
మానసిక వ్యాధుల చికిత్సలో దాదాపు ఒక శతాబ్దం పాటు ‘ఫ్రెనాలజీ’ అనే కుహనా శాస్త్రం రాజ్యమేలింది. అప్పట్లో చాలామంది వైద్యులు సైతం దీనిని అసలు సిసలు శాస్త్రమేనని గుడ్డిగా నమ్మేవారు. ‘పుర్రెకో బుద్ధి’ అనే నానుడి ఎటూ ఉండనే ఉంది. ఈ శాస్త్రం బహుశ ఆ నానుడినే నమ్ముకున్నట్టుంది. కపాలంలోని ఒక్కో నిర్ణీత భాగం నిర్ణీత ఆలోచనలకు, అనుభూతులకు కేంద్రంగా ఉంటుందనేది ‘ఫ్రెనాలజీ’ సిద్ధాంతం. కపాలంలోని ఏదైనా భాగంలో లోపం ఏర్పడితే సంబంధిత భాగానికి చెందిన ఆలోచనలు, అనుభూతులు, భావోద్వేగాల్లో లోపాలు తలెత్తి మానసిక రుగ్మతలు ఏర్పడతాయని నాటి ఫ్రెనాలజిస్టులు బలంగా నమ్మేవారు.
కపాలంలో ఏయే భాగాలు ఏయే భావోద్వేగాలను, ఆలోచనలను నియంత్రిస్తాయో సూచించే చార్టులను రూపొందించి, విస్తృతంగా ప్రచారం చేయడంతో 18–19 శతాబ్దాల కాలంలో ఫ్రెనాలజీని శాస్త్రంగానే చాలామంది నమ్మేవారు. వివిధ మానసిక సమస్యలకు ఆ చార్టు ఆధారంగా సంబంధిత కపాల భాగాన్ని బాగా మర్దన చేసేవారు. క్రమంగా అలా కపాల మర్దన చేస్తుంటే పిచ్చి కుదురుతుందని వెర్రిగా నమ్మేవాళ్లు. తర్వాతి కాలంలో ఇదంతా ఉత్తుత్తి శాస్త్రమేనని తేలిపోయినా, సైకియాట్రీలోను, న్యూరాలజీలోను ఆధునిక పరిశోధనలకు ఇది కొంతవరకు స్ఫూర్తినిచ్చిందని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment