ఇట్లు పూరి జగన్నాథ్ | drugs case : puri jagannath exclusive interview | Sakshi
Sakshi News home page

ఇట్లు పూరి జగన్నాథ్

Published Fri, Jul 21 2017 12:04 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

ఇట్లు పూరి జగన్నాథ్ - Sakshi

ఇట్లు పూరి జగన్నాథ్

‘‘మా అమ్మ అంత ఈజీగా డీలా పడదు. అలాంటిది ‘ఏంటిరా ఇది...’ అని నేను గురువారం పొద్దున ఫోన్‌ చేయగానే బేలగా అడిగింది. సిట్‌ విచారణ లో ఉండటం వల్ల బుధవారం ఆవిడకి ఫోన్‌ చేయలేదు. నేను ఫోన్‌ చేశాక, అసలేం మాట్లాడకుండా ఏడవటం మొదలు పెట్టింది. కాసేపటికి తేరుకుని టీవీ చూస్తూ కూర్చున్నానని, చాలా బాధ అనిపించిందని చెప్పింది. అమ్మ అంత డీలా పడిపోవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. సరే.. నేనంటే తట్టుకున్నాను. కానీ, ఇంట్లోవాళ్లు ఎలా తట్టుకుంటారు?’’ అంటున్న పూరి జగన్నాథ్‌కు గొంతు పెగల లేదు. కాసేపు నిశ్శబ్దం తర్వాత ‘సాక్షి’తో పూరి స్పెషల్‌ టాక్‌...

జరిగిన సంఘటన మీకు పెద్ద షాక్‌...
అవును.. నాకూ, నాక్కావల్సినవాళ్లందరికీ షాకే. లైఫ్‌లో ఇలాంటి టర్న్‌ ఉంటుందని ఊహించలేదు. ఇలా అవుతుందనీ.. ఇంత న్యూసెన్స్‌ అవుతుందనీ అనుకోలేదు. నాకే కాదు. నా ఫ్యామిలీకి, నా సన్నిహితులకీ కూడా ఇబ్బందే.
     
షాక్, బాధ సమానంగా ఉండి ఉంటాయి?
చాలా బాధగా అనిపించింది. మనం ఏంటి? మనం చేస్తున్న పనేంటి? మన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఈ నిందలు ఏంటి? అని ఆలోచనలో పడ్డాను. నిజానికి నా లైఫ్‌లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. అందుకని తట్టుకోగలుగుతున్నాను. కానీ మా అమ్మ, వైఫ్, పిల్లలు, నా తమ్ముళ్లు.. వీళ్లంతా షేక్‌ అయిపోయారు.
     
నిజం, అబద్ధం.. ఈ రెండిటినీ పక్కన పెడితే డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిగా ఆరోపణలో ఉన్న అతను మీతో పాటు కొన్ని ఫొటోల్లో కనిపించాడట..
వందల మంది నాతో ఫొటోలు దిగుతుంటారు. నా షూటింగ్‌ స్పాట్‌కి వస్తుంటారు. ఫొటో దిగాలంటారు. లేకపోతే నేను బయట ఎక్కడైనా కనిపిస్తే ఫొటోలు దిగుతామంటూ రిక్వెస్ట్‌ చేస్తారు. నేనెవర్నీ కాదనను. ఫొటో దిగేటప్పుడు దాదాపు వాళ్ల భుజం మీద చేయి వేసి దిగటం అలవాటు. నా ఫొటోలు చూస్తే ఎవరితో అయినా నేను క్లోజ్‌గా ఉన్నట్లుగానే ఉంటాయి. వాటిని చూసి అవే ఆధారాలు అనుకుంటారేమో. ‘పోకిరి’ సినిమాలో ‘నేను దొరికితే.. చిరంజీవితో ఫొటో ఉంది. రజనీకాంత్‌తో ఫొటో ఉంది. అమితాబ్‌తో ఫొటో ఉంది. అవి చూపిస్తా... వారికి నాతో లింక్‌ ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు పదేళ్లు పడుతుంది. ఏం పీకుతార్రా’ అనే డైలాగ్‌ రాశా. ఆ డైలాగ్‌ నా మీదే వచ్చింది. నా సినిమాల్లో ఎక్కువగా పోలీసాఫీసర్లను హీరోలుగా చూపించా.. శివమణి, పోకిరి, గోలీమార్, టెంపర్, ఇలా అన్నీ డిపార్ట్‌మెంట్‌ని హైలైట్‌ చేస్తూ తీసిన సినిమాలే. అయినా చెప్పాల్సినవన్నీ నేను అధికారులకు చెప్పాను.

