సాహసం శ్వాసగా సాగిపో..!
నవతరం
‘మా చిన్నప్పుడు ఒక మంచి ఉద్యోగం రావడం కోసం చదివేవాళ్ళం. ఒకసారి ఉద్యోగంలో సెటిలైతే, అందులోనే రిటైర్మెంట్. కానీ, ఈ కాలం పిల్లలు తరచూ ఉద్యోగాలు మారుతూనే ఉన్నారు’ అని నిట్టూర్చే నడి వయసు దాటిన తల్లితండ్రుల్ని తరచూ చూస్తుంటాం. ఉద్యోగాలు తరచూ మారడమే కాదు... అసలు ఉద్యోగాలే వద్దని వ్యాపారాల వైపు మొగ్గుతున్నవారి సంఖ్య కూడా ఇప్పుడు ఎక్కువే. గడచిన తరాలతో పోలిస్తే, ఇవాళ్టి తరంలో రిస్క్ తీసుకోవడమూ ఎక్కువే! ఒక్క ఇండియాలోనే కాదు... చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇంతకీ కొత్త తరం ఇప్పుడు ఎలాంటి జాబ్ కోరుకుంటోంది? ఉద్యోగమా? వ్యాపారమా? లేక మరేదైనానా?
సంప్రదాయ ఉద్యోగాలకు నో!
ఈ విషయమై చైనాలో ఇటీవలే ఒక అధ్యయనం చేశారు. దాన్నిబట్టి తేలిందేమిటంటే, 1995 తరువాత పుట్టినవాళ్ళలో, అంటే 20 ఏళ్ళ లోపు నవ యువతరం పిల్లల్లో నూటికి 48 మంది డిగ్రీ పూర్తయ్యాక సంప్రదాయబద్ధమైన ఉద్యోగాలేవీ చేయడానికి ఇష్టపడడం లేదు. సాంకేతిక దిగ్గజ సంస్థ ‘టెన్‌సెంట్ హోల్డింగ్స్’లో భాగమైన క్యు.క్యు. బ్రౌజర్ వాళ్ళు 13 వేల మందికి పైగా కాలేజ్ స్టూడెంట్స్‌ను సర్వే చేశారు. అలాగే, తమ రోజువారీ ఇంటర్నెట్ సెర్చ్ ట్రాఫిక్ అయిన 8.4 కోట్ల నుంచి సమాచారం తీసుకొన్నారు. ఈ రెంటినీ కలగలిపితే ఈ విషయం స్పష్టమైంది.
అమ్మానాన్నలకు పూర్తి భిన్నం
చైనాలోని నవ తరం పిల్లలు తమ మునుపటి తరం కన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు. మునుపటి తరం కన్నా వీళ్ళకు జీవితం గురించి పెద్ద పెద్ద కలలున్నాయి. విపరీత స్వభావమూ ఎక్కువే. చైనాలో ఈ ఏడాది 75 లక్షల మంది స్కూల్ చదువు ముగించుకొని బయటకు రానున్నారు. ఫ్యాక్టరీలు, భవన నిర్మాణ రంగం, ప్రభుత్వ ఉద్యోగాలకు పరిమితమైన తమ తల్లితండ్రుల కన్నా వీళ్ళు పూర్తి భిన్నమైన దోవలో వెళ్ళనున్నారు.
కోరుకుంటున్న ఉద్యోగాలు ఇవీ...
నూటికి 15 మందికి పైగా తమ సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ పెరుగుతున్న వినియోగతత్త్వం, జనజీవితంలో పెరుగుతున్న నెట్ ప్రభావం నేపథ్యంలో అందుకు తగ్గ కొత్త ఉద్యోగాలు చేయాలని 8 శాతం మంది ఉత్సాహపడుతున్నారు. అత్యధికులు కోరుకుంటున్న ఉద్యోగాలు ఏమిటంటే - ఆన్‌లైన్ లైవ్-స్ట్రీమర్, బ్లాగర్, వాయిస్ యాక్టర్, మేకప్ ఆర్టిస్ట్, గేమ్ టెస్టర్.
పిల్లలు ఇలా నవీన మార్గాల్ని అన్వేషించుకోవడం తల్లితండ్రులకు నచ్చినా, నచ్చకపోయినా ఆర్థికవ్యవస్థకు మంచిదని విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ సాహసిక ప్రవృత్తి మార్కెట్‌కు పనికొస్తుందని వాళ్ళ విశ్లేషణ. ఈసురోమంటూ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా... టెన్ టు ఫైవ్ జాబ్ చేయడం ఇష్టం లేకనే ఈ కొత్త ఉద్యోగాల వైపు మొగ్గుతున్నట్లు నవ తరం పిల్లలు చెబుతున్నారు.
బీజింగ్, షెన్‌ఝెన్ లాంటి మెగా సిటీల్లోని 20 ఏళ్ళ లోపు వాళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్‌తో ముడిపడ్డ వ్యాపారాలకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక, కొందరేమో విద్య, వ్యవసాయ రంగాల్లో అవకాశాలు చూస్తున్నారు. ఆర్థిక, వ్యక్తిగత స్వాతంత్య్రానికి ఔత్సాహిక వ్యాపార రంగాన్ని మించినది లేదనేది వాళ్ళ అభిప్రాయం. మొత్తానికి, ఈ నవ తరం కుర్రాళ్ళను ఒక్క మాటలో ప్రయోగాలు చేసే సాహసికులు అనవచ్చేమో! - మహతి