
టూకీగా ప్రపంచ చరిత్ర 40
నేరం
అదే సమయంలో మరొక పరిణామం కూడా మెల్లిగా ప్రారంభమైంది. ఆరుగాలం పచ్చికమేతకు కొరవలేని ప్రదేశాల్లో స్థిర నివాసానికి మానవుడు ఆలోచించడం మొదలెట్టాడు. బహుశా, వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు ప్రధానమైన ప్రోత్సాహం అయ్యుండొచ్చు. స్థిరనివాసాలు ఏర్పడిన ప్రదేశాల్లో గుడారాల స్థానాన్ని గుడిసెలు ఆక్రమించాయి. ఐతే, వాటిని గుడారాలంత విశాలంగా నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం అలవడని కారణంగా, ఉమ్మడి జీవితానికి అనుకూలత చెల్లిపోయింది. దరిమిలా, ఒకే తెగ వేరువేరు కుటుంబాలుగా విడిపోయే ప్రక్రియ బహుశా ఆ దశలోనే జరిగుండాలి. శిథిలాలుగా బయటపడిన ఆనాటి గ్రామాలను పరిశీలిస్తే, అలాటి నివాసాలకు మొదట్లో తటాక తీరాలను ప్రధానంగా ఎన్నుకున్నట్టు కనిపిస్తుంది. ఏ గ్రామంలోనూ పది పదిహేను కుటుంబాలకు మించి నివసించిన ఆనవాళ్లు లేవు. గుడిసెల గోడలు మట్టివి కాగా, కలప ఆధారంగా పరిచిన కొమ్మలూ, ఆకులూ, వాటి ఉపరితలం మీద అలికిన బంకమట్టితో ఏర్పడింది కప్పు. నునుపుజేసి పేడతో అలికింది చప్పట. రాతితో, కొయ్యతో, ఎముకతో తయారైన పలురకాల పనిముట్లూ, చేత్తో చేసిన మట్టిపాత్రలూ, తీగెలతో అల్లిన బుట్టలూ, పేలాలుగా వేయించి పొడిజేసిన పిండి నిలువలూ, ధాన్యపు నిలువలూ, వంట చెరుకు నిలువలూ ఏ ఇంట్లో చూసిన సమృద్ధిగా కనిపిస్తాయి. మొదట్లో వాళ్లు సాగుచేసింది వర్షాధారపు పంటలైన బార్లీ, జొన్న. చాలా ఆలస్యంగా ప్రవేశించిన తృణధాన్యం గోధుమ. కాయధాన్యం ఆనవాళ్లు కనిపించవు.
నారతో అల్లిన వలలూ, పేలికలైన బట్టలూ చాలాచోట్ల దొరికాయి. బట్టల నేతను సులభతరం చేసే యాంత్రిక పనిముట్లు ఉనికిలోకి రానందున దుస్తులుగా ఉపయోగించిన సరుకుల్లో చర్మాలే ఎక్కువగా ఉన్నాయి. కూర్చునేందుకు పీటలుగానీ బల్లలుగానీ వాడుకలోకి రాలేదు. బహుశా నేలమీద బాసుపీటలు వేసుకుని కూర్చోవడమే ఆనాటి అలవాటయ్యుండొచ్చు. లేదా చాపలు వాడుకోనుండొచ్చు. పెంపుడు జంతువుల్లో ప్రధానంగా కనిపించేవి ఆవులూ, గేదెలూ, మేకలూ, గొర్రెలు. మనుషులతోపాటు పశువులు ఒకే కుటీరాన్ని పంచుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి అలవాటు రాయలసీమలో ఇప్పటికీ కొనసాగడం గమనిస్తే అది పెద్ద చోద్యంగా కూడా ఉండదు. పెంపుడు జంతువుల జాబితాలో పిల్లి లేదు, పంది లేదు, కోడి లేదు, బాతు లేదు. అప్పటిదాకా ఎలుకలు కుటీరాలను మరగిన ఆనవాళ్లు కనిపించవు. విడ్డూరం ఏమిటంటే, గుడిసెల్లో దీపాలు వెలిగించుకోవడం ఇంకా వాళ్లకు తెలిసిరాలేదు. రక్షణకోసం గుమ్మం వెలుపల వేసిన మంటల వెలుతురే రాత్రివేళల్లో ఆధారం.
నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు దొరక్కపోవడానికి కారణం బహుశా అవి కాలానికి నిలువనంత తేలికపాటివైనా అయ్యుండాలి, లేదా అలాంటివాటిని పొలం దగ్గరే వదిలేయడం వల్లనైనా అయ్యుండాలి. సేద్యానికి పశువులను వాడుకునే వసతి ఇంకా తెలీకపోవడంతో పోతు జంతువులన్నీ కోత జంతువులే. పెంటి జంతువుల కోతమీద నిషేధం ప్రాచీన సాహిత్యంలో సర్వత్రా కనిపించడం గమనిస్తే, మందలు పెరిగేందుకు అవి అవసరమై నందున, బహు శ్రద్ధగా వాటిని కాపాడుకున్నట్టు తెలుస్తుంది. పాలు పితకడం ఇప్పుడు సరికొత్త వ్యాపకం. అయితే, పాలుగానీ, పాల ఉత్పత్తులు గానీ వర్తకపు సరుకులుగా ఇంకా మారలేదు. సహజమైన ఆహార పదార్థంగా పాలను గుర్తించకముందు, పెరుగు, మీగడ వంటి ఉత్పత్తులను మాత్రమే వాడుకోనుండవచ్చు. పులియబెట్టిన ‘సారా’ వంటి మత్తు పానీయాలు అప్పట్లో మచ్చుకైనా కనిపించవు. పులియబెట్టే విధానం తెలియనంత మాత్రాన అప్పట్లో మత్తు పదార్థాలు బొత్తిగా లేవని చెప్పేందుకు వీలులేదు. సహజసిద్ధంగా దొరికే ‘బంగి’ ఆకు, కోకా ఆకు, ఇప్ప పువ్వు, గసాలకాయ, సోమ తీగె వంటి మాదకాల ఊసే ఎరుగనంత అమాయకులుగా వాళ్ళను స్వీకరించలేం.
రచన: ఎం.వి.రమణారెడ్డి
(సశేషం)
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com