
మెడ నుంచి భుజంలోకి నొప్పిపాకుతోంది... తగ్గేదెలా?
మెడ నుంచి భుజంలోకి నొప్పిపాకుతోంది... తగ్గేదెలా?
నా వయసు 29 ఏళ్లు. నేను చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండు వారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని డాక్టర్ చెప్పారు. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం సూచించండి. - నిఖిల్, బెంగళూరు
మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ ఒకే భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొని పనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు.
............
నా వయసు 29 ఏళ్లు. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్‌మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి. - నర్సింహ, కరీంనగర్
మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి.
నా కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది (ఫ్రాక్చర్ అయ్యింది). అప్పుడు శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి. స్క్రూలు బిగించి సరిచేశారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా?
- రవికుమార్, నల్లగొండ
మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించడమే మేలు. ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. చాలా వృద్ధులలో మాత్రమే శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా ఏవైనా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందేమో అన్న సమయంలోనే వాటిని వదిలేస్తాం.
ఇక యువకులలో సైతం చేతుల విషయంలోని పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే తప్ప... కొన్నిసార్లు అలాగే వదిలేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు ముంజేయి అంటున్నారు కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. అలా తొలగించకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనమైపోయి, తేలిగ్గా విరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. ధైర్యంగా ముందుకు వెళ్లండి.
డాక్టర్ కె.సుధీర్ రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్
ల్యాండ్ మార్క్ హాస్పటల్స్
హైదరాబాద్
....................
మా అబ్బాయి వయసు 17 ఏళ్లు. ఇంటర్ చదువుతున్నాడు. చదువుతో పాటు ఆటల్లోనూ చాలా చురుకు. అయితే ఈ మధ్య వాడు తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ చాలా నీరసపడ్డాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆటలాడటం వల్ల కాస్త వీక్ అయ్యాడు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కొన్ని మందులు రాసిచ్చారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. దాంతో స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాం. ఆయన రక్తపరీక్షలు చేసి ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయాయని డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్‌గా అనుమానించి మందులిచ్చారు. అయినప్పటికీ మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - చంద్రకళ, ఆదిలాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ అబ్బాయి విషయం కాస్త ఆందోళనగానే ఉన్నట్లు అనిపిస్తోంది. శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య చాలా కారణాలవల్ల తగ్గుతుంది. అయితే సరైన వ్యాధి నిర్ధారణ ద్వారా ఏ కారణంతో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందో తెలుసుకుని చికిత్స అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య అంతకంతకూ స్పీడ్‌గా పడిపోతుంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీ అబ్బాయి విషయానికి వస్తే... వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్లతో కూడా జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందునా మీ అబ్బాయి ఆటల్లో చురుకుగా వ్యవహరిస్తుంటాడని చెబుతున్నారు కాబట్టి ఈ సమస్యకు లోనైనట్లుగా చెప్పవచ్చు.
అయితే మీరు ఇప్పటికీ వైరల్, డెంగ్యూ లాంటి వ్యాధులకు సంబంధించిన మందులు వాడామని, అయినప్పటికీ ఎలాంటి మార్పూ కనిపించలేదని చెబుతున్నారు. కాబట్టి మీరు వెంటనే అన్ని వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి వెళ్లి నిపుణులైన ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్)ని కలవండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే క్యాన్సర్ లక్షణాలున్న వారిలో కూడా ఈ తరహా ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. వీరికి ప్లేట్‌లెట్స్ ఎక్కించినప్పటికీ ఏమాత్రమూ ప్రయోజనం ఉండదు. వారిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పడిపోతూ ఉంటుంది. దాంతో వారు మరింత నీరసపడిపోతారు.
ట్రీట్‌మెంట్‌కి కూడా వారి శరీరం సహకరించలేని పరిస్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ అబ్బాయికి పరీక్షలో క్యాన్సర్ అని నిర్ధారణ జరిగినప్పటికీ మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అది ఏ స్టేజ్‌లో ఉన్నా మంచి వైద్యచికిత్స ఇప్పుడు అందుబాటులో ఉంది. సమూలంగా క్యాన్సర్‌ను రూపుమాపవచ్చు. అయితే ఇక్కడ సమయం కీలకం. త్వరగా ఆ మహమ్మారిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే మీ అబ్బాయి మునుపటిలాగే చలాకీగా అవుతాడు. ముందులాగే ఆటపాటల్లో, చదువులో చురుగ్గా అవుతాడు. ముందుగా మీరు నిపుణులైన వైద్యులను సంప్రదించి, మీ అబ్బాయి విషయంలో అసలు సమస్య ఏమిటో తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స అందించేలా చూసుకోండి.
డాక్టర్ నిఖిల్ గడ్యాల్ పటేల్
సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్
యశోదా హాస్పటల్స్
సోమాజిగూడ, హైదరాబాద్