‘దేవదాసు’ చిత్రంలోని దృశ్యం
దేవదాసుది సంపన్న కుటుంబం. తండ్రి పెద్ద జమిందారు. అయినప్పటికి దేవదాసు తన ఇంటి పక్కనే ఉండే పేద కుటుంబానికి చెందిన పార్వతితో చిన్నప్పటినుంచి స్నేహంగా ఉంటాడు. ఆ తర్వాత అతడు పైచదువుల నిమిత్తం లండన్ వెళతాడు. చదువు పూర్తవగానే ఇంటికి తిరిగివస్తాడు. తిరిగి వచ్చిన తరువాత దేవదాసు, పార్వతిల మధ్య ఉన్న స్నేహం.. ప్రేమగా మొగ్గతొడుగుతుంది. పెద్దవాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పార్వతి తండ్రి పెళ్లి విషయం మాట్లాడటానికి దేవదాసు తండ్రి దగ్గరకు వెళతాడు. అక్కడ అయితే పేదవాడైన పార్వతి తండ్రిని దేవదాసు తండ్రి తీవ్రంగా అవమానించి పంపుతాడు. విషయం తెలుసుకున్న దేవదాసు.. తండ్రిని నిలదీస్తాడు. తండ్రి రివాల్వర్ తీసి దేవదాసు చేతిలో పెట్టి, తనను చంపేసి ఆ పార్వతిని పెళ్లి చేసుకొమ్మని బెదిరిస్తాడు. దీంతో దేవదాసు మనసు ముక్కలవుతుంది. తండ్రి మాట జవదాటలేక, అక్కడ ఉండలేక పట్నం వెళ్లిపోతాడు. పార్వతి తండ్రి పంతాలకు పోయి ముసలివాడైన జమీందారుతో పార్వతి పెళ్లి జరిపిస్తాడు.
పట్నంలో ఉన్న దేవదాసు పార్వతి లేకపోతే బతకలేనని తెలుసుకుని, తిరిగి పల్లెకు వస్తాడు. అప్పటికే పార్వతికి పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. భగ్నహృదయుడైన దేవదాసు తిరిగి పట్నం వెళ్లి పోతాడు. అక్కడ పార్వతిని మరువలేక తాగుడుకు అలవాటుపడతాడు. సాని కొంపలో నృత్యంచేసే చంద్రముఖి అనే అమ్మాయితో కాలం గడుపుతుంటాడు. చంద్రముఖి కూడా మనస్ఫూర్తిగా దేవదాసును ప్రేమిస్తుంది. ఆస్తిపోయి, అనారోగ్యం పాలైన దేవదాసు కడసారి పార్వతిని చూడటానికి ఆమె ఉండే పల్లెకు వెళతాడు. అయితే పార్వతిని చూడడానికిముందే ఆమె ఇంటిముందర పడి అతడు చనిపోతాడు. తమ ఇంటి ముందు చనిపోయింది దేవదాసని పార్వతికి తెలుస్తుంది. అతడ్ని చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ, దేవదాసును చూడకుండానే పార్వతి కూడా మరణిస్తుంది.
నిజానికి దేవదాసు, పార్వతిల ప్రేమ కథ ఓ కల్పితం. అయినప్పటికి వాస్తవానికి ఏమాత్రం తీసిపోని ఆర్థ్రత ఈ కథ సొంతం. ప్రముఖ బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ రాసిన ‘దేవదాస్’ నవల ఆధారంగా పలు భాషల్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. కథ విషాదాంతమైనా.. మరిచిపోలేని ఓ ప్రేమ కావ్యంలా అందరి మనసులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి. ఇప్పటికీ దేవదాస్ పార్వతిల ప్రేమ కథ సినిమాలా కాకుండా ఓ నిజజీవితంలా కళ్లముందు కదలాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment