చెప్పుకోండి చూద్దాం | Family crime story special | Sakshi
Sakshi News home page

చెప్పుకోండి చూద్దాం

Published Wed, Oct 10 2018 1:03 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

Family crime story special - Sakshi

ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్‌ స్టార్ట్‌ చేయ్‌’ అని డ్రైవర్‌నుఆదేశించాడు సీఐ. కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైరన్‌ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. 

జూన్‌ 05. 2017. సాయంత్రం.చిత్తూరు జిల్లా, భాకరాపేట సమీపం. దుస్సావాండ్లపల్లి శివారు చెరువు దగ్గర. అంతసేపూ కురిసిన వాన ఎవరో స్విచాఫ్‌ చేసినట్టు ఆగింది. గాలి మాత్రం హోరున వీస్తోంది.ఉండుండి ఉరుములు, మెరుపులు పోటీ పడుతున్నాయి. గాలి విసురుకి నేలను తాకుతూ పైకి లేస్తూ తంగేడు చెట్ల కొమ్మలు అవస్థపడుతున్నాయి.మళ్లీ వాన మొదలవుతుందేమో అని ఇంటికి త్వరగా వెళ్లేందుకు ఊరి మనిషి ఒకడు సైకిల్‌ తొక్కుతున్నాడు వేగంగా. గాలికి ఏదో ఎండుగడ్డి నలుసు కంట్లో పడింది. సైకిల్‌ తొక్కుకుంటూనే  ఒక చేత్తో తీసేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు. సైకిల్‌ ఆపి భుజంపై ఉన్న టవల్‌తో తుడుచుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా చెరువు వైపు చూశాడు. ఏదో కనిపించినట్టయ్యింది.మళ్లీ చూశాడు.వెంపలి చెట్టు పక్కన ఆకు పచ్చని గుడ్డ ఏదో గాలికి రెపరెలాడుతోంది. నిశితంగా చూశాడు. అది చీర. లోతుగా చూశాడు. గుండె ఝల్లుమంది. బురదలో నుంచి పైకి లేచిన రెండు కాళ్లు. నాలుగు అడుగులు వేసి చెరువు దగ్గరికి వెళ్లాడు. దుర్వాసన. అతనికి అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పుడే మళ్లీ వర్షం మొదలైంది.

సీఐ చెరువు దగ్గరకు వచ్చి చూశాడు. అప్పటికే బాగా ఉబ్బి, చివికిపోయిన మహిళ శవం. కొంత నీళ్లలో మరికొంత బురదలో కూరుకుపోయి ఉంది.  ఊర్లో వాళ్లతో కలిసి శవాన్ని బయటికి తీయించాడు.చనిపోయిన మనిషి బాహ్య ఆనవాళ్లు తెలుస్తున్నాయి. కాని ముఖం గుర్తుపట్టలేకుంది. ఎన్ని రోజులయ్యిందో...  శరీరం జీర్ణావస్థలో ఉంది.‘వాన తగ్గింది కదా..  క్లూస్‌ ఏమైనా దొరుకుతాయేమో జాగ్రత్తగా వెదకండి’ సిబ్బందిని ఆదేశించాడు సీఐ.క్లూ కోసం వెదుకుతున్నారు కానిస్టేబుళ్లు. చెరువు గట్టు కింద ఒక చెప్పు దొరికింది. సిబ్బంది ఆ చెప్పును సీఐకి చూపించారు. అది ఆమెదే అయ్యుంటందనే నిర్థారణకు వచ్చాడు సీఐ. శవాన్ని పోస్టుమార్టంకి పంపాడు. 
 

మరుసటి రోజు ఉదయం 10 గంటలు.ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్‌ స్టార్ట్‌ చేయ్‌’ అని డ్రైవర్‌ను ఆదేశించాడు సీఐ.కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైర న్‌ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. 20 నిమిషాల తరువాత ఆ గ్రామానికి చేరుకున్నారు. సైరన్‌ సౌండ్‌కు ఇళ్లలోని జనం ఆందోళనగా బయటికొచ్చారు.‘ఊరి చివర చెరువులో ఓ ఆడమనిషి చచ్చి శవమై తేలిందంట. ఎవరై ఉంటారో’.. అని జనం బిక్కుబిక్కుమంటున్నారు.కానిస్టేబుల్‌ మైక్‌లో ‘ఆడోళ్లందరూ రచ్చబండ ఉన్న చోటుకు రావాలి’ అని అనౌన్స్‌ చేశాడు.భయం భయంగా పరుగున వచ్చారు గ్రామంలోని మహిళలు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులూ.‘ఒక్కొక్కరికీ.. చెరువు దగ్గర దొరికిన చెప్పు చూపించు’  కానిస్టేబుల్‌ను ఆదేశించాడు సీఐ. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకునేవారా? జాగ్రత్తగా చూసి చెప్పండి’.. అని అందరికీ చూపిస్తున్నాడు కానిస్టేబుల్‌.అందరూ ‘తెలియదు’ అని చెప్పారు.‘అది ఖరీదైన చెప్పు సార్‌! మా ఊళ్లో ఎవరూ వేసుకోరు’ బదులిచ్చారు.సీఐ ఆలోచనలో పడ్డాడు.అటువైపుగా గడ్డి ఎత్తుకెళుతున్న ఓ ఆడమనిషిని దూరం నుంచే చూసిన సీఐ ‘ఆమెను ఇలా పిలుచుకురండి’ అని ఆదేశించాడు.కానిస్టేబుల్‌ ఆమె దగ్గరికి పరిVð త్తుకు వెళ్లి ‘మా సార్‌ పిలుస్తున్నాడు’ అన్నాడు.‘ఎందుకూ’ అంది ఆమె.

‘ఊరంతా అక్కడే ఉంది..’ అని కానిస్టేబుల్‌ విషయం చెప్పేసరికి ఆమె గడ్డి మూట కింద పడేసి గబగబా సీఐ ఉన్న చోటుకు వచ్చింది. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకోవడం చూశావా..’ ప్రశ్న పూర్తికాకముందే... ‘చూశా సార్‌! బెంగుళూరామే వేసుకుంటది’.. అందామె.‘బెంగుళూరామేనా?’ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సీఐ.‘ఈ ఊరోళ్లే సార్‌. ఏడెనిమిదేళ్ల కింద బెంగుళూరు వెళ్లిపోయారు! ఇప్పుడు బెంగుళూరులో బతుకుతాండారు. వెంకటప్ప పెండ్లాం అనిత ఇట్టాంటి చెప్పులే వేసుకుంటాది సార్‌’ అంది.‘ఈ మధ్య కాలంలో ఆమె ఎప్పుడైనా ఈ ఊరు వచ్చిందా’‘రాలేదు సార్‌. మొగుడొక్కడే వస్తున్నాడు.అంతకుమించి నాకేం తెలియదు సార్‌’ అంది ఆమె.‘సరే.. సరే..’ చెప్పిన వివరాలు నోట్‌ చేసుకొని అందరినీ వెళ్లిపొమ్మన్నారు.  ‘చనిపోయిన మహిళ పేరు అనితనే అయ్యుంటుందా?’ సీఐ ఆలోచనలో పడ్డాడు.ఇది తమ అనుమానం మాత్రమే. రుజువులు ఏమీ లేవు. ఒకవేళ అనితనే అనుకుంటే ఆమెను ఎవరు చంపి ఉంటారు? భర్తా? అయితే, ఎందుకు? పోలీసులు రోజూ దుస్సావాండ్లపల్లికి వెళ్లి వస్తూ మరికంత సమాచారం కోసం వాకబు చేస్తున్నారు అనిత కుటుంబీకులు ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నారు. ఈలోపు అనిత భర్త వెంకటప్ప, అతని అన్న ఊరికి వచ్చారని అనిత రాలేదని తెలిసింది. వెంటనే వెంకటప్పను పిలిచి ‘నీ భార్య అనిత ఏమైంది’ అని అడిగాడు సీఐ. ‘బెంగుళూరులోనే ఉంది సార్‌. ఎందుకు అడుతున్నారు?’ అనుమానంగా అడిగాడు వెంకటప్ప. ‘మరేం లేదు. ఓ కేసు విషయమై ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు వెళ్లచ్చు’ అని స్టేషన్‌కి బయల్దేరాడు సీఐ. అనిత బెంగళూరులో ఉంటే చనిపోయిన ఈమె ఎవరు? అనుమానాలే తప్ప మరే రుజువులు దొరకడం లేదు. విసుక్కున్నాడు సీఐ. ఊర్లోనే మరికొందరిని కలిసి, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో చెప్పి స్టేషన్‌కి వెళ్లిపోయాడు. 

జులై 15. దుస్సావాండ్లపల్లి నుంచి సీఐకి ఒక ఇన్ఫర్మేషన్‌ వచ్చింది. ‘బెంగళూరులో అనిత భర్త వెంకటప్ప అన్న కూతురు వివాహం జరుగుతోంది’ అని ఆ ఫోన్‌ తాలూకు సారాంశం.సీఐకి అనుమానం వచ్చింది. సొంత ఊళ్లో పెళ్లి జరపకుండా బెంగళూరులో పెళ్లి ఎందుకు జరుపుతున్నారు? బెంగుళూరు వెళ్లి స్థిరపడినా తరచూ ఊరికి మాత్రం వస్తూనే ఉన్నారు...  స్థిరాస్తులు కూడా ఇక్కడే ఉన్నప్పుడు పెళ్లి ఇక్కడే చేయాలి కదా అనుకున్నాడు. ఏదైతేనేం మరిన్ని వివరాలు రాబట్టాలంటే ఈ పెళ్లికి వెళ్లాలి. నిర్ణయానికి వచ్చిన సీఐ తన సిబ్బందిని పిలిచాడు. పెళ్లి జరుగుతున్న రోజు సీఐ టీమ్‌ బెంగుళూర్‌ వెళ్ళింది. ఆ పెళ్లిలో అనిత లేదు. పోలీసులకు అర్థమైంది. వెంటనే అనిత భర్త వెంకటప్ప, అతని అన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో విచారణ చేయడంతో వెంకటప్ప అతని అన్న తప్పు ఒప్పుకున్నారు. 


అనితను చంపడానికి ఒక్కో కారణాన్ని పోలీసుల ముందు బయటపెట్టారు అన్నాదమ్ములు.  అనితకు వెంకటప్పకు పెళ్లయ్యి 15 ఏళ్ల పైనే అయ్యింది. ఓ కూతురు కూడా ఉంది. వెంకటప్ప చిన్న కంపెనీలో ప్రైవేట్‌జాబ్‌ చేస్తుండేవాడు. అతని అన్న కుటుంబం కూడా బెంగుళూరులోనే ఉంది. రెండేళ్ల కిందటి వరకు బాగానే ఉన్న అనితకు కొత్త కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విలాసవంతమైన జీవనం కోరుకునేది. అందుకు భర్త వెంకటప్పని డబ్బులు ఇవ్వాలని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ‘కోరినవన్నీ తెచ్చివ్వలేనని, ఉన్నదాంట్లోనే సర్దుకోవాలని’ ఖరాకండిగా చెప్పేవాడు వెంకటప్ప. ఇద్దరికీ తరచూ గొడవలు అయ్యేవి. వెంకటప్పతో ఉంటే తన సరదాలు ఎలాగూ తీరవని నిశ్చయించుకున్న అనిత తనకు ఉన్న పరిచయాలను ‘ఉపయోగించుకోవడం’ మొదలుపెట్టింది. ఎంతటి పనులు చేయడానికైనా వెనకాడేది కాదు. ధనవంతులతో పరిచయాలు  ఏర్పరుచుకుంది. కార్లు, నగలు, ఖరీదైన దుస్తులు కొనుగోలు చేస్తుండేది. వెంకటప్ప నచ్చచెప్పాలని చూసినా వినేది కాదు. ఎదురు తిరిగేది. ఓ రోజు వెంకటప్ప అన్న కూడా అనితకు చెప్పి చూశాడు. ఇలాగే ఉంటే విషయం చాలా దూరం వెళుతుందని బెదిరించాడు. ‘నాకు పెద్ద పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి. నా దారికి అడ్డు వస్తే మీ ఇద్దరిని చంపేయడానికి నాకెంతో టైమ్‌ పట్టదు’ అంటూ ఎదురు తిరిగింది అనిత. దాంతో అన్నదమ్ములిద్దరూ భయపడిపోయారు. ఈ విషయం బంధువుల్లోనూ, ఊర్లోనూ తెలిస్తే తమ పరువు పోతుందని ఆలోచనలో పడ్డారు. ఒక నిశ్చయానికి వచ్చారు. 

కొన్ని రోజులు మౌనంగా ఉన్న వెంకటప్ప ఓ రోజు అనితతో.. ‘ఊళ్లో మనకు భూములున్నాయి కదా! వాటిని అమ్మకానికి పెట్టాం. నువ్వు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఊరెళ్లి రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తయ్యాక తిరిగి వద్దాం’ అన్నాడు.‘సరే’ అని బయల్దేరింది అనిత. మే 31 రాత్రి సమయానికి కారులో దుస్సావాండ్లపల్లి శివారు ప్రాంతంలోని చెరువు కట్టమీదుగా వెళుతున్నారు అనిత, వెంకటప్ప అతని అన్న. అప్పటికే బాగా చీకటి పడింది. ఓ చోట కారు ట్రబుల్‌ ఇచ్చి ఆగిపోయిందని అన్నదమ్ములిద్దరూ కిందకు దిగారు. కారు స్టార్ట్‌ అవడం లేదని అనిత కూడా దిగింది. అక్కడే అన్నదమ్మలిద్దరూ అనితను గొంతుపిసికి చంపేశారు. అనిత శరీరాన్ని చెరువు కట్టమీదుగా ఓ వైపుకు తీసుకెళ్ళారు. చెరువు ఒడ్డున కొంతమేరలోపలికి వెళ్లి అక్కడ బురదగా ఉన్న చోట తవ్వి, అనిత శరీరాన్ని అందులో పూడ్చేసి, పైన కొన్ని రాళ్లు పడేసి తిరిగి కారులో వెళ్లిపోయారు. పెనుగులాటలో అనిత చెప్పు ఒకటి గట్టు మీద పడిపోగా,మరికొటి చెరువు నీటిలో ఎటో కొట్టుకుపోయింది. గట్టు మీద పడిపోయిన కాలి చెప్పు మౌన సాక్ష్యంగా ఉండిపోయింది.ఐదు రోజుల తర్వాత విపరీతంగా కురుస్తున్న వానలకు శరీరం కొంతవరకు పైకి తేలింది. అభిప్రాయ భేదాలు, చెడు ప్రవర్తనలు, కుటుంబానికి మచ్చ తెచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు అందుకు కారణమైన వ్యక్తులను చట్టబద్ధంగా వదిలించుకోవచ్చు.కాని మనమే నేరపూరితమైన చర్యలకు పూనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
– గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement