స్నేహితులుంటే... దురలవాట్లు దూరం!
స్నేహాల వల్ల దురలవాట్లు వస్తాయనేది పాతమాట... సరైన స్నేహితులు లేకపోవడం కూడా దురలవాట్లకు దారితీయవచ్చనేది పరిశోధకులు చెప్పిన కొత్తమాట!
మనసుకు దగ్గరైన స్నేహితుడితో కాసేపు గడిపినా, సరదాగా ముచ్చటించినా మనకు కలిగే ఆనందం అలాంటిలాంటిది కాదు. ఈ బిజీ లైఫ్‌లో ఎంతో ఊరటనిచ్చే శక్తి స్నేహితులకు ఉంటుంది. అయితే మనసుకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా స్నేహం ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు బ్రిగ్‌హమ్ యంగ్‌యూనివర్సిటీ అధ్యయనకర్తలు. ప్రతిమనిషికీ కొంత మంది మంచి స్నేహితులుంటారు.
అయితే ఉద్యోగం కోసమో, నివాసం కోసమో కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు స్నేహితుల కొరత వస్తుంది. మనవాళ్లు ఎవరైనా దగ్గర ఉంటే బావుండుననే భావన మనసును మెలిపెడుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొత్త అలవాట్లు అలవడే అవకాశం కూడా ఉంటుందని అధ్యయనకర్తలు అంటారు.
ఒంటరితనం, మనసులోని మాట చెప్పుకోవడానికి మరో మనిషి లేకపోవడం మందు, సిగరెట్‌లను స్నేహితులుగా చేసే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. అందుకే కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు వీలైనంత కలివిడిగా వ్యవహరించి, మన మనస్తత్వానికి సెట్ అయ్యే స్నేహితులను సంపాదించుకోవాలని వారు సూచిస్తున్నారు.