మ్యాట్రిమోసాలు | Don't Trust Matrimony Relation Says Cyber Crime Department | Sakshi
Sakshi News home page

మ్యాట్రిమోసాలు

Published Sat, Feb 22 2020 3:23 AM | Last Updated on Sat, Feb 22 2020 7:19 AM

Don't Trust Matrimony Relation Says Cyber Crime Department - Sakshi

నూరేళ్ల పంటైన పెళ్లి ఫలితం బాగుండాలనుకుంటారంతా. అందుకే అక్కడ ట్రాప్‌ చేస్తే చిక్కేవారు చాలా ఎక్కువ. మరది రెండో పెళ్లి అయితేనో... మరింత డెస్పరేట్‌నెస్‌. సరిగ్గా ఈ ఫీలింగ్స్‌నే అనుకూలంగా మలచుకుంటున్నారు మగాళ్లు. ఫేక్‌ ఐడీలతో, తప్పుడు ప్రొఫైళ్లతో, నకిలీ అర్హతలతో మోసాలకు పాల్పడుతున్నారు. వాటికి ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనీలు వేదికలవుతున్నాయి. ఇలాంటి ఆన్‌లైన్‌ పెళ్లిసంబంధాల నుంచి జాగ్రత్త పడటమెలాగో చెబుతున్నారు నిపుణులు... అప్రమత్తం కండి, మోసపోకండి.

అరవింద్‌ సన్యాల్‌ ఎవరో నిజంగానే తనకు తెలియదు. కాని ఆ ఇన్‌స్పెక్టర్‌ చెప్పిన ట్రాన్సాక్షన్‌ వివరాలు అన్నీ కరెక్టే. బ్యాంక్‌ అకౌంట్, తను పంపిన అమౌంట్, తేదీ కూడా. కాని వ్యక్తిపేరు అదికాదు. తను ఆ డబ్బును పంపింది తన కాబోయే భర్త తన్మయ్‌ చంద్రకు. మూడు నెలల కిందట ఓ పేరున్న మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యాడు. తనలాగే అతనికీ ఇది రెండో పెళ్లి. తను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అతను డాక్టర్‌. మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ చూసి అతనే చాట్‌ చేశాడు. తర్వాత నుంచి ఫోన్‌కాల్స్‌ మొదలయ్యాయి. అతనే చేస్తూండేవాడు. అతని తల్లీ డాక్టరే. పేషంట్లు, ఆపరేషన్లు అంటూ అమ్మ, కాలేజీలు, కాన్ఫరెన్స్‌లు అంటూ తన ప్రొఫెసర్‌ తండ్రి ఎప్పు డూ బిజీగా ఉండడం వల్ల వాళ్లతో మాట్లాడించలేకపోతున్నానని నొచ్చుకునేవాడు. సెమినార్స్‌ అంటూ తాను ఎప్పుడూ ఒక చోట కుదురుగా ఉండనని.. విదేశాలు తిరుగుతూ ఉంటానని.. అందుకే తనూ కలవలేకపోతున్నాడని ఆమెకు సంజాయిషీ ఇచ్చుకునేవాడు.

విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఖరీదైన కానుకలూ పంపాడు. ప్రతిసారి మన పెళ్లయ్యాక... అంటూ ఆమె మనసు దోచుకునేవాడు. ఈ ఆనందంలో మూడు నెలలు గడిచాయి. ఒకరోజు తన ఫ్రెండ్‌కు అర్జెంట్‌గా పదిలక్షలు కావాలని, ప్రస్తుతానికి తన దగ్గర లేవని బాధపడ్డాడు. చలించిపోయిన ఆమె అప్పటికప్పుడు పది లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. తర్వాత మూడు రోజులకు మరో పది లక్షలు కావాలని.. నమ్మకం కోసం తన ఇంటి స్థలానికి సంబంధించిన దస్తావేజులు పంపిస్తాననీ చెప్పాడు. తన ఫ్రెండ్స్‌ను అడిగి ఎలా గోలా సర్దింది. స్నేహితుల నమ్మకం కోసం దస్తావేజులు పంపమని అడిగింది. ‘ఓ యెస్‌..’ అంటూ ఫోన్‌ పెట్టేసిన అతను పదిరోజులైనా ఫోన్‌ చేయలేదు. అయ్యో బాధపడ్డాడేమోననే అపరాధభావంలో కొట్టుకుపోతున్న ఆమెకు పోలీసుల ఫోన్‌కాల్‌ ద్వారా తెలిసింది అరవింద్‌ సన్యాల్‌  చేతిలో తాను మోసపోయినట్టు.

‘మేడం.. కృష్ణ మాధవ్‌ అనే అతను మీ కోసం పదివేల పౌండ్లు పంపాడు. దీనికి ట్యాక్స్‌ పే చేస్తేనే మీకు పంపగలం. అతను మీకు తెలుసా?’ అంటూ మానసకు ఫోన్‌కాల్‌. ‘అయ్యో తెలుసండీ.. అతను నా ఫియాన్స్‌. తాను చెప్పాడు కూడా ఇలా పంపిస్తున్నట్టు. ఎంత కట్టాలి ట్యాక్స్‌?’ అడిగింది అత్రంగా మానస. మూడు లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయమని అకౌంట్‌ నంబర్‌ ఇచ్చారు. చేసింది.  ఏడు రోజులు గడిచినా పదివేల పౌండ్స్‌ లేవు.. కృష్ణమాధవ్‌ ఫోన్‌కాల్‌ లేదు. ఫ్రాడ్‌  అని అర్థమైంది. ఒక ఎమ్‌ఎన్‌సీలో పనిచేస్తోంది మానస. తగిన వరుడి కోసం ఫేమస్‌ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ను నమోదు చేసుకుంది. లండన్‌లో ఉంటున్న కృష్ణ మాధవ్‌ ప్రొఫైల్‌.  చూసి ముచ్చటపడింది. ఫేస్‌బుక్‌లో అతని అకౌంట్‌ చెక్‌ చేసింది. బిజినెస్‌ మ్యాన్‌. హై ప్రొఫైల్‌. పెద్ద బంగ్లా, మూడు నాలుగు కార్లు, వరల్డ్‌ టూర్లు.. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. యాక్సెప్ట్‌ చేశాడు. అంతే! అప్పటి నుంచి అతనే ఆమెను పింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఆ మాటల ప్రవాహానికి... అదిగో అలా మూడు లక్షల ట్రాన్స్‌ఫర్‌తో చెక్‌ పడింది. లండన్‌ కాదుకదా.. కనీసం హైదరాబాద్‌ దాటి వెళ్లలేదు కృష్ణమోహన్‌.

‘నువ్వు చెప్పిందాని ప్రకారం మీ ఇంటి దస్తావేజులు సరిగ్గా లేవు. పైగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా ఎంతో కొంత ఉండొచ్చు కదా’ ఫోన్‌లో చెప్పాడు అతను. ‘ఎంతోకొంత ఏంటి? దాదాపు పాతిక లక్షల దాకా ఉన్నాయి’ చెప్పిందామె ఫోన్‌లో.  ‘కచ్చితంగా మీ నాన్నకు ఇన్‌కమ్‌టాక్స్‌ ప్రాబ్లం రావచ్చు’ అతను. ‘అయ్యో.. ఇప్పుడెలాగా?’ కంగారు పడింది ఆమె.    ‘ఆ.. ఒక పనిచెయ్యొచ్చు’  అన్నాడు. ‘ఏంటీ’ ఆత్రంగా ఆమె. ‘నా ఫ్రెండ్‌ ఉంటాడు ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో. వాడికి ఆ పాతిక లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే.. ప్రాబ్లం సాల్వ్‌ అయ్యాక మళ్లీ వాటిని మీ నాన్నకు పంపేస్తాడు’ అని అతను చెప్పేలోపే ‘ఓకే. మా నాన్నకు చెప్పేస్తా’ అంది. ‘ఆగాగు.. ముందు మా ఫ్రెండ్‌ని ఒప్పించాలి’ అన్నాడు అతను. రెండో రోజు ఫోన్‌ చేసి.. ‘చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది మా ఫ్రెండ్‌ను. వాడి మూడ్‌ చేంజ్‌ కాకముందే వెంటనే ఆ పాతిక లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చెసేయండి’ అంటూ అకౌంట్‌ డిటైల్స్‌ ఇచ్చి ఫోన్‌పెట్టేశాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. అతను ఉడాయించాడు.

