
ప్రతి కుక్కకూ ఓ డిగ్రీ వస్తుంది...
సమ్‌థింగ్ స్పెషల్
ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనేది పాత సామెత. ప్రతి కుక్కకూ ఓ డిగ్రీ వస్తుందనేది సరికొత్త సామెత. కుక్కలకు డిగ్రీలా..? అని నోరెళ్లబెట్టకండి. ఔను! అదే ఆ యూనివర్సిటీ స్పెషాలిటీ. మనుషులకే కాదు, ఫీజు కట్టి కోర్సులో చేరితే జంతువులకు, పక్షులకు... వీలుంటే, క్రిమికీటకాదులకు కూడా ఎడా పెడా డిగ్రీలు ఇచ్చేస్తుంది. ఏదా వర్సిటీ.. ఏమా కథ.. అనుకుంటున్నారా..? అక్కడికే వచ్చేద్దాం.
ఇంత ధారాళంగా డిగ్రీలు ఇచ్చే ఆ మహత్తర మహిమాన్విత విశ్వవిద్యాలయ నామధేయం అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. చదువులేని వాళ్లమని దిగులు చెందేవారికి ఊరటనివ్వాలనే సదుద్దేశంతో 1984లో లండన్ నగరంలో వెలసింది. తొలుత ఇది ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పేరిట దూర విద్యా కేంద్రంగా ప్రారంభమైంది. డిగ్రీల వితరణలో కొంత ముదిరిన తర్వాత ‘అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్’గా పేరు మార్చుకుని, పని వేగాన్ని పెంచింది. బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, సౌదీ అరేబియాకూ శాఖను విస్తరించింది.
ఫీజు కట్టేస్తే చాలు, చదివినా.. చదవకున్నా.. చివరకు పరీక్షకు హాజరు కాకున్నా డిగ్రీల ప్రదానమే లక్ష్యంగా పెట్టుకుని ఆ విధంగా ముందుకుపోవడం ప్రారంభించింది. డిగ్రీల వితరణలో ఘనత వహించిన ఈ వర్సిటీ ఔదార్యానికి తెగ ముచ్చటపడిన ప్రముఖ న్యూస్ చానల్ ఒక ప్రయోగం చేసింది. ఒక జాగిలం పేరిట ఎంబీఏ డిగ్రీ కోసం తొలుత 50 పౌండ్లు (సుమారు రూ. 5 వేలు) దరఖాస్తు ఫీజు చెల్లించింది. జాగిలం గారి దరఖాస్తును స్వీకరించినట్లు వర్సిటీ నుంచి ప్రత్యుత్తరం రావడంతో, కోర్సు ఫీజుగా 4500 పౌండ్లు (సుమారు రూ.4.50 లక్షలు) కట్టింది. ఫీజు ముట్టిన కొద్దిరోజులకే ఈ వర్సిటీ జాగిలం గారి పేరిట ఎంబీఏ డిగ్రీని నిక్షేపంగా కొరియర్‌లో పంపింది.