ఆమె వయసుఎనిమిది పదులు.నిండు పండు ముదుసలి.యువతరం కంటె ఎక్కువ శక్తి, ఉత్సాహం ఉన్నాయి.సామాన్యుల కోసం రూపాయికి ఇడ్లీ తయారుచేస్తోంది.తమిళనాడులోని పెరూర్‌కి దగ్గర ఉన్న వడివేలయంపాలయానికి చెందిన కమలాతాళ్ ఇడ్లీ షాపేఈ వారం ఫుడ్ ప్రింట్స్...
కమలాతాళ్. పండు ముదుసలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేస్తుంది. స్వచ్ఛంగా స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి, తాజా కూరగాయలు తీసుకొస్తుంది. చట్నీ తయారుచేయడం కోసం రోలు సిద్ధం చేసి, తాజా కొబ్బరి, ఉప్పు వేసి, రుచికరమైన పచ్చడి చేస్తుంది ఈ అవ్వ. సాంబారులోకి కావలసిన కూరలన్నీ స్వయంగా తరిగి, మట్టితో అలికి చేసిన కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి ఉడికిస్తుంది. ముందురోజు రాత్రే ఇడ్లీ పిండి రుబ్బి సిద్ధం చేస్తుంది.
తమిళనాడులోని పెరూర్‌కి దగ్గరలో ఉన్న వడివేలయంపాలయం గ్రామంలో నివసించే ఈ అవ్వ, తన ఇంటి తలుపులు ఉదయం ఆరు గంటలకు తెరుస్తుంది. అప్పటికే ఇడ్లీ కోసం బోలెడుమంది బయట నిలబడి ఉంటారు. అవ్వ తలుపులు తెరవగానే, వారంతా ఆమెను నవ్వుతూ పలకరిస్తారు. అందరినీ ఆప్యాయంగా చూస్తూ, ఎవరెవరికి ఎన్నెన్ని కావాలో అడుగుతూ, వేడి వేడి ఇడ్లీ, ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది అవ్వ. ఇన్నీ కలిపి చాలా ఎక్కువ ధర అనుకుంటే పొరపాటే. ఒక ఇడ్లీ కేవలం ఒక రూపాయి మాత్రమే.
ఉదయం ఎనిమిది గంటలవుతున్నా వినియోగదారులు తమ వంతు వచ్చేవరకు ఎంతో ఓరిమిగా నిరీక్షిస్తూ ఉంటారు. ఇంతలోనే తన కోసం ఎవరైనా అతిథులు వస్తే, చిరునవ్వుతో పలకరిస్తుంది ఈ అవ్వ. అంతలోనే లోపలకు వెళ్లి ఒక చేతితో బకీటెడు సాంబారు, ఒక చేతితో ఇడ్లీలు అలవోకగా తెస్తుంటే, ఈ వయసులో ఇంత వేగంగా ఎలా పనిచేయగలుగుతుందా అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ‘‘మాది రైతు కుటుంబం. ప్రతిరోజూ మా కుటుంబ సభ్యులంతా నన్ను ఇంట్లో వదిలి పొలానికి వెళ్లేవారు. నేను ఒంటరిగా ఉండటంతో విసుగ్గా అనిపించేది. ఏదో ఒక పనిచేయాలనుకున్నాను. ఆ చుట్టుపక్కల ఉండేవారికోసం ఇడ్లీ వేయడం ప్రారంభించాను. ఇప్పుడు నా దగ్గరకు ఎంతోమంది రోజు కూలీలు వస్తుంటారు. అతి తక్కువ ధరలో స్వచ్ఛమైన కల్తీ లేని ఇడ్లీలు తింటున్నామన్న ఆనందం వారికి కలుగుతుంది. నేను వడివేలయంపాలెంలోనే ఇంటి దగ్గరే 30 సంవత్సరాలుగా ఇడ్లీలు అమ్ముతున్నాను’ అంటారు కమలాతాళ్.
కమలాతాళ్‌కు చిన్నతనం నుంచి రోట్లో రుబ్బిన పప్పుతోనే ఇడ్లీలు తయారుచేయడం అలవాటు. నేటికీ ఆమె అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. గ్రైండర్ కొనడం అనవసరమని భావించారు ఆమె. ‘‘నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అందువల్ల ఎక్కువమందికి వంట చేయడం అలవాటు నాకు. ప్రతిరోజూ పప్పు నానబెట్టి, శుభ్రంగా కడిగి, రుబ్బి మరుసటి రోజుకి సిద్ధం చేసుకుంటాను. ఇందుకోసం నాకు ప్రతిరోజూ ఆరు కిలోల పప్పు, బియ్యం కావాలి. రుబ్బడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. రోజూ తాజా పిండినే ఉపయోగిస్తాను.
ఉదయాన్నే మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఇడ్లీలు అమ్ముతారు కమలాతాళ్. ఒక వాయికి కేవలం 37 ఇడ్లీలు మాత్రమే సిద్ధమవుతాయి. రోజుకి మొత్తం వెయ్యి ఇడ్లీలు అమ్ముతారు ఈ అవ్వ. ‘‘పది సంవత్సరాల క్రితం ఒక ఇడ్లీ అర్ధరూపాయికి అమ్మేదాన్ని. రెండు సంవత్సరాల నుంచి ఇడ్లీ ధర రూపాయి చేశాను’’ అంటారు బోసి నవ్వుల అవ్వ.సాంబారుతో పాటు, రోజుకో కొత్తరకం చట్నీ తయారుచేస్తారు కమలాతాళ్. టేకు ఆకులు, అరటి ఆకుల్లో ఇడ్లీలు అందిస్తారు. వీటిని కూడా తన పొలం నుంచే తీసుకువస్తారు కమలాతాళ్. ‘‘మా ఇంటి చుట్టుపక్కల ఉన్న దిగువ మధ్యతరగతి వారే నా దగ్గర ఇడ్లీలు కొంటారు. వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. అంతా రోజు కూలీలే. అటువంటివారు రెండు ఇడ్లీలు 15 రూపాయలకో 20 రూపాయలకో కొనడం కష్టం.చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో ఒక ప్లేట్‌కి నాలుగు ఇడ్లీలు ఇస్తారు. కాని వీరు చేసే కష్టానికి ఆ నాలుగు ఇడ్లీలతో ఆకలి తీరదు. అందువల్ల కమతాతాళ్ వీరి గురించి ఆలోచించి, తాను తక్కువ ధరకు ఇడ్లీలు పెట్టడం వల్ల వారు నాలుగు రూపాయలు వెనకేసుకోగలుగుతారని భావించారు. ఇంత తక్కువకు ఇస్తున్నా, కమలాతాళ్‌కి రోజుకి 200 రూపాయలు మిగులుతున్నాయంటారు ఆవిడ. ‘‘ఇడ్లీ ధర పెంచరెందుకు అని నన్ను చాలామంది అడుగుతుంటారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెబుతాను, ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపుతున్నాను. అదే నాకు పెద్ద ఆదాయం’’ అని.కమలాతాళ్ ఇడ్లీల విషయం వార్తల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో, ఆయా ప్రాంతాల నుంచి ఇడ్లీల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ కమలాతాళ్ ఇడ్లీ ధర ఒక్క పైసా కూడా పెంచలేదు. రాబోయే రోజుల్లో కూడా పెంచనని చెబుతున్నారు.
ఈ ఇడ్లీలో సంప్రదాయం ఉంది
ఇక్కడి ఇడ్లీ పూర్తి సంప్రదాయంగా తయారవుతుంది. రోట్లో రుబ్బిన పిండి, శుభ్రంగా అలికిన మట్టి పొయ్యి, కట్టెల మంట మీద ఉడికే ఆరోగ్యకరమైన ఇడ్లీ, గారెలతో ఈ అవ్వ ఎంతోమందికి ఆరోగ్యం ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ అవ్వను స్ఫూర్తిగా తీసుకోవాలేమో!
ఇదే నా ఆరోగ్య రహస్యం
వయసు పైబడుతుండటంతో, మా మనవలు నన్ను ఈ వ్యాపారం మానేసి, ఆరోగ్యం చూసుకో మంటున్నారు. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు నేను ఈ పని చేయడం మానను. ఇలా చేస్తుండటం వల్లే నేను చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. ఇటీవలే గారెలు కూడా మొదలుపెట్టాను. ఒక్కోగారె ధర 2.50 పైసలు.
Comments
Please login to add a commentAdd a comment