ప్రాణాలను కాపాడే శక్తి డాక్టర్ల చేతిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ శక్తి అందరి చేతుల్లోకి వచ్చింది.కరోనా మీద పోరాటం డాక్టర్లుగా మాకు పెద్ద చాలెంజ్. ఈ చాలెంజ్‌లో మమ్మల్ని గెలిపించగలిగింది మీరే. బాధ్యతాయుతమైన పౌరులని నిరూపించుకోండి. స్నేహితులకు చెప్పండి... ఇంట్లో వాళ్లకు చెప్పండి. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పండి. మనల్ని మనం కాపాడుకుందాం. మన తోటి వారిని కాపాడుదాం.
ఇది ఒక డాక్టర్ చేస్తున్న విన్నపం. డాక్టర్ అపూర్వ చేస్తున్న అపూర్వమైన విన్నపం.
డాక్టర్ అపూర్వ చేసిన మూడున్నర నిమిషాల వీడియో పది రోజులుగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తోంది. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ నేపథ్యంలో రూపొందించిన వీడియోను ఫేస్‌బుక్‌లో లక్షమందికి పైగా వీక్షించారు. యూట్యూబ్‌లో ఇరవై గంటల్లో నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి. జనమంతా ఇంత ఘనం చూడడానికి అందులో ఏముంది? అంటే... కరోనా గురించిన పూర్వాపరాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయి. వాట్సాప్ యూనివర్సిటీ వెదజల్లుతున్న సొంత పరిజ్ఞానాన్ని, ఇతర సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేక్ న్యూస్ సునామీని అదుపు చేయడం కోసమే ఆ వీడియో చేశానన్నారు గైనకాలజీ, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ అపూర్వ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్‌ల సందేహాలకు సమాధానాలే తన వీడియోలని చెప్పారు అపూర్వ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్‌లకయితే ఒక్కొక్కరికీ ఓపిగ్గా ఆద్యంతం వివరించడం సాధ్యమవుతోంది. తరచూ డాక్టర్ దగ్గరకు రాలేని గర్భిణులు మనదేశంలో చాలా మంది ఉన్నారు.
వాళ్లకు అందుబాటులో ఉన్న డాక్టర్లకు ఈ మహిళల సందేహాలన్నింటికీ సమాధానం చెప్పే సమయం, సహనం ఉన్నాయో లేదో కూడా అనుమానమే. అందుకే తానే వాళ్లందరి దగ్గరకు వెళ్లాలనుకున్నారు డాక్టర్ అపూర్వ. కాలనీకు వెళ్లి, గర్భిణుల కోసం అవగాహన సదస్సులు పెట్టి స్వయంగా మాట్లాడవచ్చు. ఇప్పుడా పరిస్థితి లేదు, అంత సమయమూ లేదు. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నారు. ఆ వీడియోల్లో ఆమె కరోనా మొదట ఎలా బయటపడింది అనే వివరాల నుంచి, ఎలా విస్తరించింది, ప్రభుత్వాలు కట్టడి చేసినప్పుడు ఎంత అదుపులో ఉండింది? దక్షిణ కొరియా మహిళ బాధ్యతరాహిత్యం వల్ల ఎంత మందికి ఎంత త్వరగా వ్యాధి వ్యాప్తి చెందిందనే వివరాలతోపాటు, వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐసోలేషన్ ఆవశ్యకత, ఈ విపత్కాలంలో ఇంట్లోనే ఉండడాన్ని మించిన మంచిపని మరొకటి లేదనే సూచనలతో ‘స్టే హోమ్... బీ సేఫ్’ అనే సందేశంతో ముగుస్తుందీ వీడియో. చివరగా మలయాళం, తమిళ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో డాక్టర్‌ల సూచనలు కూడా ఉన్నాయి. ఆమె సేవలకు డబ్లు్యహెచ్‌వో ‘రికార్డ్ ఆఫ్ అచీవ్‌మెంట్’ సర్టిఫికేట్ ప్రదానం చేసింది.
నెలలు నిండక ముందే ప్రసవం
‘‘కరోనా తొలిదశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి గర్భిణులకు సోకదనే అనుకున్నారు. కానీ విదేశాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారక వైరస్ స్వరూపం మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా వీడియోలు చేస్తున్నాను. గర్భిణులకు వ్యాధి సోకితే ప్రీ టర్మ్ డెలివరీలయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ ప్రైవేట్ హాస్పిటళ్లు మాత్రం ముందస్తు డెలివరీలను దృష్టిలో పెట్టుకుని బెడ్‌లను సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. ఒక కరోనా పాజిటివ్ పేషెంట్‌ను పరీక్షించిన డాక్టర్, ఇతర పారా మెడికల్ స్టాఫ్ ఇతర రోగులను పరీక్షించకుండా ఉండేటట్లు మా డాక్టర్లం కూడా కేటగిరైజ్ చేసుకుని పని చేస్తున్నాం. పాజిటివ్ పేషెంట్‌లను చూసిన మెడికల్ టీమ్ ఒక వారం డ్యూటీ చేసి, రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంటోంది. ఈ డిసీజ్‌కి సరిహద్దుల్లేవు, మన జాగ్రత్తలతోనే దీనికి అడ్డుకట్ట వేయాలి’’ అని డాక్టర్‌లుగా తాము కరోనా వ్యాధిని ఎదుర్కొంటున్న తీరును వివరించారామె.
వీడియో సందేశం
కరోనా వీడియోని మొదట ఇంగ్లిష్ వెర్షన్ చేశాను. అది చూసి మా అమ్మ ‘తెలుగమ్మాయివై ఉండి, తెలుగు వాళ్లను ఎడ్యుకేట్ చేయకుండా ప్రపంచమంతటినీ ఎడ్యుకేట్ చేస్తావా? తెలుగులో కూడా చెయ్యి’ అన్నారు. ఆ మాటతో నాకు మనసులో ఏదో గుచ్చుకున్నట్లయింది. వెంటనే తెలుగులో స్క్రిప్టు రాసుకుని తెలుగులో షూట్ చేశాను. మా అమ్మ ఆ మాట అన్న మూడు గంటల్లో తెలుగు వెర్షన్ చేసి అమ్మకి చూపించాను. ఆశ్చర్యం ఏమింటే... ఇంగ్లిష్ వెర్షన్ ఎంత వేగంగా విస్తరించిందో, అంతే వేగంగా తెలుగు వెర్షన్ కూడా విస్తరించింది. సింగపూర్, యూఎస్‌లో ఉన్న తెలుగు వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘స్వయంగా డాక్టర్ మాటల్లోనే వినడంతో మాకు ధైర్యంగా ఉంది. మీరు చెప్పినట్లు వ్యాధి అదుపులోకి వచ్చే వరకు ఇంట్లోనే ఉంటాం’ అని హామీ కూడా ఇస్తున్నారు.
– డాక్టర్ అపూర్వ పల్లంరెడ్డి, ఫీనిక్స్ క్లినిక్, బెంగళూరు
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment