సాక్షి, సిటీబ్యూరో: ఆ యువతిది రష్యా. మాస్కోలో బాలీవుడ్ డ్యాన్స్ చూసి ముచ్చట పడింది. భారతీయ సంప్రదాయ నృత్యాల గురించి తెలుసుకుంది. కథక్ నాట్యం పట్ల ఆకర్షితురాలైంది. జీవితాంతం కథక్ నృత్య కళాకారిణిగానే కొనసాగాలని నిశ్చయించుకుంది. 9 ఏళ్ల శిక్షణ తర్వాత తొలిసారిగా సోలో ప్రదర్శన ఇవ్వడానికి తాను నృత్యం నేర్చుకున్న హైదరాబాద్‌నగరానికి ఇటీవల వచ్చింది. ఆమె కథక్ నృత్యకారిణి కేథరిన్ క్రివెంకో. తొలి నాట్య ప్రదర్శన అనంతరం తన అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకుంది.
భారతీయ వంటలు నేర్చుకున్నా..
ఇండియాకు రాకముందు నాకు ఇంగ్లిష్ సరిగా రాదు. కొన్ని హిందీ పదాలు తప్ప ఎక్కువగా తెలియదు. ఇండియా వంటలు వండటం నేర్చుకున్నాను. పాలకూర పప్పు, పన్నీర్, ఎగ్ కర్రీ, బటర్ చికెన్, మేథీ చికెన్ నేర్చుకున్నాను. 2015లో త్యాగరాజ సంగీత కాలేజ్‌లో హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నాను. విజయ్ మరార్ వీడియోల్లో పనిచేశాను. తెలంగాణ బతుకమ్మ వీడియోలో ఫ్రెండ్స్‌తో కలిసి కనిపిస్తాను.
హైదరాబాద్.. సెల్ఫ్ సఫీషియెంట్..
ఇండియాలో అన్ని ప్రదేశాల కంటే హైదరాబాద్ అంటే ఇష్టం. ఇది నా హోం. ఈ సిటీ ఎందుకు ఇష్టమంటే.. ఇక్కడ ఏం తినాలన్నా లభిస్తుంది. మొఘలాయి, ఆంధ్రా, ఇటాలియన్, చైనీస్, జపనీస్ ఇలా అన్ని క్విజైన్ ఫుడ్స్ లభిస్తాయి. ఇక్కడ అనేక సంస్కృతులు ఉన్నాయి. సంప్రదాయ బద్ధమైన లైఫ్‌కి అవకాశం ఉంది. ఇక్కడ బస్సు, మెట్రో, ఆటోలో కూడా సులభంగా వెళ్లగలం. హైదరాబాద్‌లో భద్రత విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. నా వరకు హైదరాబాద్ బ్యూటీ సిటీ.
రష్యన్స్ లైక్ లామకాన్..
కథక్ శిక్షణ పూర్తయిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇండియాకు వచ్చి వెళ్లేదాన్ని. స్నేహితులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. డిసెంబర్ 13న నా మొదటి సోలో ప్రదర్శన ఇచ్చాను. కళలకు, కళాకారులకు ఎంతో విలువనిచ్చే లామకాన్‌లోనే నా మొదటి సోలో ప్రదర్శన ఇవ్వటం నాకు ఎనలేని సంతోషాన్నిచ్చింది.
బాలీవుడ్ డ్యాన్స్ బాగా పాపులర్..
కలర్‌ఫుల్ దుస్తులు, జాయ్‌ఫుల్‌గా ఉండటం వల్ల రష్యాలో బాలీవుడ్ డ్యాన్స్ చాలా పాపులర్. మా దేశంలో చాలా చోట్ల బాలీవుడ్ డ్యాన్స్ నేర్పించే సెంటర్లు ఉన్నాయి. 2010లో మాస్కోలోని ఓ స్కూల్‌లో బాలీవుడ్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లాను. అప్పుడు నాకు ఇండియాలో క్లాసికల్ డ్యాన్సులున్నాయనే సంగతి తెలియదు. అక్కడ బేసిక్ కథక్ స్టెప్స్‌నేర్పించారు. 10– 15 నిమిషాలు కథక్ డ్యాన్స్ చూపించారు. నాకు చాలా నచ్చింది. అప్పుడు ఫ్రెండ్ ఇండియన్ అంబసీలో కథక్ నేర్పిస్తున్న సంగతి చెప్పింది. అలా కథక్ నాట్య గురువు రాఘవ్‌రాజ్ భట్ వద్ద ఏడాది పాటు కథక్ నృత్యంలో శిక్షణ పొందాను. తర్వాత ఆయన స్కాలర్‌షిప్ అప్‌లై చేసి ఇండియాలో కథక్ నేర్చుకోమ్మని సూచించారు. స్కాలర్‌షిప్‌తో ఇండియాకు వచ్చి ఆకృతి కథక్ కేంద్రంలో మంగళా భట్ వద్ద 2013– 16 వరకు కథక్ నేర్చుకున్నాను.
బాలీవుడ్ సినిమాలు చూసేదాన్ని..
చిన్నప్పటి నుంచే నేను బాలీవుడ్ చిత్రాలు చూసేదాన్ని. అలా హిందీ భాష తెలుసు. కుచ్ కుచ్ హోతా హై, రబ్ దే బనాది జోడీ, దిల్ తో పాగల్ హై, దిల్, ఖయామత్ సే ఖయామత్ తక్ నా ఫేవరెట్ చిత్రాలు. మా అమ్మ హిందీ చిత్రాల వీడియో క్యాసెట్లు తీసుకువచ్చేది. రష్యాలో చాలా మంది బాలీవుడ్ చిత్రాలు చూస్తారు.
ఇండియాకు వచ్చిన తర్వాతే..
ఇండియన్ డ్యాన్స్ అంటే బాలీవుడ్ డ్యాన్స్ అని అనుకునేదాన్ని.బాలీవుడ్ నృత్యాల్లో కథక్, కూచిపూడి, బాంగ్డా కలిపి ఉంటాయని తెలియదు. ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ నృత్యాల గురించి తెలిసింది. బాలీవుడ్ డాన్స్‌తో పాటు భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహిని అట్టం కూడా ఇప్పుడు రష్యాలో విరివిగా నేర్చుకుంటున్నారు. ఇండియన్స్, ఇండియా నుంచి నేర్చుకుని వెళ్లిన వాళ్లు
ఈ నృత్యాలు నేర్పిస్తుంటారు.
25 మందికి శిక్షణ ఇస్తున్నా..
ఎప్పటికీ కథక్ నృత్యం చేస్తుండాలని, శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు నా వద్ద శిక్షణ పొందుతున్నారు. కథక్ సరదాగా నేర్చుకునే నృత్యం కాదు. ఈ నృత్యానికి ఆసక్తి, డిసిప్లిన్, శ్రద్ధ లేకపోతే కష్టం. నా దగ్గర కథక్ నేర్చుకుంటున్న వాళ్లలో 19 నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment