చల్లని మనసున్న పాట...
ఏక్ థా టైగర్, ఫ్రం సిడ్నీ విత్ లవ్, రాకీ, జంజీర్...మొదలైన సినిమాల్లో పాటలు పాడిన ఇండోర్ అమ్మాయి పాలక్ ముచ్చల్, సామాజికసేవ విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. చిన్న వయసులోనే ఎన్నో పురస్కారాలను అందుకుంది.
పాలక్ ముచ్చల్‌తో మాట్లాడడం అంటే తీయటి పాటల బాలీవుడ్ గాయనితో మాట్లాడడమే కాదు...తన వంతుగా సమాజానికి సేవ చేయాలనుకొనే నవతరం ప్రతినిధితో మాట్లాడినట్లు కూడా. ఇరవై రెండేళ్ల పాలక్ మనసులోని మాటలు...
మా కుటుంబంలో ఎవరికీ పాటలు పాడిన నేపథ్యం లేదు. వ్యాపారం తప్ప మరొకటి తెలియదు. నేను మాత్రం రెండు సంవత్సరాల వయసు నుంచే పాడడం మొదలుపెట్టాను. హార్ట్ పేషెంట్‌ల సహాయార్థం షోలు చేస్తుంటాను. నా ‘షో’ల ద్వారా వచ్చిన డబ్బుతో 530 మంది పేషెంట్లకు సహాయపడ్డాను. మరో 621 మంది నా సహాయం కోసం వేచి చూస్తున్నారు. వారికి తప్పకుండా సహాయం చేస్తాను.
రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు తమ చొక్కాలతో ఫ్లోర్ శుభ్రం చేస్తూ కనిపిస్తారు. వారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. నాకోసం కాకుండా పరుల సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలనేది నా ఆలోచన. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు నా వయసు అయిదు సంవత్సరాలు. సైనికుల కోసం నా వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. వీధిలో ప్రతి దుకాణానికీ వెళ్లి పాటలు పాడి డబ్బులు అడిగేదాన్ని. అలా మా కాలనీలోనే పాతిక వేలు సేకరించాను. ఒడిశాలో తుపాను వచ్చినప్పుడు కూడా వీధి వీధి తిరిగి, పాటలు పాడి డబ్బు సేకరించి సహాయనిధికి పంపాను.
ఇండోర్‌కు చెందిన లోకేశ్ అనే అబ్బాయికి గుండెలో రంధ్రం పడింది. అతని తల్లిదండ్రులేమో బీదవాళ్లు. వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదు. ‘‘నేను వాళ్లకు సహాయపడాలనుకుంటున్నాను’’ అని మా తల్లిదండ్రులకు చెప్పాను. ఒక వీధిలో నా కోసం చిన్న వేదిక ఒకటి ఏర్పాటు చేశారు నాన్న. పేషెంట్‌కు కావల్సిన మొత్తం సమకూర్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుందేమో అనుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే, ఒకే ఒక రోజులో 55,000 వచ్చాయి! ఆ డబ్బు వారికి సరిపోతుంది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఒక పేషెంట్ కోసం, పాటల ద్వారా నేను డబ్బులు సేకరిస్తున్నాననే విషయం తెలిసి బెంగళూరుకు చెందిన ఒక వైద్యుడు ఆపరేషన్ ఉచితంగా చేయడానికి ముందుకువచ్చాడు. ఆ 55, వేలంలో... ఎవరి డబ్బు వారికి తిరిగి ఇచ్చేయాలనుకున్నాం. కానీ అది అసాధ్యం అనే విషయం అర్థమైంది. మంచి మనసుతో దాతలు ఇచ్చిన ఆ సొమ్మును ఆపదలో ఉన్న వారి కోసం ఉపయోగించాం. ఈ మొత్తం వ్యవహారంలో నాకు అర్థమైన విషయం ఏమిటంటే ‘పాట’అనేది నలుగురిని సంతోష పెట్టడానికే కాదు...నలుగురిని ఆదుకోవడానికి కూడా అని!