కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. శ్రీను, పండు పాత్రలు అలాంటివే. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున అక్కినేని –టబు చేసి పాత్రల పేర్లివి. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘హోల్‌సమ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 4)కి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లతో స్పెషల్ టాక్.
నాకు రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది
► ఇది చూస్తుంటే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు అప్పుడే పాతికేళ్లు పూర్తయ్యాయా అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. రాము (రామ్‌గోపాల్ వర్మ) ప్రొడక్షన్‌లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ సినిమాను రిలీజ్‌కు ముందే చూశాను.. ఆ సినిమా నచ్చి, నా అభిప్రాయాలను రామూతో షేర్ చేసుకున్నాను. ఈ దర్శకుడితో ఓ రొమాంటిక్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని రామూతో అన్నాను. కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్.. అతనితో నువ్వు వర్క్ చేస్తే బాగానే ఉంటుందన్నాడు. పైగా నా ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన కృష్ణవంశీతో నాకూ పరిచయం ఉంది. అలా ‘నిన్నే పెళ్లాడతా’ మొదలైంది. కథ ముందే చెబితే పడే గొడవల్ని షూటింగ్‌కు ముందే పడదామని వంశీకి చెబితే ఓకే అన్నాడు. డైలాగ్స్, ప్లేస్‌మెంట్స్ ఇలా అన్నింటితో కథ చెప్పాడు. అయితే చివరి 10 నిమిషాలు మినహాయించి కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది.
► కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో ఈ సినిమాను నిర్మిస్తూ, నిర్మాతగా మారాను. అప్పటివరకు నాన్నగారు, అన్నయ్య సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే నాన్నగారు రిటైర్ అవ్వడం, పెద్దన్నయ్య సినిమాలు కాస్త తగ్గించడంతో నేను స్టార్ట్ చేశాను.
► అప్పట్లో శ్రీను, పండు (మహాలక్ష్మి) క్యారెక్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. బైక్ రేస్, సముద్రంలో పాట... ఇలా కొత్తగా చూపించాం. ‘గ్రీకువీరుడు..’ పాట వండర్‌ఫుల్. నాకు మ్యాచో అండ్ రొమాంటిక్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన పాట ఇది. సాధారణంగా రొమాంటిక్‌కు మ్యాచో ఇమేజ్ రాదు. రెండూ ఒకే టైమ్‌లో వర్కౌట్ కావు. కానీ కృష్ణవంశీకి అది సాధ్యం అయ్యింది. కృష్ణవంశీ తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేసి నాకు బాగా హెల్ప్ చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు.
► సినిమాలోని బైక్ సీక్వెన్స్‌ను నేను డూప్ లేకుండా చేశాను. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా చేయవద్దనే చెబుతాను. ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. పాటల్లో పెద్దగా డ్యాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి.
► క్యారెక్టర్ల మధ్య వైవిధ్యం చూపించడాన్ని నా అదృష్టంగానే భావిస్తాను. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘అన్నమయ్య’ షూటింగ్‌ను స్టార్ట్ చేశా. క్లాస్, మాస్ కన్నా అది ఇంకా డిఫరెంట్. ఇక్కడ టబుతో ‘కన్నుల్లో నీ రూపమే..’ వంటి పాటలు చేసి, ‘అన్నమయ్య’ షూట్‌లో పాల్గొనడం అంటే.. కాస్త లక్కీయే. తెలుగు ప్రేక్షకులు నన్ను రెండు విధాలుగా చూసేందుకు అంగీకరించారు. అలాగే దర్శకులు నాపై ఉంచిన నమ్మకం కూడా. ‘‘నిన్నే పెళ్లాడతా..’ వంటి రొమాంటిక్ ఫిల్మ్ చేస్తున్నాను... మీరు ‘అన్నమయ్య’ సినిమా చేయమంటున్నారు. వచ్చి ఒకసారి పాటలు చూడండి’ అని రాఘవేంద్రరావుగారితో అన్నాను. ‘నాకు వదిలెయ్’ అన్నారు. ‘అన్నమయ్య’ సినిమాకు పనికి రాడు అని టాక్ కూడా వచ్చింది. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్లయింది. ‘అన్నమయ్య’ వంటి పాత్రలు కూడా నేను చేయగలనని నిరూపించుకోగలిగాను.
నా కెరీర్‌లో ఓ బెంచ్ మార్క్: టబు
నా జీవితంలో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఓ తీయని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. కృష్ణవంశీ మంచి తపన ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు కుటుంబసభ్యుల మధ్య పని చేసినట్లుగా, ఏదో పిక్నిక్‌కి వెళ్లినట్లుగా అనిపించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత నా ఫ్యామిలీని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. సినిమాతో పాటు పాటలు కూడా హిట్టే. తన తొలి సినిమాయే అయినా సందీప్ చౌతా మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన దర్శకుల్లో వంశీ (కృష్ణవంశీ) మంచి ప్రతిభాశాలి. ∙ఈ చిత్రంలో నాగార్జున చేసిన శ్రీను క్యారెక్టర్ ఫన్నీ, లవ్లీ అండ్ ఎంటర్‌టైనింగ్. నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. కానీ సినిమాలో పండు అని పిలుస్తుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. శ్రీను, పండుల మధ్య కెమిస్ట్రీని వంశీ చాలా సహజంగా తీశారు. ఇలాంటి సినిమాలను రీ క్రియేట్ చేయడం కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్... నా కెరీర్‌లో కూడా.
Comments
Please login to add a commentAdd a comment