తల్లి కూచిపూడి నాట్యకారిణి.. తండ్రి గాయకుడు. తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్న వారి బిడ్డ శ్రవ్య మానస భోగిరెడ్డి 9 ఏళ్ల ప్రాయంలో కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు నడుంబిగించింది. నాలుగేళల్లో నాట్యంలో చక్కటి ప్రావీణ్యం సాధించి తనను తాను నిరూపించుకునేందుకు ప్రదర్శనలు ఇచ్చింది. ప్రతి వేదికపైనా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ పక్క నాట్యంలో నాట్యంలో పీహెచ్‌డీ చేస్తూనే.. సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై యువతను చైతన్యం చేసేందుకు స్వయంగా నాటికలు రాసి నటిస్తోంది. మరోపక్క శ్రావ్య మానస నాట్య గురువుగానూ ఇప్పుడు వందల మందికి శిక్షణనిస్తోంది.
సాక్షి,సిటీబ్యూరో: మోతీనగర్‌కు చెందిన భోగిరెడ్డి శ్రీనివాస్, లలిత దంపతుల కుమార్తె శ్రవ్యమానస మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ, ఎంటెక్ పూర్తి చేసింది. అయితే, ఆమె చిన్నప్పటి నుంచి నాట్యంపై అమితాశక్తి ఉండడంతో అటువైపు అడుగులు వేసింది. ప్రస్తుతం హెచ్‌సీయూలో ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్.శివరాజు పర్యవేక్షణలో డ్యాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న సమయంలోనే వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేస్తుండేది. అలా 4వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ వార్షికోత్సవంలో చేసిన డ్యాన్స్‌కు తొలిసారి బహుమతి అందుకోవడంతో డ్యాన్స్‌పై ప్రేమను పెంచుకుంది. ‘సుమధుర ఆర్ట్స్ అకాడమీ’ని స్థాపించి తను ప్రదర్శనలు ఇస్తూ.. మరో 200 మందికి నాట్యంలో శిక్షణనిస్తోంది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందింది.
మలేసియా, దుబాయ్‌లోనూ..
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆహ్వానం మేరకు కృష్ణా, గోదావరి పుష్కరాలకు శ్రవ్యమానస తన బృందంతో పుష్కరాల విశిష్టతను చెబుతూ కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. చిదంబరం, ఒడిశా, ఢిల్లీల్లో జరిగిన ఉత్సవాల్లోనూ తన నాట్యంతో మెప్పించింది. మలేసియాలో జరిగిన దసరా సంబరాలు, అబుదాబిలో ఉగాది, శ్రీరామనవమి వేడుకల్లో తన నాట్యంతో ఆ దేశాల్లోని తెలుగువారిని మంత్రముగ్ధులను చేసింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటూ శ్రావ్య పలు నాటికలను స్వయంగా రూపొందించి çప్రదర్శనలు ఇస్తోంది. ఇటీవల రవీంద్రభారతిలో ‘నిర్భయ’, యాసిడ్ విక్టమ్ లక్ష్మి అగర్వాల్ పడిన వేదనను శ్రావ్య నటలో చూపిన తీరు ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. కేవలం స్త్రీ పాత్రల కాదు.. ‘శ్రీరాముడు, శివుడు, రావణుడు, మహావిష్ణు, శ్రీకృష్ణుడు’ తదితర పురుష పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయింది. శ్రావ్య మానస తన నటన, నాట్యంతో ప్రతి వేదికపైనా సత్కారాలు, పురస్కారాలు సైతం అందుకుంది.
మొదట్లో లైట్ తీసుకున్నా
కూచిపూడి నాట్యాన్ని తొలుత సీరియస్‌గా తీసుకోలేదు.. అయితే ప్రదర్శనలు ఇచ్చేకొద్దీ వచ్చిన ప్రశంసలతో పట్టుదల పెరిగి ఇష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడే నేనే గురువుగా వందల మందికి నాట్యం నేర్పుతున్నాను. నా శిష్యులు కూడా ఎంతో పట్టుదలగా నాట్యం నేర్చుకుంటుండడంతో ఈ రంగంపై భక్తిభావం పెరిగింది. – శ్రవ్యమానస భోగిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment