ఆందోళన వద్దు... మంచికాలం ముందుంది!
నా వయసు 25. గృహిణిని. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ప్రతి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను నాలుగుసార్లు తీసుకోవాల్సి వస్తోంది. చాలా బాధాకరంగా ఉంటోంది. ఇటీవలే ‘సూప్రామాలెక్యులార్ ఇన్సులిన్ అసెంబ్లీ-॥అనే ఫార్ములేషన్ గురించి తెలుసుకున్నాను. దీన్ని తీసుకుంటే ఇన్నిసార్లు ఇంజెక్షన్లు తీసుకునే బాధ తప్పుతుందని చదివాను. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుందా? ఇండియాలో ఇది లభ్యమవుతుందా?
- సృజన, సికింద్రాబాద్
సూప్రామాలెక్యులార్ ఇన్సులిన్ అసెంబ్లీ-॥అనే ఫార్ములేషన్ ఇన్సులిన్‌ను ఒకేసారి గుమ్మరించినట్లుగా కాకుండా చాలా నియంత్రితంగా విడతలు విడతల్లో కొద్దికొద్దిగా విడుదల చేస్తుంది. దాంతో రోగుల్లో చాలాసార్లు ఇంజెక్షన్ సూది గుచ్చుకోవాల్సిన అగత్యం తప్పుతుంది. కేవలం 200 మైక్రోగ్రాముల ఒక్క సింగిల్ మోతాదుతోనే డయాబెటిస్‌తో బాధపడే జంతువులలో దాదాపు 120 రోజుల నుంచి 140 రోజుల వరకు రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను నార్మల్‌గా ఉంచవచ్చునని ఇప్పటికి నిరూపితమైంది. అయితే ఇప్పటికి ఈ అధ్యయనాలన్నీ కేవలం డయాబెటిస్ ఉన్న జంతువులకే పరిమితమై ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఇది చాలా సురక్షితమని పూర్తిగా నిరూపితమైతే అప్పుడు మనుషులపైనా తగిన అధ్యయనాలు జరగాల్సి ఉంది. అది మనుషుల్లోనూ అంతే ప్రభావపూర్వకంగా పనిచేస్తుందనీ, అంతే సురక్షితమైనదనీ నిరూపితమైతే, త్వరలోనే మనకూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అది పరిశోధనల దశలోనే ఉంది.
నా వయసు 64. గృహిణిని. గత ఐదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. డయాబెటిస్ మందులతో పాటు గుండెకు సంబంధించిన మందులూ వాడుతున్నాను. నేను కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇలా తీసుకోవడం హానికరమా? దయచేసి నాకు వివరంగా చెప్పండి.
- శ్రీలత, కరీంనగర్
ప్రతిరోజూ రెండు కూల్‌డ్రింక్స్ తాగడం లేదా ఐస్ టీ (చాయ్)లు తాగడం టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను 26 శాతం పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి తోడు అధికరక్తపోటూ వచ్చే ప్రమాదం ఉంది. ఇక మెటబాలిక్ సిండ్రోమ్ అనే జబ్బుకు చాలా రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. అవి... అధిక రక్తపోటు, నడుము చుట్టుకొలత పెరగడం వంటివి. ఈ లక్షణాల వల్ల గుండె ధమనుల జబ్బులూ రావచ్చు. గతంలో జరిగిన చాలా అధ్యయనాల్లో కూల్‌డ్రింక్స్ తాగడానికీ, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి జబ్బులు వచ్చేందుకు సంబంధం ఉందని తేలింది. రోజూ రెండు బాటిల్స్ కూల్‌డ్రింక్స్ తాగేవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువ. ఇక నెలకు ఒకసారి 340 గ్రాముల కూల్‌డ్రింక్ మాత్రమే తాగేవారిలోనూ టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 15 శాతం వరకు ఉంటాయని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్‌తో బాధపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ కూల్‌డ్రింక్స్ తాగవద్దని, ఐస్‌క్రీములు తినవద్దని డాక్టర్లుగా మా సలహా.
డయాబెటిస్ కౌన్సెలింగ్
Published Mon, Jul 13 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement