవితం పరిపూర్ణం కావాలంటే ఇరువైపు కుటుంబాల ఆప్యాయతలూ అవసరమే!
అర్థం చేసుకోవాలి...
ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నారంటే పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తారు. సృజనాత్మక పనిలో ఎంతటి కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఈయన నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. వస్తాయి. ఆ ఆలోచనతోనే ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను. భాగస్వామిని అర్థం చేసుకోవాలంటే ప్రేమతో పాటు సహనమూ ఉండాలి. మేం గొడవపడని సందర్భాలు అస్సలు ఉండవని కాదు. మాకు ఇద్దరు పిల్లలు ‘యుక్తా, ఏక్తా’. పెళ్లికి ముందు పిల్లల కోసం టైమ్ కేటాయిస్తానని హామీ ఇచ్చి, నిలబెట్టుకోవడం లేదని సరదాగా దెబ్బలాడుతుంటాను. నాకు ప్రపంచంలోని ఫుడ్ వెరైటీలన్నీ టేస్ట్ చేయాలని ఉంటుంది. ఈయన ఇంట్లో పచ్చడి వేసుకునైనా తినగలరు. ఫంక్షన్‌కి వెళ్లినా ముందు ఇంట్లో తిని వెళతారు. ‘రొటీన్ ఫుడ్ ఎందుకు’ అని అంటాను. ఈయన సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే నేను వంటల్లో ప్రయోగాలు చేసి, ప్రశంసలు పొందుతుంటాను. సరదాలే కాదు అలగడం, కోపం చూపించడం మా మధ్య అప్పుడప్పుడూ ఉంటూనే ఉంటాయి. అవన్నీ బంధాన్ని మరింత బలోపేతం చేసేవే!
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇన్నేళ్లూ నా ప్రతి కష్టంలోనూ, సుఖంలోనూ తనూ నాతో కలిసి ప్రయాణించింది. గీతలో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇంగ్లీషు సినిమాలు బాగా చూస్తుంది. ఇంగ్లీష్ నవలలు విపరీతంగా చదువుతుంది. ఒక కథ డెరైక్టర్ కంటే బాగా చెప్పగలదు. అందుకే నాకు ఏదైనా కథ ఐడియా వస్తే ముందు గీతకే చెప్పి విశ్లేషిస్తాను. నేను తీసే ప్రతి సినిమాలో గీత కంట్రిబ్యూషన్ తప్పక ఉంటుంది.
- వైవీఎస్ చౌదరి
మా ఇంటి నేమ్ ప్లేట్ మీద మా అత్తమామల పేర్లు ఉంటాయి. ఈయన తీసే సినిమా ప్రాజెక్ట్‌కు నా పేరు ఉంటుంది. ‘మీ పేరు పెట్టచ్చు కదా’ అంటే... ‘ఇంట్లో ఎవరినీ తక్కువ చేయడం ఇష్టం ఉండదు’ అంటారు. అంతేకాదు... ఎవరు ఏ మూడ్‌లో ఉన్నా కన్విన్స్ చేయగల నేర్పు తన సొంతం. అయితే అందులో ఉండే నిజాయితీని చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది.
- గీత