ఆలయంలో ప్రవేశించిన భక్తునికి ధ్వజస్తంభం మాత్రమే కాకుండా ఇంకా అనేక స్తంభాలు కనిపిస్తాయి. వాటి గురించిన అవగాహన కూడా వారికి ఉండాలి. వాటిలో రాతితో నిర్మించి పైన దీపం ఏర్పాటు చేస్తే దాన్ని దీపస్తంభం అంటారు. ఉత్తరాది ఆలయాల్లో చెట్టుకు కొమ్మలున్నట్లు ఒక స్తంభానికి వందకు పైగా దీపాలను అమర్చే దీపస్తంభం ప్రతీ గుడిలో ఉంటుంది. విశేష పండుగలప్పుడు భక్తులు దీపాల్ని వెలిగిస్తారు. ఒక రాతిస్తంభం పైన చిన్న గూడు చేసి అందులో నంది ఉంచితే దాన్ని నందిస్తంభం అంటారు. ఇది ప్రతి శివాలయంలో ఉంటుంది. అలాగే విష్ణ్వాలయంలో రెండు చేతులూ జోడించి నిలుచున్న గరుడవిగ్రహం పైనగానీ స్తంభం మొదల్లో గానీ ఉంచితే దాన్ని గరుడస్తంభం అంటారు. ఇంకా శూలం వంటి ఆయుధాన్ని నాటి ఏర్పాటు చేసే శూలస్తంభం... పశువుల్ని మొక్కుకుని ఆలయానికి సమర్పించేప్పుడు వాటిని కట్టే యూపస్తంభం... రాజులు, చక్రవర్తులు విజయాన్ని సాధించి, రాజ్యాలను జయించినప్పుడు నాటే విజయస్తంభాలు.
కొన్ని ఆలయాల్లో కనిపిస్తాయి. సింహాచలంలో కప్పస్తంభం... హంపిలోని సప్తస్వరస్తంభాలు... తిరుమలలోని వరాహ స్తంభం ఇలా చాలా స్తంభాలు విశేషమైనవి. జైన బసదుల్లో ఉండే స్తంభాన్ని మానస్తంభం అంటారు. అక్కడే ఉండే మరోస్తంభాన్ని బ్రహ్మస్తంభం అని కూడా పిలుస్తారు. ఈ స్తంభాలను దర్శించినా... తాకినా... వీటి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా...మొక్కుకున్నా... అనుకున్న పనులు నెరవేరుతాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సోపానాలు ఆలయం అంటే సాధారణంగా చాలా ఎత్తుగా... లేక ఎత్తైనప్రదేశంలోనే నిర్మిస్తారు. అలాంటి ఆలయాల్లో దైవదర్శనం చేసుకోవాలంటే మనకు మార్గం చూపేవి సోపానాలే. మెట్లే కదా అని మనం అనుకున్నా వాటివెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి ప్రత్యేకంగా పేర్లున్నాయి. ఆలయంలోకి వెళ్లేందుకు చాలా చోట్ల ముఖమండపం,రంగమండపం ద్వారా లోపలికి వెళ్లడానికి రెండువైపుల నుండీ మెట్లు ఉంటాయి. ఆ మెట్లను సోపానమాలా అంటారు.
ఇందులో మొదటి మెట్టును అశ్వపాదం అనీ.. చివరి మెట్టును ఫలకం అని పిలుస్తారు. మెట్లకు అటూ ఇటూ పట్టుకోవడానికి ఆలంబనగా ఏనుగుతల.. తొండం.. ఉంటే దాన్ని హస్తిహస్తం అంటారు. రథచక్రాలన్ని అటూ ఇటూ నిర్మిస్తే రథాంగ సోపానమంటారు. మకరముఖాన్ని...లతా మండపాన్ని కూడా నిర్మిస్తారు. ఇలాంటి నిర్మాణాన్ని కుడ్యసోపానం అంటారు.కొన్నిచోట్ల మెట్లు ఉన్నా తడిమి చూస్తే తప్ప అక్కడ మెట్లున్నట్టు మనకు తెలియదు. ఉదాహరణకు అహోబిలం.. మేల్కోట వంటి గుహాలయాల్ని దర్శించినప్పుడు భక్తులు వీటిని గమనించవచ్చు. అక్కడ మెట్లు అంత స్పష్టంగా కనపడవు. వీటిని గుహ్య సోపానాలంటారు. ఇక రెండోరకమైనవి అగుహ్య సోపానాలు.
మెట్లను గుర్తుపట్టే విధంగా ఉండే వీటిలో నాలుగు రకాలున్నాయి. ఎదురుగా.. కుడివైపు ఎడమవైపు ఇలా మూడు వైపులా ఎక్కే విధంగా ఉండే దాన్ని త్రిఖండాకార సోపానం అంటారు. పైన వెడల్పుగా ఉండి కిందికి దిగుతుండగా క్రమేపీ చిన్నదవుతూ ఉన్న మెట్లమార్గాన్ని శంఖమండలం అంటారు. సగం సున్నా వంటి మెట్లను అర్ధగోమూత్రం అనీ.. ఓ స్తంభానికి చుట్టూ మెట్లు ఏర్పరచి పైకెళ్లేలా ఉంటే దాన్ని వల్లీమండల సోపానాలంటారు. ఆలయాల్లో నిర్మించే మెట్లు సరిసంఖ్యలో ఉండాలని.. మానవ గృహాలకు మెట్లు బేసిసంఖ్యలో ఉండాలని నియమం. పైగా మెట్లు పిల్లలు.. వృద్ధులు.. మిగిలిన అందరూ ఎక్కి దిగడానికి ఇబ్బంది లేకుండా ఆరంగుళాల ఎత్తు మాత్రమే ఉండాలని శిల్పశాస్త్ర నియమం.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment