కేన్సర్ చికిత్సలో ఒకటైన కీమోథెరపీ అవసరమా? వద్దా? తేల్చేసేందుకు ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. సాధారణంగా కేన్సర్ కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తరువాత శరీరంలో మిగిలి ఉన్న కొద్దిపాటి కేన్సర్ కణాలను కూడా నాశనం చేసేందుకు కీమోథెరపీ వాడుతూంటారు. అయితే నూటికి 90 శాతం కేసుల్లో ఈ కీమోథెరపీ పనిచేయదు సరికదా.. అనవసరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ అవసరాన్ని కచ్చితంగా గుర్తించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
కణితి నుంచి వేరుపడి రక్తంలోకి చేరిన డీఎన్‌ఏ పోగులను గుర్తించడం ద్వారా కీమోథెరపీ అవసరాన్ని కచ్చితంగా గుర్తించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లోని దాదాపు 40 ఆసుపత్రుల్లో ఇప్పటికే కొంత మంది కేన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించడం ద్వారా కణితి డీఎన్‌ఏ పోగుల మోతాదుకు, వ్యాధి తీవ్రతకు మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇలా పోగులను గుర్తించడం ద్వారా కొన్ని రకాల కేన్సర్‌లను గుర్తించవచ్చునని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో అవసరమైన కీమోథెరపీలను నివారించగలిగితే రోగులకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తగ్గించవచ్చునని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment