ninne pelladatha
-
నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున
Nagarjuna: నాగార్జున, టబు హీరో, హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా విడుదలై పాతికేళ్లు దాటింది. ఈ సందర్భంగా నాగార్జున ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎక్కువగా బైక్ సీన్స్ ఉన్నాయి. అయితే అవన్నీ డూప్ లేకుండానే చేశానని నాగార్జున తెలిపారు. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా అలా చేయవద్దనే వాళ్లకి చెబుతాను అని పేర్కొన్నారు. ఆ సీన్స్‌లో గంటకి 80-90 మీటర్ల వేగంతో బైక్ నడిపామని, ఒకరు పడ్డా అందరూ పడేవాళ్లని పేర్కొన్నారు. అప్పుడు ఎలాగో చేశాను కానీ అలాంటి రిస్కీ థింగ్స్ చేయొద్దనే సలహా ఇస్తానని సినిమా విశేషాలను పంచుకున్నారు. కాగా ప్రస్తుతం నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. -
Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’
‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారిలా.. ► నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగార్జునగారు ఎలా ఉంటారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. రియల్ లైఫ్‌లో నేను చూసిన నాగార్జుననే సినిమాలో శీనుగా పేరు మార్చి చూపించానంతే. ► చెన్నైలో మూడు నాలుగేళ్లుగా వివిధ డిపార్ట్మెంట్స్లో రకరకాల పనులు చేస్తున్న నన్ను.. శివ నాగేశ్వరరావు ‘శివ’ సినిమా కోసం రాముగారి వద్ద (రామ్ గోపాల్ వర్మ) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్పించారు. ‘శివ’ సమయంలో నేను, తేజ, శివ నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ఆ చిత్ర నిర్మాత నాగార్జునగారు అన్నపూర్ణ స్టూడియోలోనే మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు. తెలుగు ‘శివ’, హిందీ ‘శివ’ చిత్రాలకు దాదాపు రెండున్నరేళ్లు స్టూడియోలోనే ఉండి పనిచేశాం. అప్పుడు నా జీవితంలో దగ్గరగా చూసిన పెద్ద స్టార్ (అక్కినేని నాగేశ్వరరావు) కొడుకు, స్టార్ హీరో నాగార్జునగారు. ‘అంతం’ సినిమాకి బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాను. నా పనితీరును గమనించిన నాగార్జునగారు డైరెక్టర్ అవుతావా? ఏదైనా కథ రెడీ చేసుకో అన్నారు. ► ‘అంతం’ సినిమా చిత్రీకరణ ముగిసే సమయంలో విజయవాడ రౌడీయిజంపై నాగార్జునకి ఓ కథ చెప్పాను. ఇంట్రవెల్ వరకూ విని.. ‘ఈ కథ వద్దులే వంశీ.. రాము(ఆర్జీవీ) సినిమాలాగానే ఉంది ఇది. నీకు ఇండిపెండెంట్ కథ ఉన్నప్పుడు కచ్చితంగా చేద్దాం’ అన్నారు నాగార్జున. నా ‘గులాబీ’ సినిమా అయిపోయిన సమయంలో నాగార్జున ‘రాముడొచ్చాడు’ సినిమా చేస్తున్నారు. అప్పటికే నేను రెడీ చేసుకున్న ‘అన్యాయం’ అనే ఓ కథ వినిపిస్తే, ‘బాగుంది.. కానీ ఇంకొంచెం కొత్తగా చేద్దాం’ అన్నారు. ► ‘గులాబీ’ విడుదలయ్యాక నేను, ‘నిధి’ ప్రసాద్, కెమెరామ్యాన్ కలసి వైజాగ్‌లో లొకేషన్స్ చూడటానికి వెళ్లాం. ఒకతను వచ్చి.. ‘గులాబి’ సినిమాని అచ్చం మీ బాస్‌లాగా (ఆర్జీవీ) బాగా తీశావ్ అన్నాడు. ‘గులాబి’ చిత్రానికి నాకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదా? అని అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. వయలెంట్ సినిమా తీస్తే బాస్‌లా తీశావంటారు.. ఇప్పటి వరకూ బాస్ టచ్ చేయని ఫ్యామిలీ జానర్లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని బాస్‌కి చెబితే ఓకే అన్నారు. నేను ఏ సినిమా చేసినా కథ బాస్‌కి(ఆర్జీవీ) చెప్పేవాణ్ణి.. ఆయనకు నచ్చితే ఓకే అంటారు.. ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే చెప్పేవారు. ► ఈ చిత్రంలో ‘నా మొగుడు రామ్‌ప్యారి’ అనే పాటని సుద్దాల అశోక్ తేజగారు బాగా రాశారు. ఆ ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటల్ని గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనదైన శైలిలో అద్భుతంగా రాశారు. ► నాకెప్పుడూ ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడం ఇష్టం. చలపతిరావుగారి ఫార్ములాయే జీవా, బ్రహ్మాజీలకు వాడాను. ఫ్యామిలీ అంటే రక్త సంబంధీకులే కాదు.. స్నేహితులు కూడా అనే కాన్సెప్ట్‌లో తీసుకున్నాను. చలపతి రావు, చంద్రమోహన్, గిరిబాబు, ఉత్తేజ్ పాత్రలు కూడా బాగా పండాయి. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘సింధూరం’ కథ అనుకున్నా. రాఘవేంద్ర రావుగారు నాపై ఉన్న ఇష్టంతో మందలించారు. ‘ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఎవరూ మనల్ని పట్టించుకోరు. మంచి జానర్ నుంచి ఎందుకు బయటికొస్తున్నావ్.. అందరి హీరోలతోనూ కుటుంబ కథా చిత్రాలు చెయ్’ అన్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ హిట్ అయ్యాక చాలా మంది హీరోలు కూడా కుటుంబం నేపథ్యంలో మాతో కూడా సినిమాలు చేయమని అడిగారు. అయితే నాగార్జునగారు మినహా వేరే హీరోలపై నాకు కుటుంబ కథా చిత్రం చేయాలనే ఆలోచన రాలేదు. చదవండి: ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు -
ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు: నాగార్జున
కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. శ్రీను, పండు పాత్రలు అలాంటివే. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున అక్కినేని –టబు చేసి పాత్రల పేర్లివి. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘హోల్సమ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 4)కి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లతో స్పెషల్ టాక్. నాకు రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ► ఇది చూస్తుంటే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు అప్పుడే పాతికేళ్లు పూర్తయ్యాయా అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. రాము (రామ్‌గోపాల్ వర్మ) ప్రొడక్షన్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ సినిమాను రిలీజ్‌కు ముందే చూశాను.. ఆ సినిమా నచ్చి, నా అభిప్రాయాలను రామూతో షేర్ చేసుకున్నాను. ఈ దర్శకుడితో ఓ రొమాంటిక్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని రామూతో అన్నాను. కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్.. అతనితో నువ్వు వర్క్ చేస్తే బాగానే ఉంటుందన్నాడు. పైగా నా ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన కృష్ణవంశీతో నాకూ పరిచయం ఉంది. అలా ‘నిన్నే పెళ్లాడతా’ మొదలైంది. కథ ముందే చెబితే పడే గొడవల్ని షూటింగ్‌కు ముందే పడదామని వంశీకి చెబితే ఓకే అన్నాడు. డైలాగ్స్, ప్లేస్‌మెంట్స్ ఇలా అన్నింటితో కథ చెప్పాడు. అయితే చివరి 10 నిమిషాలు మినహాయించి కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. ► కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఈ సినిమాను నిర్మిస్తూ, నిర్మాతగా మారాను. అప్పటివరకు నాన్నగారు, అన్నయ్య సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే నాన్నగారు రిటైర్ అవ్వడం, పెద్దన్నయ్య సినిమాలు కాస్త తగ్గించడంతో నేను స్టార్ట్ చేశాను. ► అప్పట్లో శ్రీను, పండు (మహాలక్ష్మి) క్యారెక్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. బైక్ రేస్, సముద్రంలో పాట... ఇలా కొత్తగా చూపించాం. ‘గ్రీకువీరుడు..’ పాట వండర్ఫుల్. నాకు మ్యాచో అండ్ రొమాంటిక్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన పాట ఇది. సాధారణంగా రొమాంటిక్కు మ్యాచో ఇమేజ్ రాదు. రెండూ ఒకే టైమ్‌లో వర్కౌట్ కావు. కానీ కృష్ణవంశీకి అది సాధ్యం అయ్యింది. కృష్ణవంశీ తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేసి నాకు బాగా హెల్ప్ చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు. ► సినిమాలోని బైక్ సీక్వెన్స్‌ను నేను డూప్ లేకుండా చేశాను. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా చేయవద్దనే చెబుతాను. ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. పాటల్లో పెద్దగా డ్యాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. ► క్యారెక్టర్ల మధ్య వైవిధ్యం చూపించడాన్ని నా అదృష్టంగానే భావిస్తాను. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘అన్నమయ్య’ షూటింగ్‌ను స్టార్ట్ చేశా. క్లాస్, మాస్ కన్నా అది ఇంకా డిఫరెంట్. ఇక్కడ టబుతో ‘కన్నుల్లో నీ రూపమే..’ వంటి పాటలు చేసి, ‘అన్నమయ్య’ షూట్లో పాల్గొనడం అంటే.. కాస్త లక్కీయే. తెలుగు ప్రేక్షకులు నన్ను రెండు విధాలుగా చూసేందుకు అంగీకరించారు. అలాగే దర్శకులు నాపై ఉంచిన నమ్మకం కూడా. ‘‘నిన్నే పెళ్లాడతా..’ వంటి రొమాంటిక్ ఫిల్మ్ చేస్తున్నాను... మీరు ‘అన్నమయ్య’ సినిమా చేయమంటున్నారు. వచ్చి ఒకసారి పాటలు చూడండి’ అని రాఘవేంద్రరావుగారితో అన్నాను. ‘నాకు వదిలెయ్’ అన్నారు. ‘అన్నమయ్య’ సినిమాకు పనికి రాడు అని టాక్ కూడా వచ్చింది. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్లయింది. ‘అన్నమయ్య’ వంటి పాత్రలు కూడా నేను చేయగలనని నిరూపించుకోగలిగాను. నా కెరీర్లో ఓ బెంచ్ మార్క్: టబు నా జీవితంలో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఓ తీయని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. కృష్ణవంశీ మంచి తపన ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు కుటుంబసభ్యుల మధ్య పని చేసినట్లుగా, ఏదో పిక్నిక్కి వెళ్లినట్లుగా అనిపించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత నా ఫ్యామిలీని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. సినిమాతో పాటు పాటలు కూడా హిట్టే. తన తొలి సినిమాయే అయినా సందీప్ చౌతా మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన దర్శకుల్లో వంశీ (కృష్ణవంశీ) మంచి ప్రతిభాశాలి. ∙ఈ చిత్రంలో నాగార్జున చేసిన శ్రీను క్యారెక్టర్ ఫన్నీ, లవ్లీ అండ్ ఎంటర్టైనింగ్. నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. కానీ సినిమాలో పండు అని పిలుస్తుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. శ్రీను, పండుల మధ్య కెమిస్ట్రీని వంశీ చాలా సహజంగా తీశారు. ఇలాంటి సినిమాలను రీ క్రియేట్ చేయడం కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్... నా కెరీర్లో కూడా. చదవండి: ఓటీటీ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి.. కానీ.. -
నీ నీడై వెంటాడనా..
నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మిస్తున్నారు. సిద్ధిక కథానాయికగా నటిస్తోంది. ‘నేనే నీ నీడై వెంటాడనా.. వేసే అడుగుల్లో తారాడనా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా, చిన్మయి ఆలపించారు. బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘ మా చిత్రం టైటిల్‌ను నాగార్జునగారే విడుదల చేసి, మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉంది’’ అన్నారు. -
మళ్లీ నిన్నే పెళ్లాడతా
నాగార్జున–కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ప్రస్తుతం ఈ టైటిల్‌తోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్ లోగోను నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వైకుంఠ బోను మాట్లాడుతూ – ‘‘లోగో రిలీజ్ చేసిన నాగార్జునగారికి కృతజ్ఞతలు. మంచి కథాంశంతో ఈ చిత్రం చేస్తున్నాం. ఇప్పటికి 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తాం. అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వైజాగ్, కులుమనాలిలో ఓ షెడ్యూల్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత. -
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి...
పదం పలికింది – పాట నిలిచింది ప్రేమికుల చూపు ఎంత తీక్షణంగా ఉంటుంది! ఎంత లోతుగా, ఎంత గాఢంగా ఉంటుంది! నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన– ‘కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే’ పాటలోని ఈ పంక్తి వ్యక్తపరుస్తుంది. ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నాపేదెలా’ అంటుంది నాయిక. దీనికి కొనసాగింపుగా నాయకుడు అడిగే భావన కూడా అందమైనది. ‘నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా’. దీనికి సంగీతం అందించింది సందీప్ చౌతా. గాయనీ గాయకులు చిత్ర, హరిహరన్. ఎందుకో ఇందులో చిత్ర గొంతు కొత్తగా వినిపిస్తుంది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ. అక్కినేని నాగార్జున, టాబు నటించారు. -
నాగ్ టైటిల్‌తో చైతూ మూవీ..?
కింగ్ నాగార్జున కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో నిన్నే పెళ్లాడతా ఒకటి. నాగార్జున, టబు జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించటంతో పాటు నాగ్‌కు రొమాంటిక్ హీరో ఇమేజ్ను సుస్థిరం చేసేసింది. అయితే ఇప్పుడు ఇదే పేరుతో నాగార్జున వారసుడు నాగచైతన్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చైతన్య, సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు నిన్నేపెళ్లాడతా అనే టైటిల్‌ను పెట్టాలని భావిస్తున్నారట. నిన్నే పెళ్లాడతా సినిమాకు రీమేక్ కాకపోయినా, సినిమాకు ఆ టైటిల్ పెడితే మంచి హైప్ క్రియేట్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. -
‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో చేయాలని ఉంది
‘‘కెరీర్లో ఎప్పటికైనా నాగార్జునగారి ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. అలాగే... ప్రముఖ దర్శకులందరితో పనిచేయాలనుంది’’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. ఆయన కథానాయకునిగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఊహలు గుసగుస లాడే’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని నాగశౌర్య ఆనందం వెలిబుచ్చారు. సినిమా అవకాశాలకోసం తిరిగి తిరిగి చివరి ప్రయత్నంగా ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నానని, మంచి పాత్రతో ప్రోత్సహించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని నాగశౌర్య తెలిపారు. కెరీర్‌ని జాగ్రత్తగా మలచుకోవాలనుకుంటున్నానని, ప్రస్తుతం సాయి కొర్రపాటి నిర్మాణంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా చేస్తున్నానని, రాజమౌళి సహాయకుడు కోటి ఈ సినిమాకు దర్శకుడని, అలాగే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా కూడా చేస్తున్నానని శౌర్య చెప్పారు. -
లవ్యూ అనేయకుండా ప్రివ్యూ ప్లాన్ చేశారు!
‘నిన్నే పెళ్లాడతా’ షూటింగ్ లో... ఫస్ట్ టైమ్... గీతను చూశారు వైవీఎస్ చౌదరి. ఆ సినిమా కో-డెరైక్టర్ ఆయన. అందులో హీరో చెల్లెలు.... గీత. అమెను చూడగానే... ‘ఐ లవ్యూ’ చెప్పాలన్నంత ఫీల్ కలిగింది వైవీఎస్కి. చెబితే ఎంత బాధ్యతగా ఉండాలో ఆయనకు తెలుసు. అందుకే... నేరుగా వెళ్లి పెద్దవాళ్లకు చెప్పారు! ‘నిన్ను పెళ్లాడాలంటే...’ అంటూ... కండిషన్ మీద కండిషన్ పెట్టారు గీత. అన్నిటికీ ‘ఓకే’ అన్నారు వైవీఎస్. పెళ్లయింది, డెరైక్టర్‌గా కొన్ని సినిమాలయ్యాయి. కొన్ని ఆటుపోట్లూ ఎదురయ్యాయి. ‘అర్థం చేసుకునే భార్య ఉంటే భర్త ఎప్పుడూ విజేతే’ అంటారు వైవీఎస్. ‘భర్తను అర్థం చేసుకోవాలంటే ప్రేమతో పాటు సహనమూ ఉండాలి’ అంటారు గీత. ఈ ఆలూమగల మధ్య అండర్‌స్టాండింగే ఈవారం ‘మనసే జతగా...’ వారిమాటల్లోనే... వైవీఎస్ చౌదరి: మా ఊరు గుడివాడ. అక్కడే పుట్టి పెరిగాను. నన్ను ఇంజినీర్ని చేయాలని అమ్మానాన్న ఆశ. కాని కాలేజీ రోజుల్లో సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువైంది. దాంతో ఇంజనీరింగ్ చదువుదామని మద్రాస్ వెళ్లి, ఆ తర్వాత డిస్కంటిన్యూ చేసి సినిమాల వైపు వచ్చాను. చదువు విషయంలో ఎలాగూ నిరాశపరిచాను కాబట్టి, పెళ్లి విషయంలో మాత్రం అమ్మానాన్నను నిరాశపరచకూడదనుకున్నా. ఆ ఆలోచనతోనే ఏడాదిపాటు నా మనసులోని భావాలేవీ గీతకు చెప్పలేదు. ఇరు కుటుంబాల వారినీ ఒప్పించాలి... ‘నిన్నేపెళ్లాడుతా’ సినిమా షూటింగ్ సమయంలో గీతను మొదటిసారి చూశాను. హీరోకి చెల్లెలు పాత్ర చేయడానికి వచ్చింది తను. మొదటి చూపులోనే ‘దిల్ తో పాగ ల్ హై’ లాంటి ఫీలింగ్ కలిగింది. కాని తనతో చెప్పలేదు. ఎట్టకేలకు అమ్మనాన్నలను కన్విన్స్ చేయగలను అని నమ్మకం కలిగాక ఒక రోజు గీతతో ‘నువ్వూ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ‘సరే’ అంది తను. గీతను, వాళ్ల అన్నయ్యను ఇంటికి భోజనానికి పిలిచి అమ్మానాన్నలకు స్నేహితురాలిగా పరిచయం చేశాను. వాళ్లు వెళ్లిపోయాక చెప్పాను ‘నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం... కాని ‘వారి కుటుంబం, పట్టింపులేమిటో’ తెలియదు’ అన్నాను. ‘నచ్చింది కదా, అంతే చాలు’ అన్నారు. ఆ తర్వాత గీత అమ్మానాన్నలను కలిశాను. అందరినీ కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాను. అలా రెండు మూడు నెలల్లోనే (జూన్ 14, 1997) గీత నా అర్ధాంగి అయ్యింది. అమ్మ, అర్ధాంగి ఇద్దరూ కావాలి... గీత చాలా మృదుస్వభావి. అందుకే (అత్త-కోడలు) ఇద్దరి మధ్యా విభేదాలు రావు. పొరపాటున వస్తున్నాయనిపించినా ఇద్దరినీ కన్విన్స్ చేసే నేర్పు నాలో ఉంది. గీతతో నా అనుబంధం ఎలా పెరుగుతూ వచ్చిందో సౌకర్యాలూ అలాగే వచ్చాయి. అయినా గీత ఎన్నడూ అహం చూపలేదు. ఇంట్లోనూ, బంధువులతోనూ కలివిడిగా ఉంటుంది. ఏ చిన్న అకేషనైనా మా ఇద్దరి కుటుంబాలు తప్పక కలిసేలా ప్లాన్ చేస్తుంది. అండగా ఉండాలి... ‘లాహిరి లాహిరి లాహిరి’ సినిమాతో ప్రొడ్యూసర్నయ్యాను. అమ్మానాన్నలే కాదు, అత్తింటి వారు కూడా ఆ సినిమాకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. మొదట్లో వరుస సినిమాల సక్సెస్ చవిచూసిన నేను, రెండు సినిమాల ఫెయిల్యూర్స్‌తో బ్యాడ్ పిరియెడ్ కూడా చవిచూశాను. ఎవరు ఎంతగా నిరాశ పరిచినా జయాపజయాలన్నింటిలో నాకు ఎప్పుడూ తోడుగా నిలిచింది గీత! తనకు తెలుసు నా పనిలో ఉండే క్లారిటీ! నేను కష్టపడే విధానం. అర్థం చేసుకునే తత్వం అర్ధాంగిలో ఉంటే ఆ భర్త ఎప్పుడూ విజేతే! గీత: నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! మా ఇంట్లో ఒక్కత్తే అమ్మాయిని అని అపురూపంగా పెంచారు. అమ్మ వైపు వారంతా ప్రభుత్వ ఉద్యోగులే! అందుకే చిన్నప్పటి నుంచి ‘బాగా చదువుకోవాలి. అమెరికాలో మంచి జాబ్ చేస్తూ, అక్కడే స్థిరపడాలి...’ ఇలాగే ఉండేవి నా కలలు. అనుకోకుండా అమ్మను తెలిసినవారు అడగడంతో కొన్ని పత్రికలకు, మ్యాగజీన్లకు మోడలింగ్ చేశాను. ఆ తర్వాత సీరియల్లో, అటు తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అక్కడే కో డెరైక్టర్‌గా ఈయన్ని చూశాను. ఈయనతో మాట్లాడుతుంటే టైమ్ తెలిసేది కాదు. పెళ్లయ్యాక ఈయనతో కలిసి అమెరికా అంతా చుట్టివచ్చాను. హామీ అవసరం... పెళ్లినాటికి డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నాను. ఈయన పెళ్లి విషయం ఎత్తినప్పు డు... ‘నేను చదువుకోవాలి. పిల్లలకోసం కొంత గ్యాప్ తీసుకోవాలి. పిల్లలు పుడితే వారికోసం మీరు సమయం కేటాయించాలి, మా పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి... అలా అయితేనే పెళ్లి’ అని చెప్పాను. అలాగే పెళి ్లతర్వాత కూడా చదువు కొనసాగించాను. రోజూ ఈయనే నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసేవారు. డిగ్రీ పూర్తయ్యేంతవరకు నాకు వంట కూడా రాదు. మా అత్తగారు నాకు అండగా నిలిచారు. ఈయన మా ఇద్దరు అన్నయ్యల్లో ఒకరిగా కలిసిపోతారు. అంత బాగానూ అత్తమామలతో ఉంటారు. వైవాహిక జీవితం పరిపూర్ణం కావాలంటే ఇరువైపు కుటుంబాల ఆప్యాయతలూ అవసరమే! అర్థం చేసుకోవాలి... ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నారంటే పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తారు. సృజనాత్మక పనిలో ఎంతటి కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఈయన నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. వస్తాయి. ఆ ఆలోచనతోనే ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను. భాగస్వామిని అర్థం చేసుకోవాలంటే ప్రేమతో పాటు సహనమూ ఉండాలి. మేం గొడవపడని సందర్భాలు అస్సలు ఉండవని కాదు. మాకు ఇద్దరు పిల్లలు ‘యుక్తా, ఏక్తా’. పెళ్లికి ముందు పిల్లల కోసం టైమ్ కేటాయిస్తానని హామీ ఇచ్చి, నిలబెట్టుకోవడం లేదని సరదాగా దెబ్బలాడుతుంటాను. నాకు ప్రపంచంలోని ఫుడ్ వెరైటీలన్నీ టేస్ట్ చేయాలని ఉంటుంది. ఈయన ఇంట్లో పచ్చడి వేసుకునైనా తినగలరు. ఫంక్షన్‌కి వెళ్లినా ముందు ఇంట్లో తిని వెళతారు. ‘రొటీన్ ఫుడ్ ఎందుకు’ అని అంటాను. ఈయన సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే నేను వంటల్లో ప్రయోగాలు చేసి, ప్రశంసలు పొందుతుంటాను. సరదాలే కాదు అలగడం, కోపం చూపించడం మా మధ్య అప్పుడప్పుడూ ఉంటూనే ఉంటాయి. అవన్నీ బంధాన్ని మరింత బలోపేతం చేసేవే! - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్నేళ్లూ నా ప్రతి కష్టంలోనూ, సుఖంలోనూ తనూ నాతో కలిసి ప్రయాణించింది. గీతలో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇంగ్లీషు సినిమాలు బాగా చూస్తుంది. ఇంగ్లీష్ నవలలు విపరీతంగా చదువుతుంది. ఒక కథ డెరైక్టర్ కంటే బాగా చెప్పగలదు. అందుకే నాకు ఏదైనా కథ ఐడియా వస్తే ముందు గీతకే చెప్పి విశ్లేషిస్తాను. నేను తీసే ప్రతి సినిమాలో గీత కంట్రిబ్యూషన్ తప్పక ఉంటుంది. - వైవీఎస్ చౌదరి మా ఇంటి నేమ్ ప్లేట్ మీద మా అత్తమామల పేర్లు ఉంటాయి. ఈయన తీసే సినిమా ప్రాజెక్ట్‌కు నా పేరు ఉంటుంది. ‘మీ పేరు పెట్టచ్చు కదా’ అంటే... ‘ఇంట్లో ఎవరినీ తక్కువ చేయడం ఇష్టం ఉండదు’ అంటారు. అంతేకాదు... ఎవరు ఏ మూడ్‌లో ఉన్నా కన్విన్స్ చేయగల నేర్పు తన సొంతం. అయితే అందులో ఉండే నిజాయితీని చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. - గీత