ఈ పరిచయమూ మ్యాట్రిమోనీదే. పైనవన్నీ మ్యాట్రిమోనియల్‌ మోసాలు. ఆ నేరస్థులందరి వల ముప్పై నుంచి ముప్పై అయిదులోపు వయసున్న పునర్వివాహ వధువుల పైనే. వాళ్లందరికి ప్లాట్‌ఫామ్‌ ఒకటే.. మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌. ఆ నేరస్థులందరి మోడస్‌ ఆపరెండి ఒకటే.. ఫేక్‌ ప్రొఫైల్‌. అరవింద్‌ సన్యాల్, కృష్ణ మాధవ్, అతను.. ఇంకా అలాంటి వాళ్లెందరో. అవేవీ వాళ్ల అసలు పేర్లు కావు. వాళ్ల వృత్తులూ అవి కావు. పేర్లు, ప్రొఫైళ్లు... కుటుంబ వివరాలు అన్నీ నకిలీవే. వీళ్లంతా మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌లో ఫేక్‌ ప్రొఫైల్‌ ఏర్పాటు చేసుకుని అందులో ఉన్న వధువుల లిస్ట్‌ చూస్తారు. రెండో పెళ్లి వాళ్లను ఎంచుకుంటారు. అదీ ఆస్తి, సంపాదన ఉన్న ఆడవాళ్లనే సుమా. అలా ఎంపిక చేసుకున్నాక మ్యాట్రిమోనిలో ఉన్న తమ నకిలీ ప్రొఫైల్‌తోనే ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంటారు. ఆ అమ్మాయిల ఆసక్తులు, అభిచురుచులకు తగ్గట్టుగా. ఇక అక్కడి నుంచి ప్రేమ, పెళ్లి నాటకం మొదలుపెట్టి.. ఇలా మోసంతో దానికి ఎండ్‌ పలుకుతారు. కొన్నేళ్ల కిందట మొదలైన ఈ ధోరణి కొంతకాలంగా మరీ పెరిగిపోయింది. ఇంకాస్త ముందుకు వెళ్లి .. వాళ్ల ఫోటోలు, వీడియోలనూ వైరల్‌ చేస్తామంటూ బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్స్‌కూ దిగుతున్నారు. ఇలాంటి వారి వలలో పడకుండా ఉండాలంటే సోషల్‌ మీడియాను గుడ్డిగా నమ్మకుండా ఉండాలి ముందు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... 
ఆన్‌లైన్‌ మ్యారేజ్‌ సైట్లలో మీ వివరాలను కొత్త మెయిల్‌ ఐడీతో నమోదు చేసుకోండి. మీ ప్రొఫైల్‌ నచ్చి.. మీతో జీవితం పంచుకోవాలనుకునే వాళ్లెప్పుడూ మిమ్నల్ని తొందరపెట్టరు. మీ స్పేస్‌ను, మీ టైమ్‌ను గౌరవిస్తారు. వీటికి విరుద్ధంగా మీ మీద ఒత్తిడి తెస్తున్నారంటే వాళ్లను అనుమానించాల్సిందే. అలాగే మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఫేస్‌బుక్, ఇతర సోషల్‌మీడియా అకౌంట్లను క్లోజ్‌ చేయడం మంచిది. ఒకవేళ కొనసాగించాలనుకున్నా ఫొటోలతో సహా మీ వ్యక్తిగత వివరాలన్నిటినీ అందులోంచి తొలగించండి. వీలైతే ఆన్‌లైన్‌ సైట్ల పెళ్లి సంబంధాలకు దూరంగా ఉండండి.
– అనిల్‌ రాచమల్ల, ఇంటర్‌నెట్‌ ఎథిక్స్‌ అండ్‌ డిజిటల్‌ వెల్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌.

నేరస్థులకు శిక్షలు?
‘ఐటీ యాక్ట్‌ కిందకు వచ్చే ఈ నేరాలకు శిక్షలు ఉన్నాయి. తన అసలు గుర్తింపుతో కాకుండా మరో వ్యక్తిలా నటించి మోసానికి పాల్పడే ఈ నేరాన్ని ఐటీ యాక్ట్‌ 66 (డి) కింద మోసంగా పరిగణిస్తున్నారు. దీనికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. అలాగే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోనూ దీనికి శిక్షలున్నాయి. ఐపీసీలోని సెక్షన్‌ 416.. దీన్ని వంచన, మోసం కింద పరిగణించి ఐపీసీలోని సెక్షన్‌ 417 ప్రకారం యేడాది పాటు జైలు శిక్షను ఖరారు చేస్తోంది. అలాగే ఐపీసీలోని సెక్షన్‌  418.. దీన్ని విపరీతమైన నేరంగా పరిగణించి అంటే ఒక వ్యక్తి పోలీస్‌ అధికారిగా, ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ వంటి ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా నటించి మోసం చేసినందుకు ఐపీసీలోని  సెక్షన్‌ 419 ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, జరిమానాను విధిస్తోంది. వీటన్నిటితోపాటు చీటింగ్‌ పేరుతో ఐపీసీలోని సెక్షన్‌ 420 కిందా కేసు నమోదు చేయొచ్చు. అంతేకాకుండా.. ఈ మోసాలు జరగడానికి తావిచ్చిన ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లయిన మ్యాట్రిమోనియల్‌ పోర్టల్స్‌కూ ఐటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 79 (3) ప్రకారం శిక్ష పడుతుంది. ఒకవేళ ఇలా మోసం చేసి అవతలి వ్యక్తి పెళ్లి చేసుకుంటే .. పెళ్లయిన యేడాదిలోపు ఆ అమ్మాయిలకు   అనల్‌మెంట్‌ ఆఫ్‌ మ్యారేజ్‌ అంటే తమ వివాహాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది చట్టం. 
– ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్‌.

దీనికి విరుగుడు ఏంటి? 
‘మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌లో వ్యక్తిగత వివరాలను పూర్తిగా ఇవ్వకూడదు. అలాగే తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు ఇవ్వాలి. అవతలి వ్యక్తి వివరాలను కూడా జాగ్రత్తగా చూడాలి. వరుడి వైపు నుంచి కూడా అతని తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్లు ఉంటేనే సంప్రదించాలి. ఇప్పుడు నేరుగా వరుడిగా అవతారమెత్తిన వ్యక్తి మోసానికి పాల్పడడం లేదు. డబ్బు లావాదేవీల కోసం మధ్యవర్తులను పెట్టుకుంటున్నారు. ఆ మధ్యవర్తులకు కమీషన్‌ ఆశ చూసి వాళ్ల అకౌంట్లోకి డబ్బులు వేయిస్తున్నారు. దాంతో అసలు నేరస్థులు దొరకడం లేదు. మోసం చేసిన వెంటనే అన్నీ మార్చేస్తారు నంబర్ల నుంచి స్థావరాల దాక. సాధారణంగా దీని వెనక నైజీరియన్లు, ఇతర ఆఫ్రికన్‌ దేశాల వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో కూడా వివరాలను, ఫొటోలను పోస్ట్‌ చేయకూడదు. అమ్మాయిలు, అమ్మాయి తరపు వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
– కేవీఎమ్‌ ప్రసాద్, ఏసీపీ (సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్, తెలంగాణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement