ఎక్‌మోర్ లైఫ్
గుండె ఆగిపోయినా ఊపిరితిత్తులు పనిచేయకపోయినా ప్రాణాల్ని నిలబెట్టే మెషీన్ మోర్ లైఫ్ ఇచ్చే ట్రీట్‌మెంట్ ‘ఎక్‌మో’
గుప్పెడంత గుండె చేసే సంక్లిష్టమైన పనులను, ఊపిరితిత్తుల పనిని ఎక్‌మో మెషీన్ చేస్తుంది. దీని సహాయంతో దేహంలోని భాగాలన్నింటికీ ఆక్సిజెన్, రక్తం సరఫరా అవుతుండడంతో ఆయా భాగాలు వాటి పనితీరును సక్రమంగా నిర్వహించగలుగుతాయి. ఈ మెషీన్‌తో పేషెంటుకి బయటి నుంచి లైఫ్ సపోర్టు ఇస్తూ దేహంలో అనారోగ్యానికి గురైన అవయవానికి చికిత్స నిర్వహిస్తారు. ఈ టెక్నాలజీ గుండె కంటే శ్వాసకోశ వ్యవస్థలో లోపాలను సరి చేయడానికి బాగా ఉపకరిస్తుంది. హార్ట్ పేషెంట్లలో సక్సెస్‌రేట్ 40 నుంచి 50 శాతం ఉంటే, లంగ్స్ పేషెంట్లలో 60- 70 శాతం సక్సెస్ రేట్ ఉంటుంది.
హార్ట్ పేషెంట్లలో గుండె సాధారణ స్థితికి రావడం కష్టమనిపించినప్పుడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ... అందులో సక్సెస్‌రేట్ చాలా తక్కువ. దేహం ఫారిన్ బాడీని అంత సులువుగా ఆమోదించకపోవచ్చు. అప్పుడు మళ్లీ గుండె రికవర్ అయ్యే వరకు ఎక్మో సపోర్టు తీసుకోవాల్సిందే. అయితే ఎక్మో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పడం కష్టమే. అది పేషెంట్ వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యం, రోగనిరోధక శక్తి వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ఎక్మో ఎలా పని చేస్తుంది?
పేషెంటు తొడలోని సిర (వీన్) నుంచి ట్యూబు ద్వారా రక్తాన్ని మెషీన్‌లోని ట్యూబుకు అనుసంధానం చేస్తారు. అది మెషీన్‌లోని నియమిత పైపుల ద్వారా ప్రయాణించి మెంబ్రేన్ అరలోకి చేరుతుంది. అక్కడ కార్బన్‌డయాక్సైడ్ వేరవుతుంది. అక్కడి నుంచి ఆక్సిజనేటర్‌లోకి చేరి ఆక్సిజెన్‌తో కలిసి రక్తం ప్యూరిఫై అవుతుంది. శుద్ధి అయిన రక్తం మరొక ట్యూబ్ ద్వారా గుండె దగ్గర ఉండే ధమని (ఆర్టరీ)కి చేరుతుంది. అక్కడి నుంచి దేహంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. దేహ భాగాల నుంచి సిరల ద్వారా చెడు రక్తాన్ని సేకరించి, దానిని మంచి రక్తంగా మార్చి ధమనుల ద్వారా దేహమంతటికీ చేరవేస్తుంది. మానిటర్ మీద పల్స్‌రేటు, రక్తం సరఫరా వేగం నమోదవుతుంటుంది. ఎక్మో పరికరం గుండె చేయాల్సిన పనిని, శ్వాస వ్యవస్థ పనిని కూడా చేస్తుంది. వైద్యం ద్వారా శ్వాస వ్యవస్థ, గుండె లోపాలను సరిదిద్దే వరకు ఈ పరికరం వాటికి విశ్రాంతినిస్తుంది.
ఓ వారం ఆగాల్సిందే!
ఎక్మో పరికరంతో సపోర్టు మొదలుపెట్టిన తర్వాత రోగి స్పందన కోసం ఐదు నుంచి ఏడు రోజులు ఆగాల్సి ఉంటుంది. వారం తర్వాత ఈ యంత్రం నుంచి అందే సపోర్టును కొద్దిగా తగ్గించి దేహంలో స్పందనలను గమనిస్తారు. పల్స్, బిపిని పరీక్షిస్తూ, ఎకో పరీక్షలు కూడా చేస్తారు. ఇది నిపుణులైన వైద్యం బృందం ఆధ్వర్యంలో జరగాలి. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడు రక్త సరఫరా, పల్స్ ఒక మోస్తరుగా పని చేస్తున్నా రోగి చక్కగా స్పందిస్తున్నట్లే చెప్పాలి. అలాంటప్పుడు క్రమంగా ఎక్మో సపోర్టు తగ్గిస్తూ గుండె, శ్వాసవ్యవస్థ పూర్తి స్థాయిలో సొంతంగా పని చేసే వరకు పర్యవేక్షిస్తారు.
దీని అవసరం ఎప్పుడు?
ఎక్మో ట్రీట్‌మెంట్ సాధారణంగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ అయిన సందర్భాలలో నేరుగా ఉపయోగిస్తారు. ఈ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలోనే డయాలసిస్ చేయాల్సినప్పుడు దీని సహాయాన్ని పరోక్షంగా తీసుకుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్‌లో పేషెంటు దేహం నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి సేకరించకుండా ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా చేస్తారు.
కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించిన వెంటనే పేషెంటుకు సిపిఆర్ (కార్డియో పల్మనరీ రెససిటేషన్) చేస్తారు. అంటే గుండె మీద ఒత్తిడి కలిగిస్తూ గుండె తిరిగి కొట్టుకునే అవకాశం కోసం ప్రయత్నించడం. పేషెంటు ప్రాణాలను కాపాడడానికి సిపిఆర్ చేసి బ్లడ్ ప్రెషర్ మెయింటెయిన్ చేస్తూ ఎక్మో మెషీన్‌ను సిద్ధం చేసుకోవాలి. పేషెంటును ఎక్మో పరికరానికి అనుసంధానం చేసిన క్షణం నుంచి దేహంలో అన్ని అవయవాలూ యథాతథంగా పని చేస్తుంటాయి. అలా ఎన్ని రోజులైనా కొనసాగించవచ్చు.
ఏడెనిమిది వారాలపాటు ఉంచినా పేషెంటు కోలుకునే సూచనలు లేవనిపించినప్పుడు వైద్యబృందం ఆ సంగతిని పేషెంటు బంధువులకు తెలియ చేస్తుంది. హార్ట్ పేషెంట్ల విషయంలో ఎక్మో ట్రీట్‌మెంట్ చివరి ప్రయత్నం అనే చెప్పాలి. ప్రయత్నించకుండా వదిలేయడం కంటే ప్రయత్నించి ఫలితాల కోసం ఎదురు చూడడాన్నే వైద్యరంగం కోరుకుంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్మో ద్వారా కోలుకున్న కేసులు తప్పని సరిగా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఒకింత తక్కువ. ముందుగా చెప్పుకున్నట్లు పేషెంటు వయసు, ఇతర అనేక అంశాలతోపాటు దేహం ట్రీట్‌మెంట్‌కి స్పందించడం వంటివన్నీ కీలకమే.
ఇది ఖరీదైన వైద్యం!
ఎక్మో పరికరాలు హైదరాబాద్‌లో ఏడెనిమిదికి మించి లేవు. ఈ ట్రీట్‌మెంట్‌లో తొలిరోజే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చవుతుంది. వయసులో ఉండి, తగినంత డబ్బు ఉన్న సందర్భాలలోనే ఇది సాధ్యమవుతుంది. ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ ప్యాకేజ్‌లలో ఇది చేరలేదు. ప్రభుత్వం పూనుకుంటేనే ఇది సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది.
వెంటిలేటర్‌కీ ఎక్మోకీ తేడా!
వెంటిలేటర్ ద్వారా లంగ్స్‌లోకి నేరుగా ట్యుబ్ ద్వారా గాలిని పంపిస్తారు. ఆ గాలిని తీసుకుని మిగిలిన పని మొత్తం శ్వాసకోశ వ్యవస్థ చేసుకోవాలి. వెంటిలేటర్ నుంచి అందిన గాలిని దేహం స్వీకరించలేకపోతున్నప్పుడు ఎక్మో సేవలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. దీని ద్వారా ఊపిరితిత్తులకు కొంత విశ్రాంతినిచ్చినట్లవుతుంది. అలాగే వెంటిలేటర్ వాడినప్పుడు ట్యూబు ద్వారా లంగ్ ఇంజ్యూరీ రావచ్చు. ఎక్మోతో ఆ ఇబ్బందులు ఉండవు.
ఈసిఎంఓ... ఎక్మో... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితి విషమించిన నేపథ్యంలో తరచుగా వినిపించిన మాట. ఈసిఎంఓ అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్. దీనిని ఎక్స్‌ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్టు అని కూడా వ్యవహరిస్తారు. ఈ టెక్నాలజీతో శ్వాసకోశ, గుండె సమస్యలు ఎదురైనప్పుడు పేషెంటుకి బయటి నుంచి మెడికల్ సపోర్టు అందిస్తారు.
- వాకా మంజులారెడ్డి
డాక్టర్ కిశోర్ జయంతి
పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్
అండ్ ఎక్మో స్పెషలిస్ట్, స్టార్ హాస్పిటల్
హైదరాబాద్.
గుండెపోటుకూ...గ్యాస్‌కూ తేడా!
గుండెపోటు లక్షణాలూ, గ్యాస్ పైకి ఎగజిమ్మినప్పుడు కనిపించే లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దాంతో అది గుండెపోటా లేక అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్ సమస్యా అన్నది తెలియక కొందరు అయోమయానికి గురవుతుంటారు. సాధారణంగా చాలామంది గుండెపోటు, గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే.
గుండెనొప్పి (యాంజైనా)తో పాటు తేన్పులు వస్తుంటాయి. అందుకే దీన్ని గ్యాస్ సమస్యగా అపోహపడుతుంటారు. కొంతమంది శారీరక శ్రమ / ఉద్వేగం తర్వాత 5 - 15 నిమిషాల పాటు నొప్పి ఉంటుంది. మరికొందరిలో ఇది 20 నిమిషాలు కొనసాగుతుంది. నిమిష నిమిషానికీ చెమటలు పట్టడం పెరుగుతూ, వాంతులు, శ్వాస అందకపోవడం, చివరకు స్పృహ తప్పడం కూడా జరగవచ్చు. అప్పుడు దాన్ని గుండె సమస్యగానే పరిగణించాలి. ఉపశమన మందులు వాడినా.... నొప్పి తగ్గకపోతే సత్వరం రోగిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయాలి. పైన పేర్కొన్నట్లు నొప్పి తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూనే ఉంటే పూర్తిగా గుండె సంబంధితమైన నొప్పిగా పరిగణించాలి.
డా. ప్రమోద్ కుమార్
కుచులకంటి
సీనియర్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్, సోమాజిగూడ హైదరాబాద్.