మాధవికీ మహేష్‌కూ పెళ్లయి పదేళ్లయింది. ఎనిమిదేళ్ల పాప ఉంది. మహేష్‌కి లేని అలవాటు లేదు.
మాధవికీ మహేష్‌కూ పెళ్లయి పదేళ్లయింది. ఎనిమిదేళ్ల పాప ఉంది. మహేష్‌కి లేని అలవాటు లేదు. భార్య నగలు కూడా అమ్మి మరీ తన వ్యసనాలను తీర్చుకునేవాడు. మాధవి ఎంత చెప్పినా మహేష్ తన అలవాట్లను మానుకోలేకపోయాడు. మాధవి అది భరించలేక ఓ రోజున పాపతో సహా పుట్టింటికి వెళ్లి, చిన్న ఉద్యోగం చేసుకుని జీవించడం మొదలు పెట్టింది.
ఆ తర్వాత మహేష్ విడాకుల కోసం, పాప కస్టడీ కోసం కోర్టుకు వెళుతున్నట్లు పరిచయస్థుల ద్వారా మాధవికి తెలిసింది. దాంతో ఆమె మహేష్‌కున్న దుర్వ్యసనాలకు, ఆ వ్యసనాల మూలంగా అతనికి సంక్రమించిన వ్యాధులకు సంబంధించిన సాక్ష్యాధారాలను సంపాదించింది. చట్టప్రకారం మైనర్ పిల్లలకు తండ్రే సంరక్షకుడు. ఈ లెక్కన చూస్తే కోర్టు పాప కష్టడీ మహేష్‌కు తప్పకుండా ఇవ్వాలి. అయితే మాధవి సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జిగారు దురలవాట్ల కారణంగా పాపను సంరక్షించే స్థితిలో మహేష్ లే డని, పైగా ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లకు తల్లి సంరక్షణ అవసరమని భావించారు. దాంతో పాప కష్డడీని మాధవికే అప్పగించారు. ఇక విడాకుల విషయానికి వస్తే, మాధవి తనకు భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని కొనసాగించాలని ఉందని వాదించింది. దాంతో జడ్జిగారు మహేష్ వేసిన విడాకుల పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. అది అయిన కొద్దిరోజులకే మహేష్ మితిమీరి మద్యం సేవించడం వల ఓ రోజు హఠాత్తుగా మరణించాడు.
ఈ కేసును బట్టి మనకు ఏమి అర్థం అవుతోందంటే ఎవరూ కూడా దుర్వ్యసనాలకు బానిసలు కాకూడదు, అలా బానిసలయ్యారంటే తమను తాము బలి చేసుకోవడమే కాక, కుటుంబాన్ని కూడా బలి చేసుకున్నట్లే అవుతుంది.