మీ సినిమాల్లో మాఫియా, డ్రగ్స్‌ ఎక్కువగా చూపిస్తారు.. మీరు రియల్‌గా వాటి పట్ల ఆకర్షితులు కావడంవల్లే రీల్‌ మీద చూపిస్తున్నారన్నది కొందరి ఒపీనియన్‌...
మాఫియా బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు తీసినంత మాత్రాన నాకు మాఫియాతో సంబంధం ఉన్నట్లు కాదు. సినిమాల్లో విలన్లు పూజలు చేస్తున్నట్లు చూపించలేం. క్లబ్‌లో తాగుతూనో, మర్డర్‌ చేస్తున్నట్లో చూపించాల్సి వస్తుంది. అప్పుడే ప్రేక్షకులు చూస్తారు. హీరోలాగే విలన్‌ కూడా గుడికి వెళ్లి పూజలు, భజనలు చేస్తే చూడ్డానికి బాగుంటుందా?
   
‘సిట్‌’ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) ప్రశ్నించిన తీరు ఎలా ఉంది?
వాళ్లు చాలా డీసెంట్‌గా అడిగారు. నేనూ సమాధానాలు చెప్పాను. ఒక ఇష్యూ గురించి ఇంటరాగేషన్‌ జరుగుతున్నప్పుడు దాని గురించి ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇవ్వకూడదు. ఆ విషయాలు బయటకు చెప్పకూడదు. అందుకే ఈ విషయాల గురించి ఇప్పుడు నేనెక్కువగా మాట్లాడలేను.

కొందరు ఆరోపిస్తున్నట్లు నిజంగా డ్రగ్స్‌కి ఎడిక్ట్‌ అయ్యారా?
నాకు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లల్లో డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లు అంతగా పబ్‌లకు వెళ్లరు. నేను కూడా గత నాలుగేళ్ళలో మూడు నాలుగు సార్లు మాత్రమే వెళ్లాను. అసలు పబ్‌కి వెళ్లే టైమ్‌ నాకు ఉండదు. నా తోటి డైరెక్టర్లు ఒక సినిమా చేసేలోపు నేను మూడు సినిమాలు చేస్తుంటాను. ఐదారు గంటలకన్నా ఎక్కువగా పడుకోను. ఎందుకంటే నాకు నిద్రపోయే టైమ్‌ ఉండదు. ఒకవేళ నేను డ్రగ్స్‌కి ఎడిక్ట్‌ అయ్యుంటే ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతాను? స్టోరీ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్‌–డైరెక్షన్‌–ప్రొడక్షన్‌ అన్నీ నేనే. లైఫ్‌లో చాలా జరుగుతుంటాయి. సమాజం ఒక వ్యక్తి మీద దొంగ అని ముద్ర వేస్తే.. అదే నిజమనుకుంటారు. హీరో అని అంటే.. ఆ ఇమేజే పడుతుంది. నిజాలు నిలకడగా తెలుస్తాయి.

