తలంపులు తీర్చే తల్లి తలుపులమ్మ
అమ్మ తల్లులు - 1
ఆ కొండమీదకు కొన్నాళ్ల కిందట ఒక భక్త బృందం వచ్చిందట. తల్లి దర్శనం అయ్యాక కొండ దిగిందట. అయితే హడావిడిలో ఒక పాపను మర్చిపోయినట్టు గమనించారట. అప్పటికే సాయంత్రమైపోయింది. అప్పట్లో అంతా కీకారణ్యం. తిరిగి పైకి వెళ్లడానికి లేదు... వెళ్లకూడదు. కన్నతల్లి ఏడుస్తుంటే ఎవరో అన్నారట- ‘పిచ్చిదానా... పైన తలుపులమ్మ తల్లి తిరుగుతూనే ఉంటుంది. నీ బిడ్డకు ఏమీ కాదు. తల్లే చూసుకుంటుంది’ అని. తెల్లారాక అందరూ హడావిడిగా పైకి వెళ్లారట. చూస్తే పాప క్షేమంగా కనిపించిందట. తలుపులమ్మ తల్లి మహిమలు ఇలా ఎన్నో.
మనిషికి ఆపదలు తప్పవు. కష్టాలు రాకమానవు. అప్పుడు సాయం కోసం పిలిస్తే పలికే శక్తి కావాలి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒక పన్నెండేళ్ల ఆడపిల్ల వచ్చి ఆ ఆపద తీర్చి వెళ్లేదట. మళ్లీ ఎవరికీ కనిపించేది కాదట. కష్టంలో ఉన్నవారు ఎవరైనా మళ్లీ పిలిస్తే వెంటనే వచ్చేదట. ఆ పాప పేరు ఎవరికీ తెలియదు. ‘తలచిన‘ వెంటనే పలికే తల్లి ‘తలంపు’ వచ్చిన వెంటనే పలికే తల్లి కనుక ఆమె ‘తలంపులమ్మ’ కాలక్రమేణా తలపులమ్మ అయ్యింది.
ఆ ప్రాంతం పేరు లోవ...
రాజమండ్రికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ‘లోవ’. దీనికి పది కిలోమీటర్ల ముందు వచ్చే అందరికీ తెలిసిన ఊరు ‘తుని’. తుని దాపున అడవులు కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం ‘లోయ’ అనేవారని అదే కాలక్రమంలో లోవ అయ్యిందని అంటారు. ఇక్కడ ఉన్న కొండలలోని రెండు కొండలు - ధార కొండ, తీగ కొండల మధ్య తలుపులమ్మ క్షేత్రం ఉంది. ఈ కొండల నడుమే తియ్యని పాతాళ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఇదే భక్తుల దాహార్తి తీరుస్తూ ఉంటుంది.
అగస్త్యుని కోరిక మేరకు....
పూర్వం పర్వతరూపుడైన మేరువు తన ఆకారాన్ని అమాంతం పెంచడం ప్రారంభించాడు. అతడి ఆకారం ఎంతగా పెరిగిందంటే సూర్యుడి రథానికి అడ్డం తగిలే పరిస్థితి వచ్చింది. ఇదే జరిగితే సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల దేవగణాలు మేరువుకు గురుసమానుడైన అగస్త్యుని దగ్గరకు వెళ్లి ఆపదను గట్టెక్కించమన్నారు. అప్పుడు అగస్త్యుడు మేరువు దగ్గరకు రాగా అతడు తల ఒంచి నమస్కరించాడు. అప్పుడు అగస్త్యుడు ‘నేను దక్షిణాది యాత్రకు వెళుతున్నాను.
నేను వచ్చేంత వరకూ ఇలాగే ఉండు’ అని ఆదేశించి దక్షణాది యాత్రకు బయలుదేరాడు. లోవ ప్రాంతం వచ్చేసరికి సంధ్య వార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడా నీటిబొట్టు లేకపోవడంతో అగస్త్యుడు జగన్మాతను ప్రార్థించగా ఈ ప్రాంతంలో పాతాళగంగ ఉద్భవించి అగస్త్యునికి నీటి అవసరం తీర్చింది. ఆ రాత్రి అగస్త్యునికి తల్లి కలలో కనిపించి తాను లలితాంబిక అని, తాను భక్తులను ఆదుకునేందుకు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నానని చెప్పింది. అగస్త్యుడు ఆమెను పూజించి ఎప్పటికీ ఇక్కడే ఉండిపొమ్మని వేడుకున్నాడని కథనం.
ఈ ప్రకారం తల్లి ఇక్కడే ఉండి తలుపులమ్మగా భక్తులను కటాక్షిస్తున్నది. అగస్త్యుడు ఇక్కడి వనాలలో ఫలాలు తిని, తేనెను తాగాడని, అంత తియ్యగా ఇక్కడి నీళ్లు కూడా ఉండాలని కోరడంతో పాతాళ గంగ నీరు తియ్యగా మారాయని అంటారు. కొండలలో ఉన్న ఈ పాతాళ గంగ ఎక్కడ పుట్టిందో ఎక్కడకు ప్రవహించి మాయమవుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
మరో కథనం..
మరో కథనం ప్రకారం తుని సంస్థానం రాజా వారికి అమ్మ కలలో కనిపించి తాను ఈ కొండలలో శిలలా పడి ఉన్నానని, వచ్చి పూజాదికాలు నిర్వహిస్తే ఈ ప్రాంతంలో పాతాళగంగ ఉద్భవిస్తుందని చెప్పిందట. ఆ మేరకు రాజావారు నడుచుకోగా క్షేత్రం స్థిరపడిందని అంటారు. మొత్తం మీద తలుపులమ్మ క్షేత్రానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా భావిస్తున్నారు.
మాంగల్య సౌభాగ్యం కోసం...
తలుపులమ్మ తల్లిని నిత్యం ముత్తయిదువులు పూజించి తమ మాంగల్య సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. ఆ తల్లిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు పదికాలాల పాటు చల్లగా ఉంటాయనే నమ్మకం ఉంది. అలాగే ఇక్కడి రవ్వలడ్డూ, పులిహోర ప్రసాదాలు ఎంతో ప్రసిద్ధం. లోవ దేవస్థానంలో అందించే లడ్డూ, పులిహోర రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించదని భక్తులు అంటారు. ఏటా రూ.కోటి విలువ చేసే ప్రసాద విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడ యాభై అడుగుల అమ్మవారి విగ్రహం, నలభై అడుగుల ఈశ్వరుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.
1981లో విలీనం :
తుని రాజావారీ అధీనంలో నడుస్తున్న దేవస్థానం కార్యకలాపాలను ప్రభుత్వం 1981లో దేవాదాయశాఖకు అప్పగించింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రీజనల్ జాయింట్ కమీషనర్ అజమాయిషీ స్థాయికి చేరింది. ఏటా ఆరులక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.
పర్వదినాలు..
గంధామావాస్య పర్వదినాన్ని పురష్కరించుకుని లోవకొత్తూరు గ్రామంలో దేవస్థానం భూమిలో అమ్మవారి పుట్టింట సంబరాలను 12 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారికి దేవస్థానం ఆవరణలో ఆషాఢమాసోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అమ్మవారి జన్మనక్షత సందర్భంగా పంచామృతాభిషేకాలు, పౌర్ణమి రోజున అమ్మవారికి మహాచండీ హోమం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
- సూర్యనారాయణ, సాక్షి, తుని రూరల్ ప్రతినిధి
మార్గం
లోవ క్షేత్రం అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుని నుంచి తొమ్మిది కిలోమీటర్లు. రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్లు. బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. క్షేత్రానికి మెట్ల మార్గం ఉంది. మెట్లు ఎక్కలేనివారి కోసం రోడ్డు మార్గం వేశారు.
వాహనాలను కాపాడే తల్లి...
తలుపులమ్మ తల్లిని ప్రయాణానికి అధిదేవతగా ఇక్కడివారు భావిస్తారు. ఉత్తరకోస్తాలో ఎవరు ఏ వాహనం, ముఖ్యంగా పెద్ద వాహనం కొన్నా ఇక్కడకు తీసుకు వచ్చి పూజ జరిపిస్తారు. మరికొందరు తమ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లు ఇక్కడి కొండల పై రాయిస్తారు. అందువల్ల ఆ వాహనానికి ప్రమాదం జరగకుండా ఆ తల్లి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందని నమ్మకం. రోజూ ఇక్కడకు అనేక కొత్త వాహనాలు తరలి రావడం భక్తులు చూస్తూనే ఉంటారు.