గుడిలో శఠగోపం పెట్టడం
శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీని పైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదా లను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది.
భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. సాధారణంగా విష్ణ్వాలయంలో అయితే శఠగోపాన్ని తలమీద పెడతారు. శివాలయంలో శఠగోపాన్ని తలమీద ఉంచరు. కళ్లకు అద్దుకోవడానికి వీలుగా కనులముందు ఉంచుతారు. విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే... శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచు తో విడివిడిగా గాని తయారుచేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలోని వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.