భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి? | Diabetic counseling | Sakshi
Sakshi News home page

భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి?

Published Mon, Jun 22 2015 11:13 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి? - Sakshi

భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి?

డయాబెటిక్ కౌన్సెలింగ్
నా వయసు 73. బరువు 63. పరగడుపున రక్తంలో చక్కెరపాళ్లు 114 నుంచి 131 ఎంజీ/డీఎల్ ఉన్నాయి. అయితే భోజనం తర్వాత చక్కెర పాళ్లు తక్కువగా ఉంటున్నాయి. (అంటే 130 కంటే తక్కువ). మనం తీసుకున్న భోజనాన్ని బట్టి పోస్ట్ లంచ్ విలువలు ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలుసు. అయినా నా సందేహం ఏమిటంటే... నా భోజనం తర్వాతి బ్లడ్ షుగర్ విలువలు, ఫాస్టింగ్ కంటే తక్కువగా ఎలా ఉంటున్నాయి? అంటే ఆ చక్కెర నిల్వలు నా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడటం వల్ల భోజనం తర్వాతి విలువలు ఫాస్టింగ్ కంటే తక్కువగా ఉంటున్నాయా? నాకు సలహా ఇవ్వండి.
 - విశ్వేశ్వరరావు, వరంగల్
 
సాధారణంగా మన రక్తంలో ఉన్న చక్కెర పాళ్లను అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో గ్రహించి దానికి మ్యాచ్ అయ్యేలా ప్యాంక్రియాస్ గ్రంథి అంత ఇన్సులిన్‌ని స్రవిస్తుంది. ఒక్కోసారి రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ప్యాంక్రియాస్ గ్రంథికి లేనప్పుడు అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు గణనీయంగా పడిపోతుంటాయి. సాధారణంగా డయాబెటిస్ వచ్చే ముందు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి కాబట్టి దీన్ని డయాబెటిస్‌కు ముందు దశగా పరిగణించవచ్చు. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా నివారించేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటూ ఉండండి. ఇక దీనితో పాటు మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగా తీసుకోండి. క్రమం తప్పక వ్యాయామం చేయండి. అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండండి. బరువును అదుపులో పెట్టుకోండి. ఈ నియమాలన్నీ కేవలం డయాబెటిస్‌కు ముందు దశలో ఉన్నవాళ్లేగాక ఆరోగ్యవంతులూ ఆచరించవచ్చు.
 
నా వయసు 39. నాకు టైప్-2 డయాబెటిస్ ఉంది. నా డయాబెటిస్‌కు కారణమేమిటి అన్న విషయాన్ని తెలుసుకోవడం ఎలా? అంటే నాలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఇది వచ్చిందా? లేక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిందా?. నాకు ఇటీవలే డయాబెటిస్ బయటపడింది. దాని తర్వాత వెంటనే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ప్రిస్క్రయిబ్ చేశారు.  కారణం తెలియకపోవడం వల్ల నాకు ఇస్తున్న చికిత్స సరైనదా, కాదా అనే సందేహంలో ఉన్నాను. మా కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉన్నారు. దయచేసిన నా సందేహాలను తీర్చండి.
 -  వినోద్, గుంటూరు
 
మీకు టైప్-2 డయాబెటిస్ ఉందని అన్నారు కాబట్టి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో పాటు తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల కావచ్చు. దీన్ని నిర్ధారణ చేయాలంటే కొన్ని షుగర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు భోజనం చేసిన రెండు గంటల తర్వాత ‘సి-పెప్టైడ్’ పరీక్ష కూడా చేయించాలి. అప్పుడు మీ రక్తంలో పెరిగిన ఇన్సులిన్, సి-పెప్టైడ్ పాళ్లు తెలుస్తాయి. మీ డాక్టర్‌గారు మీకు ఇన్సులిన్ ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా చేస్తున్న చికిత్స సరైనదే. ఇది బహుశా కొంతకాలం కోసమే కావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement