సమాజానికి ఓ స్వరం
ఒక్కరే పోరాడితే పని జరగడం లేదనుకొన్నప్పుడు సమూహంగా, సామాజిక సంబం ధాల నెట్‌వర్క్‌ను ఆసరాగా చేసుకొని పోరాడడం ఫలితాలిస్తోంది.
ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని ఒక కుగ్రామం పెద మిడిసెలేరుకు చెందిన వ్యక్తి సాగర్. ఎక్కడో అడవుల మధ్యనున్న వాళ్ల పల్లెలోకి బస్ సౌకర్యం లేదు. ‘అంత మారుమూల పల్లెలోకి బస్సులను పంపలేం’ అనేది ఆర్టీసీ అధికారుల అభిప్రాయం. మరి ఆ మారుమూల పల్లెలోకి బస్సే రాలేనప్పుడు, అక్కడి జనాలు ఎలా బయటకు వస్తారు? భద్రాచలం టౌన్‌లో చదువుకొంటున్న సాగర్ తమ ఊరికి బస్సులేని విషయాన్ని ‘సిటిజన్ జర్నలిస్ట్ నెట్ స్వర’ (సిజీనెట్ స్వర)లో పోస్టు చేశాడు. అంతే! కొన్ని రోజులకే పెద్దమిడిసెలేరుకు బస్సు వచ్చింది! అది సీజీనెట్ స్వర పుణ్యమే!
సీజీనెట్ స్వర ఏం చేసిందంటే...
ఇదొక సోషల్‌నెట్ వర్కింగ్‌సైట్. దీనిలో సభ్యులు అంతా సామాజిక బాధ్యత ఉన్న యువతీ యువకులు. ఇక్కడ ఏదైనా ఒక సామాజిక సమస్య గురించి పోస్టు చేస్తే... దాని పరిష్కారం గురించి ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. సాగర్ వాళ్ల ఊరికి సంబంధించిన సమస్య గురించి అక్కడ పోస్టు చేయగానే అనేక మంది ఆర్టీసీ అధికారుల ఫోన్ నంబర్‌లు తెలుసుకొని సమస్య గురించి వివరించారు. ఆ పల్లెటూరి గురించి వివరించారు. ఒకటి కాదు అలా వందల కొద్దీ ఫోన్‌కాల్స్ వచ్చేసరికి అధికారుల్లో కదలిక. ఆ పల్లె ఎక్కడుంది... దానికి బస్సు సౌకర్యం లేదెందుకని అధికారులు విచారించి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇలా సీజీనెట్ స్వర ఒక సమూహంగా సాధించిన విజయాల్లో సాగర్ వాళ్ల ఊరికి బస్సు సౌకర్యం చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రధానంగా గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ విజయాలు ఎన్నో ఉన్నాయి.
ప్రభుత్వంపై ఒత్తిడే పరిష్కారం
ప్రభుత్వంతో పని చేయించుకోవడం గురించి పక్కా వ్యూహాన్ని రచించడమే ఈ వేదిక లక్ష్యం. మనం ఒక సమస్య గురించి పోస్టు చేస్తే.. దానికి అనేక పరిష్కార మార్గాలను వారు సూచిస్తారు. అవసరమైన సందర్భంలో తమ వంతు సహాయం చేస్తారు. ఒక్కరే పోరాడితే పని జరగడం లేదనుకొన్నప్పుడు సమూహంగా, సామాజిక సంబంధాల నెట్‌వర్క్ మాధ్యమంగా పోరాడు తున్నారు. రోడ్లపైకి రానవసరం లేదు, ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. ఫోన్‌ల ద్వారా, మెయిల్స్ ద్వారానే అధికారులపై ఒత్తిడి మొదలవుతోంది. విధి లేక అధికారులు స్పందించాల్సి వస్తోంది. దీంతో ‘సీజీనెట్ స్వర’ సామాన్యుల స్వరాన్ని చాలా గట్టిగా వినిపించే మార్గం అవుతోంది. వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న యువతీ యువకులు ఈ సోషల్ నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నారు. ఇక్కడ వివిధ ప్రాంతాల గురించి వచ్చే సమస్యల జాబితా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. వాటి గురించి మీకున్న అవగాహనతో ఎవరైనా తమకు తోచిన రీతిలో మాట సాయాన్ని చేయవచ్చు. అవసరమైన సందర్భంలో ఫోన్, మెయిల్స్ ద్వారా పోరాటంలోకి దిగవచ్చు.
సంప్రదించడం, సభ్యులవడం ఇలా...
దీని వెబ్ అడ్రస్ జ్ట్టిఞ://ఛిజ్ఛ్టటఠ్చీట్చ.ౌటజ/. ఫోన్ నంబరు +91 80500 68000. ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరిస్తూ రికార్డు చేయవచ్చు. రికార్డ్ అయిన సమస్యల విషయంలో మీ పరిష్కారాన్ని కూడా సూచించవచ్చు.
- జీవన్‌రెడ్డి. బి
ఆవిష్కర్తకు అంతర్జాతీయ గుర్తింపు
‘సీజీనెట్ స్వర’ను రూపొందించిన సుభ్రాంశు చౌధరికి ఇటీవలే ‘డిజిటల్ యాక్టివిజం’లో అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇంటర్నెట్ ద్వారా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇస్తున్న చౌధరికి బ్రిటన్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ అవార్డునిచ్చి సత్కరించింది. సుభ్రాంశు ఇంతకు ముందు బీబీసీ, గార్డియన్ వంటి ప్రసిద్ధ వార్తా సంస్థల్లో పనిచేసిన జర్నలిస్టు.