3,000 మంది స్కూల్‌ పిల్లల్లో కొందరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారని, కొందరు అమ్ముతున్నారని వచ్చిన వార్త పెద్ద షాక్‌. సమాజం ఎటు వెళుతోందో? దీని గురించి మీరేమంటారు?
ఏడేళ్ల క్రితం నా ఆఫీసుకి ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో పదో తరగతి పిల్లలు కొంతమంది మీ ఫ్యాన్స్‌ అంటూ వచ్చారు. ఫొటోలు దిగుతామన్నారు. సరేనన్నా. వచ్చీ రాగానే ఒక్కొక్కరూ బాటిల్స్‌ మీద బాటిల్స్‌ మంచి నీళ్లు తాగారు. ఇలా తాగుతున్నారేంటి? అని ఆశ్చర్యపోయాను. ఇలా కూర్చోండి అనేలోపే వాళ్లు సోఫాలో పడిపోయారు. జనరల్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లెవరైనా.. వాళ్లు డ్రగ్స్‌ తీసుకున్న విషయాన్ని ఊహించేస్తారు. ఆ పిల్లలెవరో, ఏ స్కూల్‌కి చెందినవాళ్లో నాకు తెలియదు. తెలిసిన పోలీసాఫీసర్‌కి విషయం చెప్పి, షూటింగ్‌ ఉండటంతో వాళ్లకేం కావాలో చూడమని మా ఆఫీస్‌ స్టాఫ్‌కి చెప్పి వెళ్లిపోయాను. సాయంత్రం నాలుగున్నరకి వాళ్లు లేచి, వెళ్లిపోయారని మా స్టాప్‌లో ఒకతను ఫోన్‌ చేసి, చెప్పాడు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్లేం చేస్తున్నారో గమనించాలి. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. చదువుకుని, పైకి రావాల్సిన పిల్లలు ఇలా పాడైపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? వాళ్లనే కాదు.. మన పిల్లలు కాకపోయినా మనకూ బాధగానే ఉంటుంది.

మీ పిల్లలు పవిత్ర, ఆకాష్‌ల గురించి మీరు చాలా కేర్‌ తీసుకుంటారా?
మా పిల్లలను మా ఆవిడ చాలా పద్ధతిగా పెంచింది. చాలామంది మీ పిల్లల ప్రవర్తన బాగుంటుందని అంటుంటారు. వాళ్లు తప్పుడు దారిలో లేరు. నా పిల్లలు కన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లల్లో కొందరు పెడదారి పడుతున్నారు. ఆ పిల్లలది తప్పనడం లేదు. వారికి ఎవరో అలవాటు చేసి, పెడదారి పట్టిస్తున్నారు. అలాంటివాళ్ల బారిన పడకుండా కాపాడుకోవాలి.

మీరు డ్రగ్స్‌ సప్లై చేస్తారనే స్టోరీలు రెండు మూడు రోజులుగా టీవీ చానల్స్‌లో వస్తున్నాయి.. ఏమంటారు?
‘సిట్‌’కు అందిన సమాచారం మేరకు నన్ను పిలిచారు. నేను వెళ్లి వారిని కలిసేలోపు .. నేను నిజంగా డ్రగ్స్‌ అమ్ముతున్నానని ఒకరు, ఢిల్లీలో వ్యభిచార గృహం నడుపుతున్నానని మరొకరు, థాయిలాండ్‌లో వ్యభిచారం మేనేజ్‌మెంట్‌లో దొరికిపోతే నా పాస్‌పోర్ట్‌లు సీజ్‌ చేశారని మరొకరు.. ఇలా రకరకాల స్టోరీలు. నాకర్థం కాని విషయం ఏంటంటే డైరెక్టర్‌గా నేను కోట్లు సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేసి, సంపాదించాల్సిన అవసరం నాకేంటి?

∙పోనీ మీకు శత్రువులెవరైనా ఉన్నారా? వాళ్లే పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారంటారా?
‘నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా’ అని సిట్‌ అధికారులు కూడా అడిగారు. నాకు తెలిసి నాకెవరూ లేరు. తెలియని శత్రువులు టార్గెట్‌ చేశారేమో. నా గురించి నేను ఆలోచించుకోవడానికే నాకు టైమ్‌ లేదు.

మీరు బ్యాంకాక్‌ ఎక్కువగా వెళుతుంటారు కదా.. చేయకూడని పనులు చేయడానికే అక్కడికి వెళుతున్నారన్నది కొందరి ఊహ...
అవును. అసలు విషయం తెలియనివాళ్లు అలానే అనుకుంటారు. బ్యాంకాక్‌ బీచ్‌లో మార్నింగ్‌ టు ఈవినింగ్‌ కూర్చుని, ఎంతో ఫోకస్‌ చేస్తే కానీ, ఆరు నెలల్లో చేసే పని (స్క్రిప్ట్, డైలాగ్స్‌ రాయడం)ని నేను 15 రోజుల్లో చేయలేను మరి. నాకు తెలిసి ఇండియాలో ఉంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్‌ కలుస్తుంటారు. సినిమాల డిస్కషన్‌ అంటూ వస్తుంటారు. ఫుల్‌గా కాన్‌సన్‌ట్రేట్‌ చేయడానికి కుదరదు. ఇదంతా తెలియక నేను బ్యాంకాక్‌కి వెళుతున్నానంటే అందరికీ ఎంజాయ్‌మెంట్‌ గుర్తొస్తుంది. మసాజుల కోసమే వెళతాననుకుంటారు. నాకు పదిహేనేళ్లుగా ఒకే ఆవిడ మసాజ్‌ చేస్తున్నారు. ఆవిడ వయసు 55 ఏళ్లు. బ్యాంకాక్‌కి నేను ఒంటరిగా వెళ్లను. ఆల్మోస్ట్‌ నా ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తుంటారు. ఆవిడ నా ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చాలా క్లోజ్‌.

బ్యాంకాక్‌ వెళ్లడం నెగటివ్‌ ప్రచారానికి దారి తీస్తుందని ఎప్పుడైనా ఊహించారా?
లేదు. ఎదుటి వ్యక్తి చూసే కళ్లను బట్టే ఏదైనా ఉంటుంది. మనల్ని కరెక్ట్‌గా చూస్తే.. కరెక్ట్‌గా, చెడుగా చూస్తే అలానే కనిపిస్తాం. ఫర్‌ ఎగ్జాంపుల్‌.. నేను బ్యాంకాక్‌కి వెళ్లిన ప్రతిసారీ ఓ పోలీసాఫీసర్‌ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి, నన్ను రిసీవ్‌ చేసుకుంటారు. ఆవిడకు ఫార్టీ ఇయర్స్‌ పైనే ఉంటాయి. లావుగా ఉంటారు. ఎప్పుడూ యూనిఫామ్‌లో వచ్చేవారు. ఓసారి మాత్రం మామూలు డ్రెస్‌లో వచ్చారు. నేను ల్యాండ్‌ అవ్వగానే, ‘హాయ్‌ పూరీ..’ అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, రిసీవ్‌ చేసుకున్నారు. అక్కడే ఉన్న వ్యక్తి ‘పూరీగారూ.. మీ టేస్ట్‌ బాగాలేదు. అమ్మాయిని మార్చేయండి’ అన్నాడు. అంటే.. ఆ వ్యక్తి ఊహ వేరే విధంగా ఉంది. నిజానికి ఆవిడ నాతో ఆత్మీయంగా ఉంటారు. నాకూ వేరే దృష్టి లేదు. కానీ, ఆ వ్యక్తి చెడుగా ఊహించుకున్నాడు. ఏం చేయగలుగుతాం.

ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్‌ లేకుండా కష్టపడి ఓ ఇమేజ్‌ తెచ్చుకున్నారు.. ఆ ఇమేజ్‌ ఏమైనా డౌన్‌ అయినట్లు అనిపిస్తోందా?
ఇమేజ్‌ డౌన్‌ అవుతుందా? అని ఆలోచించలేదు. ఎవరూ లేకుండా ఇండస్ట్రీలో కష్టాలు పడినప్పుడు, ఆ తర్వాత పైకి ఎదిగి, ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు... ఇలా జీవితంలో చాలా అప్‌ అండ్‌ డౌన్స్‌ చూశాను. ఇది కూడా ఓ డౌన్‌ ఫాల్‌. జీవితంలో ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లిపోవాలంతే.

మీ ఫోన్‌ నుంచి ఒకే వ్యక్తికి 180 కాల్స్‌ వెళ్లాయట. నిజమా?
నా కాల్‌ లిస్ట్‌ చూస్తే తెలుస్తుంది. బేసిక్‌గా నాకు తెలియని నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే, నేను తీయను. ఒకవేళ వాళ్లు మేం ఫలానా అని మెసేజ్‌ పెడితే, ఫోన్‌ చేసి మాట్లాడతాను. ఫోన్‌లో నా ఫేవరెట్‌ నంబర్స్‌ 20 మాత్రమే ఉంటాయి. అందులో నా ఫ్యామిలీ మెంబర్స్, నేను అప్పుడు సినిమా చేసే టీమ్‌ నంబర్స్‌ మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ట్రై చేసినా మిస్డ్‌ కాల్‌ ఉంటుంది. నాకు తెలియనివాళ్లు చేస్తే నేను తీయను.

డ్రగ్స్‌ తీసుకునేవాళ్లల్లో పొలిటీషియన్స్, బిజినెస్‌మేన్లూ ఉండి ఉండొచ్చేమో.. కానీ, íఫిల్మ్‌ ఇండస్ట్రీ టార్గెట్‌ అయ్యిందేమో అనిపిస్తోంది.. దీనివల్ల ఇండస్ట్రీ ఇమేజ్‌ దెబ్బతినే చాన్స్‌ ఉంది కదా..
మిగతావాళ్లు ఉన్నారా? లేదా? అనేది పక్కన పెట్టేద్దాం. జనరల్‌గా అన్ని ఇమేజ్‌లూ సినిమా ఇండస్ట్రీ మీదే పడతాయి. మంచైనా.. చెడైనా... ఏదైనా సినిమా ఇండస్ట్రీకి ఆపాదించేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఓ క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఈజీగా ఇక్కడివాళ్ల గురించి మాట్లాడేస్తారు. ఇండియాలో జింకను కాల్చింది ఎవరంటే సల్మాన్‌ ఖాన్‌ అని చెప్పేస్తారు. కానీ, ఈ సంఘటన తర్వాత చాలా జింకలు చనిపోయి ఉండొచ్చు. అయితే, వాటి గురించి ఎవరూ మాట్లాడరు. సినిమావాళ్లే హైలైట్‌ అవుతుంటారు.

సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుంది. అందుకని సినిమా ఇండస్ట్రీవాళ్లు బాధ్యతగా ఉండాలి కదా?
అవును. సినిమాల ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఫ్యాన్స్‌ సెలబ్రిటీలను ఫాలో అవుతారు. వాళ్ళ మాటలను సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే సినిమావాళ్లు ఆచితూచి మాట్లాడాలని నా ఒపీనియన్‌.

ఇక మీద మీరు సినిమాలు తీసే ధోరణి మారుతుందా?
లేదు. ఏం మారాలి? మీ జీవితంలో జరిగిన సంఘటనలతో సినిమా తీస్తారా? అనడిగితే... ఈ సంఘటనలు అని కాదు. ఇలాంటివి వంద సమస్యలతో ‘జనగణమణ’ అనే స్క్రిప్ట్‌ తయారు చేస్తున్నా. దేశం మీద అభిమానం, ప్రేమ ఉండబట్టే ఈ కథ రాస్తున్నా. ‘జనగణమణ’ నా లైఫ్‌ యాంబిషన్‌. ఎవరైతే నాపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్లందరూ ఈ స్క్రిప్ట్‌ రాయలేరు. ఈ సినిమా నేను తీస్తాను. ప్రేక్షకులు చూస్తారు. ‘ఐ లవ్‌ ఇండియా... ఐ హేట్‌ ఇండియన్స్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఇలా ఎందుకు పెట్టాననేది సినిమా చూస్తే అర్థమవుతుంది.

అనుకోని ఈ సంఘటన తర్వాత ఇప్పటివరకూ మీతో క్లోజ్‌గా ఉన్న మీ ఫ్రెండ్స్‌ మాట్లాడుతున్నారా? లేదా?
అందరూ మాట్లాడుతున్నారు. అధికారులు నన్ను విచారిస్తున్నప్పుడు బాలకృష్ణగారు నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోన్‌ చేసి, ధైర్యం చెప్పారు. అంత పెద్ద హీరోకి అవసరం లేదు. కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ బాధపడతారని ఆయన ఊహించి, మావాళ్లతో మాట్లాడారు. ఇంకా మోహన్‌బాబుగారు ‘వియ్‌ లవ్‌ యు. నీకేం కాదు’ అనీ, సురేశ్‌బాబుగారు ‘యు ఆర్‌ రెబల్‌. బీ స్ట్రాంగ్‌’ అనీ, ప్రభాస్‌ ‘డార్లింగ్‌.. ఏంటి మనకీ కష్టాలు. ధైర్యంగా ఉండు’ అనీ అన్నారు. వరుణ్‌ తేజ్‌ కూడా పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యాడు. చాలామంది జర్నలిస్టులు మెసేజ్‌లు పెట్టారు.
     
మీ భార్య లావణ్య ఫీలింగ్‌?
నా వైఫ్‌ ఏడుస్తూనే ఉంది. ఆరేడు రోజులుగా నా గురించి ఒకటే న్యూసులు కదా. టీవీల్లో వస్తున్న ఆ న్యూస్‌లు చూసి, ఫోన్‌ చేసేది. నేనేమో షూటింగ్‌లో బిజీగా ఉండేవాణ్ణి. ‘నువ్వు అర్జంటుగా టీవీ ఆఫ్‌ చెయ్‌’ అనేవాణ్ణి. అయినా టీవీ ఆఫ్‌ చేయకుండా న్యూస్‌ చూడటం, అప్పుడప్పుడూ ఫోన్‌ చేయడం. నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య, కొడుకు ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ కూర్చోవడం చూసి, చాలా బాధపడ్డాను. ఇద్దరి కళ్లూ ఎర్రబడిపోయాయి. బుధవారం ‘సిట్‌’ విచారణకు వెళ్లినప్పుడు నాతో పాటు నా తమ్ముడు సాయి, నా కొడుకు ఆకాష్‌ కూడా వచ్చారు. నా వైఫ్‌ అయితే ఇంట్లో పూజలు చేస్తూ కూర్చుంది. ఫ్యామిలీ వైజ్‌గా ‘ఐయామ్‌ బ్లెస్డ్‌’. ఫ్యాన్స్‌ గురించి కూడా చెప్పాలి. విచారణలో ఉన్నప్పుడు గేట్‌ దగ్గరే ఫ్యాన్స్‌ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నారు. వాళ్లు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను.  కొందరు సోషల్‌ మీడియాలో కూడా నాకు మద్దతు తెలిపారు. ఆ పోస్ట్‌లన్నింటినీ నేను చదివాను. చాలా సంతోషంగా అనిపించింది. నన్ను సపోర్ట్‌ చేసిన అభిమానులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక అమ్మాయి అయితే సోషల్‌ మీడియాలో ‘నువ్వు డ్రగ్స్‌ వాడినా ఫర్వాలేదు.. ఐ లవ్‌ యు’ అని మెసేజ్‌ పెట్టింది. ఇంకా చాలామంది ఫ్యాన్స్‌ ‘పూరీ అన్నయ్యా.. చాలా బాధగా ఉంది’ అని స్పందించడం చూసి, ‘ఐయామ్‌ బ్లెస్డ్‌’ అనిపించింది.


మీ అమ్మాయి పవిత్ర ‘ఫేస్‌బుక్‌’లో కొంచెం ఘాటుగానే స్పందించింది..
నేను ప్రస్తుతం తీస్తున్న ‘పైసా వసూల్‌’ కి తను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తోంది. ఈ షూటింగ్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లినా, చెన్నై వెళ్లినా.. ఇంకెక్కడికి వెళ్లినా తను నాతో పాటే ఉంటుంది. నేను డ్రగ్స్‌ తీసుకుంటున్నానా? లేదా అనేది తనకు బాగా తెలుసు. లేని విషయం గురించి ఆరోపిస్తున్నారు కాబట్టే, బాధ పడింది. అందుకే ‘ఫేస్‌బుక్‌’లో అలా రియాక్ట్‌ అయింది. నాక్కూడా తను చెప్పలేదు. పోస్ట్‌ చేసిన తర్వాత నేను చూశా.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement