దసరా ఉత్సవాల్లో... ఖాళీగా బంగారు సింహాసనం
మైసూర్ ప్యాలెస్ అనగానే కళ్లు చెదిరే ఆ కట్టడ నిర్మాణం, అలంకరణ మదిలో మెదులుతుంది. ఇక దసరా ఉత్సవాల్లో అయితే ఆ అలంకరణ మాటల్లో చెప్పలేం. అందులోనూ ప్యాలెస్‌లో ఉండే బంగారు సింహాసనం దసరా సంబరాల్లో అంతర్భాగమై వస్తోంది.
దసరా ఉత్సవాల ఆరంభంలో మైసూర్ మహారాజు ఆ సింహాసనం మీద కూర్చుని దర్బార్ నిర్వహిస్తారు. రాచరిక వ్యవస్థ రద్దు అయిన తర్వాత కూడా ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఈ బంగారు సింహాసనాన్ని కిందటేడాది వరకు శ్రీకాంతదత్త నరసింహరాజ వడయార్ రాజు అధిష్ఠించారు. ఆయన కిందటేడాది డిసెంబర్‌లో మరణించడం, ఆయనకు వారసులెవరూ లేకపోవడంతో ఈ సింహాసనం ఖాళీగా ఉంది.
ప్యాలెస్ సంరక్షణదారుడైన నరసింహ ఖాళీ సింహాసనం పై రాజు కత్తిని పెట్టి, పూజారులచే పూజలు జరిపించారు. వేదమంత్రాలు పఠించి, సింహాసనం పైన పవిత్ర జలాన్ని చల్లారు. విలువైన జాతి రత్నాలను పొదిగిన బంగారు గొడుగును పట్టారు. ‘రాజు ఆసీనుడై ఉన్నట్టుగానే భావించి, అన్ని కార్యక్రమాలను చేశామని’ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా బంగారు సింహాసం మైసూర్ మహారాజుల వంశాచారంగా ఎలా వచ్చిందో తెలిపారు.
ఒక కథనం ప్రకారం ఈ సింహాసనం పాండవుల కాలం నాటిదని తెలుస్తోంది. మరొక కథనంలో 14 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర బుక్కరాయల నుంచి ఈ సింహాసనం శ్రీరంగ పట్టణ సంస్థానాధీశుడైన శ్రీరంగరాయకు చేరిందని తెలుస్తోంది. మరొక కథనం ప్రకారం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1700 కాలంలో చిక్కదేవరాజ వడయార్‌కు ఈ సింహాసనాన్ని బహుమానంగా ఇచ్చారని చెబుతారు. ఈ సింహాసనాన్ని దసరా ఉత్సవాల్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.