క్రైస్తవం సంస్కరణోద్యమం!! | Christian reform movement | Sakshi
Sakshi News home page

క్రైస్తవం సంస్కరణోద్యమం!!

Published Sun, Nov 5 2017 12:11 AM | Last Updated on Sun, Nov 5 2017 12:11 AM

Christian reform movement - Sakshi

చప్పదనం, చీకటి క్రైస్తవంలో, విశ్వాసుల్లో ఉండేందుకు వీల్లేదు. ఎందుకంటే మీరు లోకానికి ఉప్పు, వెలుగు వంటివారని యేసు ప్రభువు ప్రకటించారు (మత్తయి 5:13–16). ఉప్పుకు, వెలుగుకు ఉన్న ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే, వాటి ధర్మాన్ని, బాధ్యతను ఎంతో మౌనంగా అవి చేసుకు పోతాయి. ఎన్ని అడ్డంకులొచ్చినా అవి లోకాన్ని రుచిమయం, వెలుగుమయం చేయకుండా మానవు. క్రైస్తవం కేవలం ప్రసంగాలు, రచనలు, పాటలు, ఉపవాస ప్రార్థనలు, చర్చిల నిర్మాణం కాదు. క్రైస్తవం ఒక మహాసంస్కరణోద్యమం. అది తనను తాను నిరంతరం సంస్కరించుకుంటూ, సమాజ సంస్కరణ, సమాజ కల్యాణానికి పాటు పడుతూ ఉంటుంది. క్రైస్తవంలో చీకటి కోణాలకు, మోసాలకు, అపవిత్రతకు ఏమాత్రం తావులేదు. క్రైస్తవులను లోకం కోటి కళ్లతో నిశితంగా చూస్తుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. క్రైస్తవం ద్వారా లాభపడిన ప్రతిసారీ లోకం క్రైస్తవాన్ని కళ్లకద్దుకుంది. కాని క్రైస్తవం పేరిట ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసినప్పుడు కూడా ఎవరూ మాట్లాడకూడదు, అడ్డురావద్దు అనుకోవడం ఆత్మవంచనే కాదు అనాగరికం కూడా. తప్పులెత్తి చూపిన వారు విలన్లని అనుకోకుండా, మన తప్పులు మనం సవరించుకుని, మరింత శక్తితో ముందుకు సాగితే అదెంత ఆశీర్వాదకరం, దేవునికి అదెంత మహిమకరం? పూర్వం పదోతరగతి ఫెయిలయిన వాడికి ఏదైనా వృత్తివిద్యా కోర్సు నేర్పించి, ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేర్చేవారు.

ఇప్పుడు అలాంటి వారి చేతికొక బైబిలిచ్చి ‘సేవ చే సుకో, లోకాన్ని దున్నుకో’ అని చెబుతున్నారంటే మన పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవమంటే కర్ణభేరిని పగలగొట్టి ముక్కలు చేసే లౌడ్‌ స్పీకర్ల నుండి వెలువడే అరుపులు, కేకలు, పాటలు, డప్పువాయిద్యాలనుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. క్రైస్తవం 4,500 ఏళ్ల ప్రాచీన మతం. లౌడ్‌ స్పీకర్లను కనుక్కుని వందేళ్లు కూడా కాలేదు. అలాటి లౌడ్‌స్పీకర్లు క్రైస్తవానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లు ఎలా అవుతాయి? అంటే స్వస్థతల్ని, దేవుని అద్భుతాల్ని నేను విశ్వసించనని కాదు. దేవుని శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నేను, ఆరోగ్యపరంగా చాలా బలహీనుణ్ణి. రాత్రి పడుకున్నాక మర్నాడు ఉదయాన్ని నేను సజీవంగా చూసిన ప్రతిసారీ అదొక దేవుని అద్భుతమని, దేవుడిచ్చిన స్వస్థత అని, నమ్మి, తల వంచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. కాని వాటిని అడ్డుపెట్టుకుని పేరు, డబ్బు సంపాదించుకునే వారిని, అమాయకులను దేవుని శక్తి ప్రదర్శన పేరిట మోసం చేసేవారిని తప్పక ఖండిస్తాను. మారమని వారికి చెబుతున్నా కూడా! యేసు వస్త్రపు చెంగు పట్టుకుని, అపొస్తలుల వస్త్రాలు, నీడ తాకి ప్రజలు బాగయ్యారు కదా! అంటారేమో!! నిజమే, కాని వారి వస్త్రాలను అపొస్తలులు అంగట్లో పెట్టి అమ్మ లేదు కదా! సమర్థించుకోవడానికి, మారకుండా ఉండేందుకు వెయ్యి కారణాలు ఉండొచ్చు. కాని సంస్కరించుకోవడానికున్న ఒక చిన్న కారణం చాలు మనం లోకానికి ఆశీర్వాదకరంగా మారడానికి.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement