బాబుకు గుండెలో రంధ్రాలు...  పూడుకుపోతాయా?  | The doctor said that Babu had two holes in the heart | Sakshi
Sakshi News home page

బాబుకు గుండెలో రంధ్రాలు...  పూడుకుపోతాయా? 

Published Mon, Feb 25 2019 3:53 AM | Last Updated on Mon, Feb 25 2019 3:53 AM

The doctor said that Babu had two holes in the heart - Sakshi

మా బాబు పుట్టిన రెండు నెలల తర్వాత బాగా జలుబుగా ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాం. కొన్ని పరీక్షలు చేసి, బాబు గుండెలోపల రెండు రంధ్రాలు ఉన్నట్లు డాక్టర్‌ చెప్పారు. ‘చిన్న వయసు కదా... వాటంతట అవే పూడుకుంటాయి’ అన్నారు. మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి.  

మీరు బాబుకు గుండెలో రంధ్రాలున్నాయంటూ చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (ఏఎస్‌డీ... అంటే గుండె పై గదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (వీఎస్‌డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్‌) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉండీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా సమస్యలు ఏవీ లేకుండా తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. అయితే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి ఉంటుంది. ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యల  (అసోసియేటెడ్‌ కార్డియాక్‌ డిఫెక్ట్స్‌)పైన కూడా ఆధారపడి ఉంటుంది. 

గుండె పై గదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 శాతం నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 శాతం నుంచి 40 మందిల్లోనూ ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకు ఒకసారి పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స సహాయంతో – శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే మందులతో దాదాపు 90 శాతం నుంచి 95 శాతం సక్సెస్‌రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌తో ఫాలోఅప్‌లో ఉండండి. 

మూత్రంలో ఎరుపు కనిపిస్తోంది...? 
మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల కిందట బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్‌ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్‌ నార్మల్‌ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ అని యాంటీబయాటిక్స్‌ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. వారం కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్‌ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు  చేశారు. అవి కూడా నార్మలే. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? ఇలా మాటిమాటికీ  రక్తం ఎందుకు పడుతోంది? దయచేసి సలహా ఇవ్వండి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సా«ధారణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్‌ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్‌లో రక్తం కనబడటానికి గల కొన్ని కారణాలు మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్‌ సెల్‌ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్‌ సమస్యలు. వైరల్‌ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్‌ వ్యాస్క్యులార్‌ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి  ఇమ్యునలాజికల్‌ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు.

అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్‌ పరీక్షలు అవసరమవుతాయి. 
మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్‌ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్‌ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్‌ బేస్‌మెంట్‌ మెంబ్రేన్‌ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి.  

మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు  యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్‌ లెవెల్స్‌ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. 
మీ అబ్బాయికి రొటీన్‌ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి.

ఇన్నిసార్లు కామెర్లా?
మా అబ్బాయికి మూడేళ్లు. గత ఎనిమిది నెలల్లో వాడికి మూడు సార్లు కామెర్లు వచ్చాయి. మాది ఓ మోస్తరు టౌన్‌. మూడుసార్లూ ఇక్కడే డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించాం. గత వారం రోజులుగా మళ్లీ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మా వాడికి ఎందుకు ఇలా జాండీస్‌ పదే పదే వస్తోంది. కొందరు పెద్దలు చెప్పిన మీదట కొన్ని పసరు మందులు కూడా వాడుతున్నాం. మా బాబుకు కామెర్లు మాటిమాటికీ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మాకు సలహా ఇవ్వండి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి దీర్ఘకాలిక కామెర్లు ఉన్నాయని   చెప్పవచ్చు. పసిపిల్లల నుంచి వివిధ వయసుల వారిలో వచ్చే దీర్ఘకాలిక  కామెర్లకు అనేక కారణాలుంటాయి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది. పిల్లల్లో కొన్ని ఎంజైమ్‌ లోపాలు, నాటుమందులు వాడటం, వైరల్‌ హెపటైటిస్, థలసేమియా వంటి రక్తానికి సంబంధించిన జబ్బులు, కాపర్‌ మెటబాలిజమ్‌లో లోపం, కొన్ని ఆటోఇమ్యూన్‌ డిసీజెస్‌ వల్ల కూడా కామెర్లు రావచ్చు. కొన్నిసార్లు  హెపటో బిలియరీ సిస్టమ్‌లోని కొన్ని అనటామికల్‌ (శరీర నిర్మాణపరమైన లోపాలతో వచ్చే) సమస్యల వల్ల కూడా జాండీస్‌ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబు దీర్ఘకాలిక జాండీస్‌కు కారణం ఇదీ అని నిర్ధారణగా చెప్పడం కష్టమే. కాబట్టి మీరు కొన్ని ప్రాథమిక రక్తపరీక్షలు, థైరాయిడ్‌ పరీక్షలు, ఎంజైమ్‌ పరీక్షలు చేయించాలి. దానితో పాటు వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం, ఇతర మెటబాలిక్‌ సమస్యలను కనుగొనేందుకు అవసరమైన పరీక్షలు చేయించడం ప్రధానం.

ఎందుకంటే పైన పేర్కొన్న కొన్ని మెడికల్‌ కండిషన్స్‌కు అవసరమైతే లివర్‌ బయాప్సీ వంటి పరీక్షలు చేసి తక్షణమే తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ లేదా కొన్ని ఆటోఇమ్యూన్‌ సమస్యల కారణంగా వచ్చే కాలేయ వ్యాధులకు పరిష్కారం ఒకింత తేలిక. వాటిని సరైన చికిత్సతో పూర్తిగా విజయవంతంగా పరిష్కరించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్‌ సమస్యల పురోగతిని నియంత్రించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లివర్‌ ఫెయిల్‌ కాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది.  మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అదృష్టవశాత్తు మీ అబ్బాయికి లివర్‌ ఫెయిల్యూర్‌ సూచనలు ఏమీ కనిపించడం లేదు.  కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో తక్షణం మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు పీడియాట్రిక్‌ గాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ నేతృత్వంలో పూర్తి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement