
తెల్లారి లేస్తే హీరోలను కలిసే ఫొటోగ్రాఫర్ జనంలో తిరిగినప్పుడు ఒక రియల్ హీరోను చూశారు.జనం ఆ రియల్ హీరో గురించి మాట్లాడటం గమనించారు.జనం ఆ రియల్ హీరో కావాలనుకోవడం చూసి అబ్బుర పడ్డారు.జాతి, కులం, మతం, వర్గం తేడా లేకుండా మార్పు కోసం ఆ రియల్ హీరో కోసం జేజేలు పలకడం ఆయన గమనించారు.మార్పు రాబోతున్నది అనేది ఆయన విశ్వాసం. జగన్ వల్లే అది సాధ్యం అంటున్నారు చోటా కె నాయుడు. జగన్‌ను ఎందుకు రియల్ హీరో అంటున్నదిఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
మీరు ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 40 ఏళ్లు గడిచిపోయాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు మీతో సుదీర్ఘకాలం కనెక్ట్ అయి ఉన్నారు. మీకెలా అనిపిస్తోంది?
చోటా: 1979 సెప్టెంబర్‌లో నేను సినిమా రంగంలో ప్రవేశించాను. ఇది 2019. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే సర్‌ప్రైజింగ్‌గా ఉంది. మా నాన్నగారు నాటక రచయిత, దర్శకులు. నన్ను కెమెరామేన్‌గా చూడాలన్నది ఆయన కోరిక. నాన్నగారి సహకారంతోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఒక కెమెరామేన్ వద్ద అసిస్టెంట్‌గా చేరితే చాలు లైఫ్ సెటిల్ అయిపోద్దనుకున్నా, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుగారిలాంటి హీరోతో ఓ సినిమాకి పనిచేస్తే చాలనుకున్నా. తర్వాత నాగార్జున, చిరంజీవిగారు, రజనీకాంత్‌గారితో ఒక్క సినిమా.. ఇలా అనుకున్నవన్నీ నెరవేరాయి. పిల్లల విజయం వాళ్ల అమ్మానాన్న చేసిన పుణ్యం మీద ఆధారపడి ఉంటుందంటారు. మా అమ్మానాన్న చేసిన పుణ్యం నాకు హెల్ప్ అయింది. అలాగే నా వైఫ్ సీతాదేవి కూడా. అంతేకానీ నా ప్రతిభ వల్లే ఇంత సక్సెస్ అయ్యానని అనుకోవడంలేదు. డెస్టినీయే కారణం అంటాను.
ఇప్పటికీ ఏదైనా పెద్ద సినిమా అంటే ఛోటా కావాలంటున్నారు. అది మీ టాలెంట్ కాదా?
(నవ్వుతూ) నో ఆన్సర్. అయితే ఒకటి చెబుతా. ఒకప్పుడు నా సక్సెస్ అంతా నా టాలెంట్ వల్లే అనుకున్నాను. కానీ వ్యక్తిగా సాధించిన అనుభవాలు ఆ తర్వాత దాన్ని డెస్టినీకి ఆపాదించేలా చేశాయి.
ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు?
కరెక్టుగా తెలీదు. సెంచరీకి దగ్గరగా ఉన్నాను. సెంచరీ పూర్తయ్యాక ఇక చాలు వీడికి అంటారేమో అని కరెక్ట్ కౌంట్ చెప్పడానికి భయపడుతున్నా (నవ్వుతూ).‘దాసరిగారు నా గురువు’ అని చెబుతుంటారు. డైరెక్టర్స్‌లో ఆయన 150 సినిమాల రికార్డ్ సాధించారు గదా. మరి కెమెరామేన్‌గా మీరు కూడా...తలరాతలు బ్రహ్మ రాస్తాడు అంటారు. కానీ, నా రాతని దాసరి నారాయణరావుగారనే బ్రహ్మ రాశారు. నా రాత రాసేటప్పుడు 150 సినిమాలు చేయమని రాశారేమో తెలియదు. వందకు దగ్గరలో ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఏం రాశారో. చూద్దాం.. డెస్టినీ అన్నది నన్ను ఎంతవరకూ తీసుకెళుతుందో.
దాసరిగారితో మీ అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకుంటారా?
కెమెరామేన్ కె.ఎస్. హరిగారి ద్వారా దాసరిగారు పరిచయం. ఆ రోజు నుంచి నాకు సర్వం ఆయనే అయిపోయారు. ఆయన దగ్గరే నేను ఓనమాలు దిద్దుకున్నా. క్రమశిక్షణ, ముక్కుసూటిగా మాట్లాడటం... ఇవన్నీ అక్కడి నుంచే అలవడ్డాయి నాకు.
ఇండస్ట్రీలో కొత్త నీరు రావడం చూసి మీరేమైనా ఫీలవుతున్నారా?
ఎందుకు ఫీలవ్వాలి? కొత్తవాళ్లు రావాలి కదా. ఇళయరాజాగారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తర్వాత ఏఆర్ రెహమాన్ వచ్చాడు. ఇప్పుడు అనిరు«థ్ అని ఇంకో అబ్బాయి వస్తున్నాడు. ఇళయరాజాగారు ఏమైనా అయిపోయారా? ఆయన ఆయనే.. నేను నేనే. వందమంది వచ్చినా, రెండొందల మంది వచ్చినా, ఎవరి స్టాండర్డ్ వారికి ఉంటుంది.
సినిమాలు తప్ప మీకు మరో ప్రపంచం మీద ధ్యాస ఉండదనిపించింది. కానీ ఆ మధ్య ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జగన్‌గారు దమ్మున్న మగాడు’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌ని ఫాలో అవుతారా?
నిజమే. నేను రాజకీయాలకు దూరం. కానీ, రాజశేఖర్ రెడ్డిగారంటే అభిమానం. ఎలాగంటే ఓ సామాన్య పౌరుడిగా. నాలాగే కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఆయన్ను అభిమా నించేవారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి దమ్ము, లవ్ అండ్ ఎఫెక్షన్, టాలెంట్, పవర్.. ఇలా అన్నీ జగన్‌లో నేను చూశాను. ‘హీ ఈజ్ ఎ ఫైటర్’. ముందు జగన్‌ని ఓ ముఖ్యమంత్రి కొడుకుగానే చూశాను. ఆ తర్వాత ఆయనలో నాకో రియల్ హీరో కనిపించాడు.
నాలా స్ట్రగుల్ అయి, పైకి వచ్చినవాళ్లందరికీ ఆయన హీరోలానే కనిపిస్తారు. ఆయనపై పెట్టిన కేసులు కానివ్వండి, ఆయన్ని ఇరికించిన విధానం.. వాటిని ఎదుర్కొంటున్న తీరు.. ఇవి చాలు ఆయన్ను దమ్మున్నోడు అనడానికి. నేను ఆయన్ను చూడటం మొదలుపెట్టినప్పుడు జగన్‌కి 34–35 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పటినుంచి వ్యక్తిగా రోజురోజుకీ స్ట్రాంగ్ అవుతూ అన్నింటినీ ఎదుర్కొనే విధానం నాకు బాగా నచ్చింది. అందుకని నేను జగన్ దమ్మున్నోడు అన్నాను. ఆయనలాంటి వాళ్లు రావాలి.
ఎందుకు రావాలి? అంటే మీరు చెప్పే సమాధానం?
జగన్‌గారు యంగర్ జనరేషన్. హైలీ ఎడ్యుకేటెడ్. మాట తప్పని మనిషి. తండ్రికి తగ్గ తనయుడు. అద్భుతమైన వ్యక్తి. ఆయన సీఎం అయితే ఎలా ఉంటాడన్నది నాకున్న పరిజ్ఞానం, అనుభవం, జ్ఞానం మేరకు ఆయన అద్భుతం అని నేను అనుకుంటున్నా. గత డిసెంబరులో నా సినిమా విడుదలయ్యాక రెండు నెలలు నేను ఫ్రీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే 40 ఏళ్ల తర్వాత నాకు ఓ హాలిడే దొరికింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో నేను చాలా ప్లేసులకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా ‘జగన్‌గారంటే అభిమానం’ అన్నారు. ‘ఒక్కసారి ఆయనకి అవకాశం ఇద్దామనుకుంటున్నాం’ అని ఎంతోమంది నాతో చెప్పారు. వాళ్లే కాదు.. నాతో సహా ఆయనకు ఒక్క అవకాశం ఎందుకు ఇద్దామనుకుంటున్నామంటే.. ఆయన ఆరోజు ఎలా ఉన్నారో ఈరోజూ అలాగే ఉన్నారు.
ఆయన ఆ రోజు ఏం మాట్లాడారో ఇప్పుడూ అదే మాట్లాడుతున్నారు. వైఎస్‌గారి మరణానంతరం ‘ఓదార్పు యాత్ర’ అనే ఓ కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత దాన్ని కొంతవరకూ పరిమితం చేయమన్నప్పుడు.. నేను చేయను అని వచ్చేసినప్పటి నుంచి నేను జగన్‌ని ఫాలో అవుతున్నా. నేను తిరిగిన మా ఊర్లు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం, పాలకొల్లు ప్రాంతాల వాళ్లు చెబుతుంటే నేను కూడా వారిలాగా ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టా. జగన్ వస్తే ఓ మార్పు వస్తుంది. కొత్త జనరేషన్, కొత్త ఐడియాలజీ ఇవి మాత్రమే కాకుండా.. ఆయనకు ఉన్న పవర్, ఎడ్యుకేషన్ చూసి ఒక గొప్ప వ్యక్తి రావాలి అనిపించింది.
‘జగన్ ఈజ్ ఫైటర్’ అనటం వల్ల ఇండస్ట్రీలో మీకు కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉందా? మీకు అవకాశాలు తగ్గుతాయనుకోవచ్చా?
మా సినిమా ఇండస్ట్రీకి, పాలిటిక్స్‌కి సంబంధం లేదు. టాలెంట్‌ని మాత్రమే పట్టించుకుంటుంది. అయినా ‘జగన్ ఈజ్ ఎ ఫైటర్’ అన్నానని నా గురించి ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ నేను నమ్ముతున్నా. ఆయన ఎక్స్‌ట్రార్డినరీగా పని చేస్తారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రావాలని కోరుకుంటున్నాను. నేనే కాదు.. చాలామంది మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జగన్‌వల్లే సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను.
జగన్‌గారిలో మీకు నచ్చిన విషయాలేంటి?
మా నాన్నగారు ప్రవేశపెట్టిన 108, 104 సరిగ్గా నడవటం లేదు.. దాన్ని నేను సరిగ్గా గాడిలో పెడతా అన్నారు జగన్. అలాగే ఆరోగ్యశ్రీ. ఈ విషయంలో నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మా ఊరు రామచంద్రాపురంలో వైఎస్‌గారి ఆరోగ్యశ్రీ వల్ల ఓ వ్యక్తికి ఓపెన్‌హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రతినెలా కొన్ని మందులు అతనికి అందేవి. వైఎస్‌గారు చనిపోయిన తర్వాత, ప్రభుత్వం మారాక ఆ మందులు ఆయనకు అందలేదు. ఇలా ఎన్నో ఫ్యామిలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకు ఆయన రావాలి అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ వైఎస్‌గారు ప్రవేశపెట్టారు కాబట్టి, జగన్‌గారు వస్తే మళ్లీ పక్కాగా అమలవుతాయన్నది నా నమ్మకం. అలాంటి పేదవాళ్లందరికీ హెల్ప్ చేయడానికి జగన్ రావాలి.
ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు వస్తున్నారు. వారసత్వ రాజకీయాల గురించి మీరేం చెబుతారు?
తప్పేంటి? ఇందిరా గాంధీ మరణం తర్వాత పైలెట్‌గా ఉన్న రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ప్రధానిని చేశారు.. ఆయన వారసుడు కాదా? మా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వారసులు వస్తున్నారు. అయితే టాలెంట్ ఉన్నవాళ్లే సూపర్‌స్టార్స్ అయ్యారు. రాజకీయాల్లో, సినిమాల్లో వారసత్వం అన్నది ఉన్నా నిరూపించుకోవడం అనేది ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. జగన్.. వైఎస్‌గారి అబ్బాయి అని కాదు. ఆయనలోని క్వాలిటీస్ మనం చూడాలి కదా? రాజకీయాల్లో వారసులు లేరా? వారందరి పేర్లు చెబితే స్పేస్ వృథా అవుతుందని చెప్పడం లేదు. ఈ రెండు మూడు నెలల్లో నేను తిరిగిన ప్రాంతాల్లో జగన్ గురించి నేనేం ఫీలవుతున్నానో చాలా మంది అలానే ఫీలవుతున్నారు.
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ఓ రాజకీయ పార్టీకి ఫేవర్‌గా ఉండేదని చెప్పుకునేవారు. ఇప్పుడు కొంతమంది మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎందుకు డీవియేట్ అవుతున్నారు?
నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒకటే. రాజకీయాల విషయానికొస్తే మాత్రం ఎవరి ఇష్టం వారిది. మా గురువు దాసరిగారి విగ్రహాన్ని పాలకొల్లులో ఏర్పాటు చేసినప్పుడు వెళ్లాను. ఓ రోజంతా అక్కడే తిరిగా. వారందర్నీ జగన్ గురించి అడగలేదు. ఎన్నికలొస్తున్నాయి కదా ఎవరికి ఓటు వేస్తారని అడిగితే.. నాకు తెలిసి 80 శాతం మంది జగన్ పేరు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారో అదే మా ఫిల్మ్ ఇండస్ట్రీవారు కూడా కోరుకుని ఆయన పార్టీలో చేరారనుకుంటున్నా.
జగన్‌గారు వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా? ఏపీలో ఇంకా అభివృద్ధి చూడొచ్చనుకుంటున్నారా?
సినిమా పరిశ్రమకు రాజశేఖర్ రెడ్డిగారు చాలా చాలా చేశారని నాకు తెలుసు. జగన్ కూడా అంతే. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి. కచ్చితంగా వైజాగ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు? చేస్తారేమో? దానికంటే ముందు ఆయనకు ఎన్నో ఆలోచనలున్నాయి. వాటి ముందు మా ఇండస్ట్రీ విషయాన్ని రుద్దడం అవసరం లేదేమో అనిపిస్తోంది. ఇక్కడ కేసీఆర్‌గారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు.
జగన్‌గారిని పర్సనల్‌గా ఎన్నిసార్లు కలిశారు?
జగన్‌గారిని చాలాసార్లు పేపర్లో, టీవీల్లో చూశా. ఒకే ఒక్కసారి పాదయాత్రలో కలిశాను. ఆయనతో కలిసి ఐదుగంటలు పాదయాత్ర చేశా. ఓ పొలంలో కూలీ వాళ్లు పనులు చేసుకుంటున్నారు. జగన్ వస్తున్నారని వాళ్లకి ముందే తెలిసి ఉంటుంది కదా. ఆయన రాగానే పనులు మానుకుని పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనతో కరచాలనం చేస్తూ మాట్లాడారు. అప్పుడు నేను ఆయన పక్కనే ఉండి గమనించాను. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన జగన్ వారితో ఎలా ఇంట్రాక్ట్ అవుతారా? ఏంటా? అని. వాళ్ల చేతులకి మట్టి ఉన్నా షేక్ హ్యాండ్ ఇచ్చారాయన. ఓ ముసలావిడ వచ్చి గట్టిగా పట్టుకుంటే ఆమె నుదటిపై ముద్దు పెట్టారు. ఇలాంటి దృశ్యాలు కంటిన్యూస్‌గా ఐదు గంటలు చూశా. నేను నడిచిన ఐదు గంటల్లో ఆయనతో మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలే. నడిచినంత సేపు కూడా ఎక్కడా ఆయన మంచినీళ్లు తాగడం చూడలేదు. ఆయన భోజనం చేయడానికి క్యార్‌వాన్ వద్దకు వెళుతున్నప్పుడు కూడా చుట్టూ ఓ 500 మంది ఉన్నారు.
ఎక్కడా విసుగు చెందకుండా వారిని ఆప్యాయంగా పలకరించారు. రాజశేఖర్ రెడ్డిగారు పాదయాత్ర చేసినప్పుడు టీవీల్లో చూశానే కానీ లైవ్‌లో చూడలేదు. వైఎస్‌గారు సీఎం అవకముందే జగన్‌గారు వ్యాపారవేత్త. అంచలంచెలుగా ఆయన ఎదిగారు. ఎంపీగా 5లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో నెగ్గిన వ్యక్తి ఆయన. ప్రపంచంలో అతి తక్కువమందికి సీటు దొరికే లండన్‌లోని ఓ కాలేజీలో వాళ్ల పాప చదువుకుంటోంది. ఆయన ఏజ్‌కి, డబ్బుకి హ్యాపీగా అక్కడికి వెళ్లిపోయి లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకండీ.. ఎవరో బురద చేతులతో మజ్జిగ అన్నం పెడుతున్నా సంతోషంగా తింటున్నారు? అది నేను ఒక్క ఎమ్జీఆర్ (దివంగత తమిళ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)లోనే చూశా. మళ్లీ ఇప్పుడు జగన్‌లోనే చూశా. ఆయనకి ఏం అవసరం అంటే అదొక కమిట్‌మెంట్.
నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంతమంది హఠాన్మరణం పొందారే, వారికి మేమున్నాం అంటూ భరోసా ఇవ్వడానికి ‘ఓదార్పు యాత్ర’ చేపట్టారు. పాదయాత్రలో అంత స్పీడుగా నడుస్తున్నా ఓ జెన్యూన్ సమస్యను పూర్తిగా విన్నారు. ఆ సమస్య తాలూకు పేపర్‌ని ఓ వ్యక్తి ఇస్తే తీసుకుని లంచ్ టైమ్‌లో దీని గురించి మాట్లాడాలి అన్నారు. ఆయన పాదయాత్ర చేస్తారా? సమస్యలు వింటారా? పేపర్లు తీసుకుంటారా? ఈసారి జగన్ సీఎం అయితే 100 శాతం రాబోయే కాలంలో ఇంకో వ్యక్తి రాలేడు. అంతటి అనుభవం ఆయనకి ఉంది. ఆయన నడిచిన నడకలో కొన్ని లక్షలకోట్ల ఫ్యామిలీలు వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పాయి. నాయకుడు అనేవాడు హృదయంతో స్పందించాలి. ఆ స్పందన జగన్‌లో చూశా. అందుకే జగన్ అంటే ఇష్టం.
ఫైనల్లీ... మీరు భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తున్నారా?
అందరూ డైరెక్షన్ ఎప్పుడు అని అడుగుతుంటారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అని అడుగుతున్నారు. డైరెక్షన్, రాజకీయాలు అన్నవి వెరీ టఫ్, చాలా కమిట్‌మెంట్‌తో ఉండాలి. జగన్‌లా నడవలేను.. ఎవరైనా ఏ చేత్తో పడితే ఆ చేత్తో పెడితే తినలేను. అందుకని.. ఎవరు చేయాల్సిన పనుల్లో వాళ్లు ఉండాలి. జగన్ అలానే ఉండాలి.. ఇండస్ట్రీలోని దర్శకులు అలానే ఉండాలి.. నేను కెమెరామేన్‌గా ఇలానే ఉండాలి.
డి.జి. భవాని
మీకు సినీరంగంలో అవకాశం ఇచ్చిన దాసరిగారు మీ గురువు. చిరంజీవి గారితో ఎక్కువగా ట్రావెల్ చేశారు. మీతో మంచి అనుబంధం ఉన్న పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టారు. మరి ఆయనకు సపోర్ట్ ఇవ్వకుండా జగన్‌గారికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు?
గురువుగారు (దాసరి) నన్ను కెమెరామేన్‌గా పరిచయం చేసినా, నా బిగినింగ్ డేస్‌లో రామానాయుడుగారు ఓ తండ్రిలాగా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన బ్యానర్‌లో వరుసగా 9 సినిమాలు చేసే అవకాశమిచ్చారు. కేఎస్ రామారావుగారు కూడా నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడే నన్ను కెమెరామేన్‌గా చేయమని చెప్పేవారు. సినిమాల వరకూ రామానాయుడుగారు నాకు దేవుడు, తండ్రిలాంటివారు. ఆయన బ్యానర్‌లో ఏ సినిమా మొదలెట్టినా ‘ఛోటా ఉన్నాడా? లేకపోతేనే వేరే కెమెరామేన్‌కి వెళ్లండి?’ అనేవారు. దాసరి, రామానాయుడు, దేవీవరప్రసాద్ అశ్వనీదత్, కేయస్ రామారావుగార్లు నన్ను ప్రోత్సహించారు.
ఇక్కడ నా ఎదుగుదలకు అన్ని సామాజిక వర్గాలు సహకరించాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను చాలా రఫ్‌గా ఉండేవాడిని. నన్ను ఓ కైండ్‌హార్టెడ్‌గా మార్చింది చిరంజీవిగారు. కల్యాణ్ (పవన్ కల్యాణ్) నాకు బ్లడ్ బ్రదర్‌లాంటివాడు. అతను గొప్ప వ్యక్తి. అతని ఆలోచనా విధానం, మాట్లాడే విధానం వేరే. పక్క వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినా అయ్యో అని ఫీలయిపోతాడు. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ సిద్ధాంతాలు ఇంకో రకంగా ఉన్నాయి. రాజకీయపరంగా మాత్రం జగన్ అంటేనే ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment