
పెళ్లిళ్ల కరోడ్‌పత్ని .. లిల్లీ సాఫ్రా
వివాహాలు నాలుగు.. సంపద రూ. 7,200 కోట్ల పైచిలుకు
కష్టపడి సంపాదిస్తేనో.. వారసత్వంగా వచ్చిన ఆస్తివల్లో .. లేదా లక్కీగా లాటరీలు తగిల్తేనో కోటీశ్వరులు కావొచ్చు. కానీ, ఇలాంటివేవీ కాకుండా కూడా కోటీశ్వరురాలయ్యారు.. లిల్లీ సాఫ్రా. కేవలం పెళ్లిళ్లతోనే ఈ ఫీట్ సాధించారామె. బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రెలో 1934 డిసెంబర్ 30న ఒక బ్రిటిష్ రైల్వే ఇంజనీర్ ఇంట పుట్టారు లిల్లీ. ఆమె నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.
మొదటిసారి 17 ఏళ్ల ప్రాయంలో మారియో కోహెన్ అనే బిజినెస్ మాగ్నెట్‌ని పెళ్లాడారు. తర్వాత కొన్నేళ్లకు విడాకులు తీసుకుని.. ఆల్‌ఫ్రెడో మాంటెవెర్డె అనే మరో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. ఆల్‌ఫ్రెడో 1969లో ఆత్మహత్య చేసుకోగా.. ఆయన యావదాస్తి లిల్లీకి సంక్రమించింది. అటు పైన బిలియనీర్ బ్యాంకర్ అయిన ఎడ్మండ్ శాఫ్రాతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపినా.. శామ్యూల్ బె బెండాహాన్‌ని 1972లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాదికే డైవోర్స్ తీసుకుని సాఫ్రాని వివాహమాడారు.
ఆయన ఒక అగ్నిప్రమాదంలో అనుమానాస్పదంగా 1999లో మరణించారు. దీంతో ఆయన సంపదలో 800 మిలియన్ డాలర్ల పైగా ఆస్తి ఆమెకు సంక్రమించింది. ఆ విధంగా మొత్తం మీద లిల్లీ సంపద ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,200 కోట్ల పైగా) పైమాటే. అయితే, ఇదంతా సొంత విలాసాలకే ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళాలుగా ఇస్తున్నారామె.