ఏదీ ఒకసారి దగ్గండి | Cough special story on winter season infections | Sakshi
Sakshi News home page

ఏదీ ఒకసారి దగ్గండి

Published Wed, Nov 9 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

ఏదీ ఒకసారి దగ్గండి

ఏదీ ఒకసారి దగ్గండి

దగ్గు... అనారోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. అన్ని దగ్గులూ ఒకటి కాదు. అది కనిపించే వేళలను బట్టి, అది వచ్చే వయసును బట్టి... దాని తీరును బట్టి సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి దగ్గుకూ ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ కథనం చదివితే అది అర్థమవుతుంది.

ఏదీ ఒకసారి దగ్గండి.. ప్లీజ్
దగ్గు... మన కోసం ప్రకృతి చేసిన ఒక రక్షణ ప్రక్రియ. దగ్గు ఒక వ్యాధి కాదు. అది ఒక లక్షణం మాత్రమే. ఎన్నో రుగ్మతలకు సూచిక. దగ్గు వస్తున్న వారు తమ  అసలు సమస్య గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

దగ్గు అంటే...?
మనం నిత్యం శ్వాస తీసుకుంటూ ఉంటాం. గాలిని మామూలుగా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని సాఫీగా వదిలేస్తాం. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం  ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని ఆ గ్లాటిస్ నుంచి తీవ్ర ఒత్తిడితో  బలంగా నోటి నుంచి ఒక్కసారిగా బయటకు వదిలేసినప్పుడు అది దగ్గు రూపంలో వస్తుంది. అలా గాలిని తెరలు తెరలుగా బలంగా బయటకు వదలడాన్ని దగ్గు అంటారు.

 దగ్గులో రకాలు...
దగ్గుకు అనేక కారణాలుంటాయి. మనకు దగ్గు వచ్చే వేళను బట్టి, తెమడలోని రంగును బట్టి దగ్గులో అనేక రకాలుగా విభజించవచ్చు. అలా వ్యాధిని కూడా కొంతవరకు ముందే అనుమానించి, తగిన నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. సాధరణ పరిభాషలో దగ్గును రెండు రకాలుగా పేర్కొంటారు. దగ్గినప్పుడు తెమడ పడటం, సాధారణ ఉమ్మి కంటే చిక్కగా ఉండే స్రావాలు పడితే దాన్ని తడి దగ్గు అని, అలాంటివేవీ పడకుండా ఉండే దగ్గును పొడి దగ్గు అని అంటారు.

తడి దగ్గు: సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి చోట ఉపరితలాన్ని తడిగా ఉంచేందుకు ఉత్పత్తి అయ్యే స్రావాలు బయటకు రావు. అవి రక్తనాళాల నుంచి గుండెకు చేరి అక్కడి నుంచి శరీరంలోకి ఇంకిపోతాయి (మెటబొలైజ్ అవుతాయి). అయితే ఏదైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి పెరిగి అది దగ్గుతో పాటు బయటకు వస్తే... దాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. తడి దగ్గు వస్తుంటే అది శ్వాసనాళాలో సమస్య (ఎయిర్‌వేస్ ప్రాబ్లమ్)  అంటే ఆస్తమా, సీవోపీడీ, బ్రాంకైటిస్ కావచ్చు. లేదా ఇన్ఫెక్షన్స్ (నిమోనియా, టీబీ కావచ్చు

పొడి దగ్గు: దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. ఇది వస్తుంటే సమస్య ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ) కావచ్చు.

సాధారణంగా ఒక రోగికి వచ్చేది ఏ రకమైన దగ్గు అన్నదాని ఆధారంగానే తొలిదశలో వ్యాధి ఏమిటో అనుమానించడం జరుగుతుంటుంది. నీరు చేరడం (ప్లూరల్).

దగ్గు వచ్చే వ్యవధి (డ్యూరేషన్)ను బట్టి సమస్యలను మూడు రకాలుగా చెప్పవచ్చు. రెండు వారాల లోపు మాత్రమే ఉంటే అక్యూట్ అని, 2 - 8 వారాల పాటు ఉంటే సబ్-అక్యూట్ అని, అంతకంటే దీర్ఘకాలం ఉంటే దాన్ని క్రానిక్ అని పేర్కొంటారు.

రాత్రీ - పగలూ తేడా...
దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కూడా వ్యాధిని అనుమానించవచ్చు. సాధారణంగా అలర్జీ వచ్చే దగ్గు రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది.

నివారణ ఇలా...
మన పరిసరాలను, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం
పొగతాగే దురలవాటును మానేయడం
పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండటం
పడక గదులను దుమ్మూ ధూళీ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, తేమ లేకుండా చూసుకోవడం.
పుస్తకాల అరలను మూసి ఉంచడం
వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే అగర్‌బత్తీలు, సుగంధద్రవ్యాలు (పెర్‌ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

వయసును బట్టీ వర్గీకరణ...
దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని ఊహిస్తారు.
పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్లనేమో అని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్ టాయ్స్‌లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు (ఊల్), పెంపుడు జంతువుల మృదువైన వెంట్రుకలు దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు.

పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే సాధారణ పరిభాషలో ‘కోరింత దగ్గు’ అంటారు. ఇదేగాక మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లా దగ్గురావచ్చు.

పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్‌డీ, ఏఎస్‌డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని సైనోసిస్ అంటారు. ఈ లక్షణం కనిపిస్తే దాన్ని తప్పక గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స చేయాలి.

ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీకి సంబంధించిన ప్రధాన వ్యాధి ఆస్తమాకు ప్రధాన లక్షణమైన పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదట కనిపించే లక్షణం దగ్గే.

దగ్గు వస్తూ ఉంటే ఏం చేయాలి?
రోగి ఆరోగ్య చరిత్ర (హిస్టరీ)ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. రోగికి ఆ లక్షణం ఎందుకు కనిపిస్తుందో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే.

అది తడి దగ్గో, పొడి దగ్గో చూసి అందుకు కారణాలను అనుమానించాలి.  జ్వరం కూడా ఉందా అన్న అంశాన్ని పరిశీలించాలి.

ఎక్స్-రే సహాయంతో ఊపిరితిత్తులు రెండూ స్పష్టం (క్లియర్)గా ఉన్నాయా లేదా చూడాలి. (టీబీ, నిమోనియా, క్యాన్సర్లు వంటి వ్యాధులను దాదాపు 99 శాతం ఎక్స్-రేతో తెలుసుకోవచ్చు).

సీటీ స్కాన్ (ఛాతి) కూడా వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతుంది.

ఒకవేళ దగ్గు - బాక్టీరియా (టీబీ) వల్ల అయితే అందుకోసం కళ్లె పరీక్ష చేసి నిర్ధారణ చేయవచ్చు.  దగ్గు వచ్చే రోగులకు రొటీన్‌గా చేసే రక్తపరీక్ష, షుగర్, ఈసీజీ, టూ డీ ఎకో పరీక్షలు కూడా చేస్తారు. పీఎఫ్‌టీ, తెమడ పరీక్ష వంటివి కూడా చేస్తారు.

పెద్దల్లో కనిపించే దగ్గు..
అలర్జీతో :  పెద్దల్లో కనిపించే తగ్గు ప్రధానంగా అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి.
పొగతాగడం వల్ల : స్మోకర్స్‌లో పొగాకు వినియోగం వల్ల అనేక రసాయనాలు ఊపిరితిత్తులోకి వెళ్తాయి. దీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగు తెమడ కూడా పడుతుంది.

ఇన్ఫెక్షన్లతో : పెద్దల్లో కనిపించే దగ్గు ప్రధానంగా టీబీ వల్ల రావచ్చు. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మందిలో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా కారణాలతో  వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి కనిపిస్తుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు కనిపిస్తుంటుంది. కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బరువు, ఆకలి తగ్గుతుంది. ఈ  లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు తప్పక టీబీ వ్యాధిని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్‌ఐవీ లాంటి ఇంకేదైనా ఇతర ఇన్ఫెక్షన్ కారణమయ్యిందా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఇతరత్రా వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి.

పెద్దల్లో కంటే పిల్లల్లో ఎందుకు ఎక్కువ...?
పెద్దల్లో కంటే పిల్లల్లో దగ్గు ఎక్కువగా కనిపించడం సహజమే. పెద్దల్లోలా పిల్లలు తమలో ఉత్పత్తి అయ్యే తెమడను బయటకు లాగివేయలేరు. అందుకే అది వాళ్ల కడుపులోకి వెళ్తుంది. దాంతో వాంతి అయి అది బయటకు వచ్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు చాలామంది  పిల్లలకు వాంతులు అవుతున్నాయేమో అని అనుమానిస్తారు. కాని వాళ్ల ఊపిరితిత్తుల్లో ఊరే స్రావాలే దీనికి కారణం.

నిమోనియా : దీంతో వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. జ్వరం ఉంటుంది. కొందరిలో ఆయాసం కూడా రావచ్చు.

కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే ఏసీ ఇన్హిబిటార్స్ అనే మందులు (ఉదాహరణకు కార్డేజ్, ఇనామ్, ఇనేస్ వంటివి) వాడుతుంటే కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందుల వాడకాన్ని ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి ప్రత్యామ్నాయ ఔషధాలు వాడాల్సి ఉంటుంది.

గుండె జబ్బులు : హార్ట్ ఫెయిల్యూర్, పడుకుంటే దగ్గు రావడం, ఆయాసం, గుండెదడ, చాతీనొప్పి వంటివి కూడా కనిపించవచ్చు.

 తెమడ రంగును బట్టి...
తడి దగ్గులో వచ్చే తెమడ (కళ్లె) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు.

 తెమడ రంగు...
ఎర్రగా ఉంటే... ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు ఎర్రరంగు కళ్లె పడవచ్చు. అయితే ఇలా ఎర్రరంగు పడ్డప్పుడల్లా అది క్యాన్సర్‌కు సూచన అని అందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలా కనిపించేవాళ్లలోనూ క్యాన్సర్ ఉండేవారి శాతం చాలా తక్కువ.

నల్లగా ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. ఫ్యాక్టరీలకు, గనులకు దగ్గరగా ఉండేవారిలో నల్లరంగు కళ్లె కనిపించవచ్చు.

చికిత్స: ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు తగ్గడానికి చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక ఉపశమనంగా దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. ఒకవేళ సమస్య ముదిరితే అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే దగ్గు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్‌పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

హెల్త్ క్విజ్
1    మూత్రపిండాల్లోని రాళ్లను, ఇలా రాళ్లు ఏర్పడే ప్రక్రియను వైద్య పరిభాషలో ఏమంటారు?
2.  కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చికిత్స ఎలా చేస్తారు?
3.  పైవిధంగా చేసే చికిత్స ప్రక్రియ పేరు ఏమిటి?
4.  రాయిని బ్లాస్ట్ చేసినప్పుడు మూత్రనాళంలో స్టెంట్ ఎందుకు వేస్తారు?
5.  మూత్రపిండాలలో రాళ్లు రాకుండా చూసుకోడానికి చేయాల్సిన అత్యంత ప్రధానమైన నివారణ చర్య ఏమిటి?

జవాబులు :
1.   రీనల్ క్యాల్‌క్యులీ అనీ, నెఫ్రోలిథియాసిస్ అనీ అంటారు.
2.  లేజర్, అల్ట్రాసోనిక్ ప్రక్రియ ద్వారా రాయిని చిన్న చిన్న పలుకులు లేదా పొడి అయిపోయేలా  చేస్తారు.
3.  నాన్ ఇన్‌వేజివ్ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఇఎస్‌డబ్ల్యుల్)
4.  మూత్ర విసర్జన ప్రక్రియలో ఈ రాతి పలుకులు- మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం గోడలకు ఒరుసుకుపోకుండా నివారించాలి కాబట్టి స్టెంట్‌ను వేస్తారు.
5. నీళ్లు ఎక్కువగా తాగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement