సోను నిగమ్‌పై వీడియో ద్వారా ప్రతిదాడి | Divya Khosla Kumar Reply to Sonu Nigam Comments on Bhushan | Sakshi
Sakshi News home page

అపర కాళిగా మారిన దివ్యా ఖోస్లా

Published Fri, Jun 26 2020 8:03 AM | Last Updated on Fri, Jun 26 2020 9:01 AM

Divya Khosla Kumar Reply to Sonu Nigam Comments on Bhushan - Sakshi

దివ్యా ఖోస్లా

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో మాటల దాడులు కొనసాగుతున్నాయి. ఆరోపణలూ ప్రత్యారోపణలు వేడి మీద ఉన్నాయి. ‘నెపొటిజమ్‌’ (పక్షపాతం) ఎవరు ఎవరి పట్ల వహిస్తే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్‌ ‘ఆత్మహత్యలు నటీనటుల్లోనే కాదు ఇక మీదట గాయకుల్లో, సంగీత దర్శకుల్లో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆడియో కంపెనీల నిరంకుశ వైఖరి ఇందుకు కారణం’ అని కామెంట్‌ చేశాడు. ఇది ‘టి సిరీస్‌’ సంస్థను, దాని అధిపతి అయిన భూషణ్‌ కుమార్‌ను ఉద్దేశించినది.

సోను నిగమ్‌ అంతటితో ఆగకుండా ‘భూషణ్‌ 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు అబూ సలేమ్‌ నుంచి రక్షించమని కూడా వచ్చాడు’ అన్నాడు. టి. సిరీస్‌ సంస్థ అధినేత గుల్షన్‌ కుమార్‌ 1997లో మాఫియా దాడిలో హతమయ్యాడు. అప్పటికి ఆయన కుమారుడైన భూషణ్‌ వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ భూషణ్‌ సంస్థ పగ్గాలు చేపట్టాడు. సంస్థను నిలబెట్టాడు. పెద్ద నిర్మాతగా కూడా ఉన్నాడు. సోను నిగమ్‌ ఆరోపణలకు భూషణ్‌కుమార్‌ బదులివ్వలేదు. కాని అతని భార్య దివ్యా ఖోస్లా కుమార్‌ మాత్రం ఆగ్రహంతో అపర కాళిగా మారింది. తన భర్త మీద ఆరోపణలు చేసిన సోను నిగమ్‌ మీద వీడియో ద్వారా ప్రతిదాడికి దిగింది.

ఒక వేడుకలో గాయకుడు సోను నిగమ్, టి సిరిస్‌ అధినేత భూషణ్‌ కుమార్, దివ్యా ఖోస్లా
‘సోనూ నిగమ్‌ గారూ. టి సిరీస్‌ సంస్థ ఎందరో గాయకులకు, సంగీత దర్శకులకు బ్రేక్‌ ఇచ్చింది. ఢిల్లీలో మీరు ఐదు రూపాయలకు కచ్చేరి ఇస్తున్న రోజుల్లో మా మామగారు గుల్షన్‌ కుమార్‌ గారు మిమ్మల్ని స్పాట్‌ చేసి బాంబే పిలిపించి గాయకుడిగా అవకాశం ఇచ్చారు. కాని ఆయన చనిపోయినప్పుడు సంస్థ మునిగిపోతుందని భావించిన మీరు టి సిరీస్‌తో కాకుండా మరో మ్యూజిక్‌ కంపెనీతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. ఇదా మీరు చేయాల్సింది. అసలు మీరు ఇంత పెద్ద గాయకులు అయ్యారు కదా మీరు ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు? మిమ్మల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. ఇక మీరు అండర్‌ వరల్డ్‌ ప్రస్తావన తెచ్చారు.

మావారు మీ దగ్గరకు అబూ సలేమ్‌ నుంచి రక్షణ కోసం వచ్చారని చెబుతున్నారు. అంటే మీకు అండర్‌ వరల్డ్‌తో లింక్స్‌ ఉండేవా? దీనిమీద ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నాను. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల సోషల్‌ మీడియాలో నా భర్త మీద, నా మీద, నా సంతానం మీద కామెంట్స్‌ వస్తున్నాయి. ఇది చాలా తప్పు. అవకాశాలు అందరికీ ఇవ్వలేము. అవకాశాలు దొరకని వాళ్లు ఆరోపణలకు దిగితే ఎవరూ మిగలరు. ఇక మీదటైనా మీ ఆరోపణలు బంద్‌ చేసుకోండి’ అని గట్టిగా హెచ్చరించింది దివ్యా ఖోస్లా. ఈ భార్య చెప్పిన బదులు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement