ఆ ప్రయోగం వికటించి కరోనా పుట్టుకొచ్చిందట! | COVID 19 Coronavirus Fake News Spread in Social Media | Sakshi
Sakshi News home page

నా చేతుల్ని మిస్‌ అవుతున్నా

Published Fri, Mar 13 2020 10:32 AM | Last Updated on Fri, Mar 13 2020 10:32 AM

COVID 19 Coronavirus Fake News Spread in Social Media - Sakshi

కరోనా ఎంత వేగంగా ప్రబలుతోందో కరోనాపై సోషల్‌ మీడియాలో పుట్టుకొస్తున్న ‘కలుపు’అంతకన్నా వేగంగా పెరిగిపోతోంది. దాంతో.. నమ్మకమైన వార్తల కోసంప్రపంచం ఇప్పుడు ‘సోషల్‌’నిపక్కన పెట్టి తిరిగి సంప్రదాయమీడియాను ఆశ్రయిస్తోంది.

ఈశాన్య దిక్కున విష గాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగా తూగి సచ్చేరయ

బ్రహ్మంగారికి ‘కాలజ్ఞానం’ లోని 114వ పద్యం ఇది. ఈశాన్య దిక్కున అంటే చైనా! కోరంకి అంటే కరోనా!! మూడొందల ఏళ్ల క్రితమే కరోనా గురించి చెప్పిన బ్రహ్మంగారు, ఐదువేల ఏళ్ల వరకు మానవ జాతకం ఎలా ఉండబోతోందో కూడా అప్పుడే అంచనా వేసి చెప్పారు. ఆ చెప్పినవి ‘మ్యాచ్‌’ అయినప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది.

కరోనా డిసెంబర్‌లో మొదలైంది. అప్పట్నుంచీ ఈ పద్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. పద్యంలో బ్రహ్మంగారు వాడిన రెండు మాటలు ‘ఈశాన్యం’, ‘కోరంకి’ కరోనా వైరస్‌కు సరిగ్గా సరిపోయాయి. పద్యంలోనే ‘కోటి మందికి తగిలి’ అని మరో మాట ఉంది. కాలజ్ఞానాన్ని నమ్మేవారిని కలవరపెట్టే మాట ఇది. ఇప్పటికే లక్షమందికి పైగా సోకిన కరోనా.. కోటికి చేరుకోదు కదా! ఆ కోటిమందిలో మనమో, మనవాళ్లో ఉండరు కదా! అదీ అనుమానం.

సోషల్‌ మీడియాను టైమ్‌పాస్‌కు తప్ప వేరే దేనికీ నమ్మని వాళ్లు బ్రహ్మంగారి పద్యాన్ని కూడా నమ్మరు. బ్రహ్మంగారిపై నమ్మకం లేకపోవడం కాదది. సోషల్‌ మీడియాను నమ్మలేకపోవడం. ‘బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’ అని పేపర్‌లు రాస్తే ఉండే నమ్మకం.. అదే వార్త సోషల్‌ మీడియాలో వస్తే ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు పెట్టేయడానికి అనువుగా ‘నెట్‌’ ఉండటంతో ఫేక్‌ న్యూస్‌లు ఎక్కువైపోయి క్రమంగా విశ్వసనీయతను కోల్పోతోంది సోషల్‌ మీడియా. అందుకే.. ‘ఈశాన్యదిక్కున విష గాలి పుట్టేను..’ అని వైరల్‌ అవుతున్న పద్యాన్ని చూడగానే.. నిజంగానే బ్రహ్మంగారు రాశారా, ఎవరైనా రాసి, పాతకాలపు అక్షరాల్లో చెక్కి బ్రహ్మంగారు పేరు పెట్టేశారా’ అనే సందేహం వచ్చేస్తుంది.

కరోనా బయటి ప్రపంచంలో ఎంతగా ప్రబలుతోందో, సోషల్‌ మీడియా లోకంలో అంతకు మించి వ్యాప్తి చెందుతోంది. ఉదయాన్నే పేపర్‌లు చూసేవరకు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలోకి వచ్చేశాం. ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, వాట్సాప్‌లో.. ప్రతిచోటా కరోనా చుట్టూ రకరకాల కథనాలు! కరోనా వైరస్‌ను చైనాలోని ఒక ల్యాబ్‌లో రహస్యంగా సృష్టించి ప్రపంచం మీదికి వదిలారని ఒక స్టోరీ! కరోనా వస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ముందే ఊహించినా బయట పెట్టలేదని ఇంకో స్టోరీ! చైనాలో భాగం అయిన తైవాన్‌లో ఇప్పటికే లక్షల మంది కరోనా వైరస్‌తో చనిపోయారని (తైవాన్‌ జనాభా రెండున్నర కోట్లు), ఆ సంగతిని చైనా దాచి ఉంచిందని మరో స్టోరీ. కరోనా మహమ్మారిని నిద్ర లేపినందుకు చైనాకు వ్యతిరేకంగా ఇటలీ పౌరులంతా వీధుల్లోకి వచ్చి పెద్ద ‘మార్చింగ్‌’ చేశారని ఇంకో స్టోరీ. ఇవేవీ నిజం కాదు.

నా చేతుల్ని మిస్‌ అవుతున్నా
డొనాల్డ్‌ ట్రంప్‌ దేనినీ సీరియస్‌గా తీసుకోరు. కొరియా అధ్యక్షుడు కిమ్‌ అయినా ఒకటే, చైనా నుంచి వచ్చిన కరోనా అయినా ఒకటే ఆయనకు. స్వయంగా కరోనానే వచ్చి ఆయన ఎదురుగా నిల్చున్నా.. ‘కొద్ది రోజులుగా నేను నా ముఖాన్ని చేతులతో తాకడం లేదు కదా. మరి నువ్వెందుకు వచ్చావ్‌. నేను నా చేతుల్ని ఎంత మిస్‌ అవుతున్నానో తెలుసా?’ అనేస్తారు. ఈ మధ్య వైట్‌ హౌస్‌ సమావేశంలో కరోనా వైరస్‌ వైట్‌ హౌస్‌ కో ఆర్డినేట్‌ మాట్లాడుతూ, తరచు చేతులు కడుక్కుంటూ ఉండాలనీ, చేతులతో ముఖాన్ని తాక కూడదనీ చెప్పినప్పుడు ట్రంప్‌ ఇదే మాట అన్నారు.. తన చేతుల్ని మిస్‌ అవుతున్నానని! కరోనా ప్రపంచమంతా తిరుగుతూ యు.ఎస్‌.లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ట్రంప్‌ ఇలాగే అన్నారు. ‘ఇదేం పెద్ద వ్యాధి కాదు. సీజనల్‌గా వచ్చిపోతుండే జబులు లాంటిదే’’ అని. ప్రస్తుతం రెండోటర్మ్‌కి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ట్రంప్‌. ఈ టైమ్‌లో కరోనా వచ్చింది. నాయకుడు ఎవరైనా ప్రజలకు ధైర్యమే చెబుతాడు. అలాగే ట్రంప్‌ కూడా ప్రజలకు ధైర్యం చెప్పారు.. కరోనాకు భయపడే అవసరమే లేదని. దానిని పట్టుకుని ట్రంప్‌ మాటలకు వేరే పిక్చర్‌ ఇవ్వడం మొదలు పెట్టింది సోషల్‌ మీడియా. ట్రంప్‌ను మళ్లీ ఇంకోసారి గెలవనివ్వకుండా ఉండడం కోసం.. ‘కరోనాపై ట్రంప్‌ ఏమాత్రం బాధ్యతలేకుండా ఉన్నాడు’ అనే ఫేక్‌ న్యూస్‌ని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు.

చైనా ఎందుకు కరోనాను సృష్టిస్తుంది? ప్రపంచంపై ఆధిపత్యానికట! బయో వెపన్స్‌ తయారు చేయబోయి, ఆ ప్రయోగం వికటించి కరోనా పుట్టుకొచ్చిందట! మరి కరోనా వ్యాప్తి వెనుక బిల్‌ గేట్స్‌ హస్తం ఎందుకు ఉంటుంది? మూడు నెలల క్రితమే కరోనా కాష్మోరాను పసిగట్టిన బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌.. కరోనా వాక్సిన్‌ను కనిపెట్టడానికి ఒక సంస్థకు నిధులు ఇచ్చిందట. కరోనా వల్ల 6 కోట్ల 50 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని కూడా ఊహించిన ఫౌండేషన్‌ వాక్సిన్‌ పేటెంట్‌ తీసుకునే కంపెనీలకు లాభం కూర్చేందుకు వైపరీత్యాన్ని గోప్యంగా ఉంచిందట. అయితే, తైవాన్‌ ఎందుకు వైరస్‌ మరణాలను దాచి ఉంచుతుంది? చైనాకు తెలిస్తే మరణాలను తగ్గించే పేరుతో తైవాన్‌ను మొత్తం తన పరిధిలోకి తీసుకుంటుందట!

అర్థమే లేని ఈ చెత్తనంతా ఒకవైపు సోషల్‌ మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు ఏరి పారేస్తూనే ఉన్నా, ఇంకో వైపు కొత్త చెత్త గుట్టలు గుట్టలు పేరుకుంటూనే ఉంది. ఈ గుట్టల్లో కరానోకు మెడిసిన్‌ కూడా ఉంటోంది! కరోనా సోకుండా వ్యాధి నిరోధకతను పెంచే లేహ్యాలు, ద్రవాలు, చూర్ణాలు సమాచారం వచ్చిపడుతోంది. ‘మామూలు జలుబు, దగ్గులకే మాస్క్‌ చుట్టించి, కరోనా అని పేరు పెట్టించి ఔషధ ఉత్పత్తిదారులు బిజినెస్‌ చేస్తున్నారనే పోస్టులూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇంతవరకు ‘కరోనా’, ‘కోవిడ్‌’ అనే పేర్లతో 4 వేలకు పైగా వెబ్‌సైట్‌లు వెలసినట్లు గమనించిన ‘చెక్‌ పాయింట్‌’ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ.. వీటిల్లో మూడు శాతం సైట్‌లు తప్పుడు సమాచారంతో, ఐదు శాతం సైట్‌లు అనుమానించ దగిన విశేషాలతో ఉన్నట్లు కనిపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా ఎపిడెమిక్‌ (అంటువ్యాధి) తో సమాంతరంగా ఈ కరోనా ‘ఇన్ఫోడెమిక్‌’ని తుదముట్టించే చర్యలు చేపడుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ తదితర సంస్థలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ వీడియోలు, ఫొటోలు, పోస్ట్‌ల రూపంలోని ఈ అబద్ధపు సమాచారం దొంగచాటుగా చొరబడుతూనే ఉన్న సంగతి ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పరిశోధనలో వెల్లడైంది. ఒక్క ఇంగ్లిష్‌ భాషలోనే కాదు, హిందీ, హీబ్రూ, ఫార్సీ భాషల్లోనూ అవాస్తవాల కరోనా ప్రపంచమంతటా ప్రబలుతోంది.

క్రిమి కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది ‘ఫేక్‌’ క్రిమి. కాస్త భయం కల్పిస్తే, అనుమానం రేకెత్తిస్తే చాలు జనం నమ్మేస్తారు. విషయం వైరల్‌ అయిపోతుంది. మనిషి నుంచి మనిషికి అంటుకోడానికి క్రిమి కొంత సమయం తీసుకుంటుంది. ఫేక్‌ క్రిమికి అంత సమయం అక్కర్లేదు. పోస్ట్‌లుగా, షేర్‌లుగా, లైకులుగా, రీపోస్టులుగా క్షణాల్లో వ్యాపించేస్తుంది! 2018 ఆగస్టులో కేరళను ముంచేసిన వరదలనే చూడండి. ఎన్ని నకిలీ వార్తలు! ‘ఒక వ్యక్తి లైఫ్‌ జాకెట్‌ వేసుకోవడానికి నిరాకరించాడు. దీనికి కారణం అది కాషాయ రంగులో ఉండడమే. కాషాయం హిందూత్వకు చిహ్నం కావడంతో బాధితుడు వేసుకోనని తేల్చి చెప్పాడు. చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు‘ అంటూ ఆనాటి వరదల్లో ఒక పోస్టు వైరల్‌ అయింది. ఆ ఘటనతో ముఖ్యమంత్రి పి.విజయన్‌ లైఫ్‌ జాకెట్లను కాషాయం రంగుకి బదులుగా ఆకుపచ్చ రంగులో తయారు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారని కూడా ఆ వార్తకు రంగు అద్దారు. జాతీయ మీడియా కూడా దానిని ప్రచురించింది. కానీ చివరికి అదీ తప్పుడు ప్రచారమే అని తేలింది.
ఇలాంటిదే మరొకటి. ‘మరి కాసేపట్లో ముల్లపెరియార్‌ డ్యామ్‌ కూలిపోతుంది. ఇప్పటికే ఆనకట్ట లీక్‌ అవుతోంది. డ్యామ్‌ కూలిపోవడం ఖాయం. ఎర్నాకుళం మునిగిపోతుంది. పీఎంవోలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం స్వయంగా చెప్పాడు. ఆ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా సురక్షిత స్థావరాలకు వెళ్లిపోండి‘ అంటూ ఒక ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారి ప్రజల్లో భయభ్రాంతుల్ని సృష్టించింది. చివరికి అది ఫేక్‌ అని, అలాంటి ప్రమాదమేమీ లేదని  ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

వరదల్లాంటివి ఒక ప్రదేశానికో, ఒక దేశానికో పరిమితమైనవి. కరోనా ప్రపంచమంతటిదీ. ఐక్యరాజ్య సమితి కూడా చూసి చూసి ఇక తప్పదని మొన్ననే దీనినొక విశ్వ విపత్తుగా ప్రకటించింది. అంటే అలక్ష్యం చెయ్యొద్దని. ఎన్ని విశ్వ విపత్తులైనా ఎదుర్కొనే శక్తి మనిషికి ఉంది. మనిషి సృష్టిస్తున్న మాయలమారి ప్రచారాల అంటువ్యాధికి మందూ లేదు, దాన్ని తట్టుకునే శక్తి మానవాళికీ ఉండదు. పంటలోని కలుపులా ఎప్పటికప్పుడు ‘ఫేక్‌’ ఏరిపారేయడం ఒక్కటే ఇప్పటికైతే దారి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement